
పశ్చిమ డెల్టా మరమ్మతులకు రూ.25 కోట్లు మంజూరు
జలవనరుల శాఖ ఎస్‌ఈ వెంకటరత్నం
తెనాలి: కృష్ణా పశ్చిమ డెల్టాలోని పంట, మురుగు కాల్వల మరమ్మతులను జూన్ పదో తేదీలోగా పూర్తి చేయాలని జలవనరుల శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ పులిపాటి వెంకటరత్నం సూచించారు. పశ్చిమ డెల్టా ప్రాజెక్టు కమిటీ సమావేశం సోమవారం సాయంత్రం స్థానిక జలవనరుల శాఖ డివిజన్ కార్యాలయం హాలులో నిర్వహించారు. ప్రాజెక్టు కమిటీ చైర్మన్ పంతాని మురళీధరరావు అధ్యక్షత వహించారు. ఇంజినీర్ వెంకటరత్నం మాట్లాడుతూ ఖరీఫ్ సీజను ఆరంభానికి మరమ్మతుల పనులన్నీ పూర్తికావాలని ఆదేశించారు. నారుమడులకు సాగునీటిని జూన్ పదో తేదీ నాటికి పంట కాల్వలకు విడుదల చేసే అవకాశం ఉందని తెలిపారు. ఆలోగా కాల్వలు, డ్రెయిన్లు సిద్ధంగా ఉంచాలని చెప్పారు. మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.25 కోట్లను మంజూరు చేసిందని వెల్లడించారు. ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ పంతాని మురళీధరరావు మాట్లాడుతూ పశ్చిమ డెల్టాలో పంట, మురుగు కాల్వలకు మరమ్మతుల్లో మొత్తం 746 పనులను గుర్తించినట్టు తెలిపారు.