
బోనభాగ్యం
ఇంద్రకీలాద్రి(విజయవాడపపశ్చిమ): తెలంగాణ హైదరాబాద్‌లోని భాగ్యనగర్ శ్రీమహంకాళీ జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల కమిటీ తరఫున ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు ఆదివారం బంగారు బోనాన్ని సమర్పించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో సకాలంలో వర్షాలు కురిసి, పాడి పంటలతో రైతులు, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ గత 16 ఏళ్లుగా ఏటా ఆషాఢ మాసంలో దుర్గమ్మకు బంగారు బోనం సమర్పించడం ఆనవాయితీ. ఆదివారం ఉదయం బ్రాహ్మణ వీధిలోని జమ్మిదొడ్డి వద్ద అమ్మవారి ఉత్సవ మూర్తికి బోనాల కమిటీ ప్రతినిధులు, దుర్గగుడి ఈవో శీనానాయక్ దంపతులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాలు, తీన్‌మార్ డప్పులు, బేతాళ నృత్యాలు, కళాకారులు విన్యాసాలు, వివిధ వేషధారణలు, పోతురాజుల విన్యాసాలతో వైభవంగా ఊరేగింపు ప్రారంభమైంది. తెలంగాణ సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ సుమారు 500 మంది కళాకారులు తమ కళలను ప్రదర్శిస్తూ ముందుకు సాగారు.
భక్తుల బారులు..
జోగిని శ్యామలాదేవి బంగారు బోనాన్ని తలపై పెట్టుకుని ఊరేగింపులో ముందుకు సాగగా.. వెండి తదితర బోనాలతో మిగిలిన వారు ముందుకు సాగారు. బంగారు బోనాన్ని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రి పరిసరాలకు తరలివచ్చారు. దుర్గాఘాట్‌కు చేరుకున్న ఊరేగింపు కృష్ణమ్మకు గంగ తెప్పను సమర్పించిన పట్టుచీర, పూలు, పండ్లు, పూజా సామగ్రిని సమర్పించారు. అనంతరం దుర్గాఘాట్, ఘాట్‌రోడ్డు మీదగా ఊరేగింపు ఆలయ ప్రాంగణానికి చేరుకుంది.