
‘ఉపాధి’లో అక్రమాలపై విచారణ చేయించాలి
లక్ష్మీపురం: ఉపాధి హామీ పథకం పనుల్లో అవినీతిపై కేంద్ర ప్రభుత్వం విచారణ చేయించాలని వైఎస్సార్ సీపీ పంచాయతీరాజ్ విభాగ అధ్యక్షులు దాసరి రాజు కోరారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని శంకర్ భవన్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షులు వెన్నుపూస రవీంద్రరెడ్డి సూచనల మేరకు తాడికొండ, మంగళగిరి, ప్రత్తిపాడు నియోజకవర్గ నాయకులు కలెక్టర్ ఎస్.నాగలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా దాసరి రాజు మాట్లాడుతూ ఎన్‌ఆర్‌ఈజీఎస్ చట్టం మేరకు ఉపాధి హామీ పనులను గ్రామ పంచాయతీల ద్వారానే జరిపించాలని డిమాండ్ చేశారు. కూలీలకు సకాలంలో బిల్లులు చెల్లించాలని కోరారు. సర్పంచులకు కూడా తల్లికి వందనం పథకాన్ని తక్షణమే వర్తింపజేయాలని విన్నవించారు. 15వ ఫైనాన్స్ కమిషన్ విడుదల చేసిన రూ.1,150 కోట్లను స్థానిక సంస్థలకు తక్షణమే జమ చేయాలని డిమాండ్ చేశారు. బిల్లుల చెల్లింపుల్లో రాజకీయ జోక్యం నివారించాలని కోరారు. కార్యక్రమంలో తాడికొండ, మంగళగిరి, ప్రత్తిపాడు నియోజకవర్గం పంచాయతీరాజ్ అధ్యక్షులు పూసపాటి వెంకటరామిరెడ్డి , ఈపూరు రమేష్, దొడ్డా రాంజీ అంబేడ్కర్, ఫిరంగిపురం మేడుకొండూరు మండలాల పంచాయతీరాజ్ అధ్యక్షులు గుత్తికొండ ప్రతాపరెడ్డి, షేక్ హాజీ, తాడికొండ, మేడికొండూరు మండలాల పార్టీ అధ్యక్షులు ముప్పాళ్ల మనోహర్, తాళ్లూరి వంశీ, తాడికొండ మండల మైనారిటీ అధ్యక్షులు షేక్ బాబావలి, పార్టీ నాయకులు గుత్తికొండ అంజిరెడ్డి, పెరికల చిన్న, గంపల గంగాధర్ యాదవ్, బాకీ వెంకటస్వామి, మాదాసు ధర్మరాజు, షేక్ మీర్జావలి షేక్ సలీం, గుంటి రఘువరన్ గోల్డు బాబు, రాయపూడి ఇమ్మానియేలు పాల్గొన్నారు.
‘సదరం’ కేంద్రాల్లో
మౌలిక వసతులు కల్పించాలి
లక్ష్మీపురం: సదరం సర్టిఫికెట్ రీవెరిఫికేషన్ కేంద్రాల్లో దివ్యాంగులకు మౌలిక వసతులు కల్పించాలని వైఎస్సార్ సీపీ దివ్యాంగుల విభాగం రాష్ట్ర అధ్యక్షులు బందెల కిరణ్‌రాజ్ కోరారు. వికలాంగుల హక్కుల చట్టానికి సంబంధించిన విధివిధానాలను అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పటిష్టంగా అమలుచేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కిరణ్‌రాజ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా ఒక్క కొత్త పెన్షన్, సదరం సర్టిఫికెట్ కూడా మంజూరు చేయలేదని విమర్శించారు. గుంటూరు జిల్లా దివ్యాంగుల విభాగం అధ్యక్షులు బొక్క అగస్టీన్ మాట్లాడుతూ పెన్షన్ రీ వెరిఫికేషన్ ప్రక్రియ తీసుకువచ్చి ఆరోగ్య కేంద్రాల చుట్టూ దివ్యాంగులను తిప్పుతున్నారని విమర్శించారు. కార్యక్రమంలో దివ్యాంగుల విభాగం ప్రత్తిపాడు నియోజకవర్గ అధ్యక్షులు నాగుల్ మీరా, నాయకులు గణేష్, కిరణ్ పాల్గొన్నారు
వైఎస్సార్ సీపీ పంచాయతీరాజ్ విభాగ అధ్యక్షులు దాసరి రాజు

‘ఉపాధి’లో అక్రమాలపై విచారణ చేయించాలి