
వైఎస్ జగన్ ఫొటో ఉందని సెక్రటరీ సస్పెన్షన్
నెహ్రూనగర్: మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఫొటో ఫ్లెక్సీలో ఉందనే కారణంతో గుంటూరు నగరంలోని 91వ వార్డు సచివాలయం అడ్మిన్ సెక్రటరీ పూర్ణిమను సస్పెండ్ చేస్తూ నగరపాలక సంస్థ అధికారులు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. గత ప్రభుత్వం హయాంలో ఏర్పాటు చేసిన వార్డు సచివాలయాలు ప్రత్యేకంగా సచివాలయం కనిపించే ఉద్దేశంతో బోర్డులను ఏర్పాటు చేశారు అప్పటి అధికారులు. అయితే గత సంవత్సరంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో బోర్డుల్లోని మాజీ సీఎం ఫొటోలు కనిపించకుండా స్టిక్కర్లు, అంటించుకోవాలని సిబ్బందికి అధికారులు తగు ఆదేశాలు జారీ చేశారు. కొత్త బోర్డులు రాకపోవడంతో సచివాలయాల వద్ద పాత బోర్డులే దర్శనమిస్తున్నాయి. అయితే రెండు రోజుల నుంచి కురిసిన వర్షాలకు ఏటీ అగ్రహారం జీరో లైన్ 91వ సచివాలయం బయట బోర్డుకు ఉన్న స్టిక్కర్ వర్షానికి తడిచి ఊడిపోయింది. దీంతో అటుగా వెళ్లే కొంత మంది మాజీ సీఎం ఉన్న ఫొటోను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీన్ని అదునుగా తీసుకున్న నగరపాలక సంస్థ అధికారులు సచివాలయ వార్డు అడ్మిన్ సెక్రటరీ ఎన్.పూర్ణిమను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అధికారులు సకాలంలో బోర్డులు తొలగించి ఉంటే ఈ సస్పెన్షన్ ఉండేది కాదు కాదా.. అధికారులు చేసిన తప్పిదానికి మమ్మల్ని బలిని చేస్తారా అంటూ సచివాలయ సెక్రటరీల యూనియన్ నాయకులు మండిపడుతున్నారు.