● రూ. 3 లక్షల విలువైన మెత్ డ్రగ్ స్వాధీనం ● బెంగళూరు
టోల్‌గేట్ వద్ద గంజాయి పట్టివేత
మంగళగిరి: మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో కాజ టోల్ గేట్ వద్ద భారీగా గంజాయి, మెత్ డ్రగ్స్‌ను ఈగల్ టీమ్ పోలీసులు సోమవారం పట్టుకున్నారు. బెంగుళూరు నుంచి వైజాగ్‌కు బస్సులో వెళుతున్న యువకుడు భారీగా గంజాయి తరలిస్తున్నాడనే సమాచారం మేరకు ఈగల్ టీమ్ సోమవారం కాజ టోల్ గేట్ వద్ద నిఘా వేసింది. యువకుడిని అదుపులోకి తీసుకుని, అతని వద్ద నుంచి భారీ మొత్తంలో గంజాయితో పాటు రూ. 3 లక్షల విలువైన మెత్‌ను స్వాధీనం చేసుకుంది. యువకుడిని మంగళగిరి రూరల్ పోలీసులకు అప్పగించింది. గంజాయి, మెత్ అక్రమ రవాణా వెనుక ఎవరున్నారు..ఎంత మంది ఉన్నారనే ? అంశాలపై పూర్తి స్థాయిలో విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
పొలాల్లో అస్థిపంజరం లభ్యం
తెనాలి రూరల్: పొలాల్లో అస్థిపంజరాన్ని స్థానికులు సోమవారం గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. తెనాలి నుంచి బుర్రిపాలెం వెళ్లే రోడ్డులో నేలపాడు పంచాయతి పరిధిలోని ఓ ప్రైవేటు పాఠశాలకు తూర్పు వైపున ఉన్న పొలంలో అస్థిపంజరాన్ని గుర్తించారు. పోలీసుల ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఎముకల గూడు పక్కన గళ్ల లుంగీ ఉంది. ఇదే పాఠశాల సమీపంలో బిచ్చగాడు నెల రోజులుగా కనబడకుండాపోయాడని, అతని అస్థిపంజరం అయి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బాలికపై ‘అమ్మా’నుషం
తాడేపల్లి రూరల్ : వ్యభిచారంలోకి దించిన కన్నతల్లిపై మైనర్ కూతురు తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో సోమవారం ఫిర్యాదు చేసింది. కృష్ణాజిల్లా కూచిపూడి గ్రామానికి చెందిన ఓ మహిళ భర్త చనిపోయిన తరువాత మరో వ్యక్తితో సహజీనం చేస్తూ వడ్డేశ్వరం వచ్చి నివసిస్తోంది. 17 ఏళ్ల కూతురిని కూడా అతనితో ఉండాలంటూ ఒత్తిడి చేయడంతో పాటు వ్యభిచారం వృత్తిలోకి దింపింది. ఈ బాధలు భరించలేక బాలిక పక్కింట్లో నివాసముంటున్న మహిళ సాయంతో తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యా దు చేసింది.


