
జర్నలిస్టుపై దాడి హేయం
గుంటూరు మెడికల్: మాచర్ల నియోజకవర్గం కారంపూడిలో వైఎస్ ఎంపీపీ ఉప ఎన్నిక న్యూస్ కవరేజ్‌కు వెళ్లిన సాక్షి టీవీ ప్రిన్సిపల్ కరస్పాండెంట్ అశోక్‌వర్ధన్‌పై కొందరు స్థానిక వ్యక్తులు దాడి చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు (ఏపీయూడబ్ల్యూజే) నేతలు ఖండించారు. ఈమేరకు మంగళవారం బాధితుడు అశోక్‌వర్ధన్‌తో పాటు పలువురు జర్నలిస్టులు ఎస్పీ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) జి.వి.రమణమూర్తిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా జర్నలిస్టు యూనియన్ నగర అధ్యక్షుడు వి.కిరణ్‌కుమార్ మాట్లాడుతూ విధి నిర్వహణలో భాగంగా వార్తల సేకరణకు వెళ్లిన అశోక్‌వర్ధన్ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇలాంటి దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. యూనియన్ నగర కార్యదర్శి కె.ఫణీంద్ర మాట్లాడుతూ కూటమి నేతలు జర్నలిస్టులపై దాడులు జరగకుండా నిలువరించాలన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ‘సాక్షి’ మీడియాపై మూడు సార్లు దాడులు జరిగాయయని వెల్లడించారు. వినతి పత్రం అందజేసిన వారిలో ‘సాక్షి’ బ్యూరో ఇన్‌చార్జి డి.రమేష్‌బాబు, ఫొటోగ్రాఫర్ రామ్‌గోపాలరెడ్డి, సుభాని, మొండితోక శ్రీనివాసరావు, పి.ప్రశాంత్(నాని), డి.ప్రకాష్, ఎం.శ్రీనివాసరావు, కె.శ్రీనివాసరావు, ఎం.కోటిరెడ్డి, సీహెచ్ కృష్ణ, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు సురేంద్రనాథ్, రాఘవ, జయపాల్, శ్రీనివాస్, తుమ్మలకిరణ్ తదితరులు పాల్గొన్నారు.
బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో నిరసన అడిషనల్ ఎస్పీని కలిసి వినతిపత్రం అందజేత