
నల్లబర్లీ రైతుల గోడు పట్టించుకోని ప్రభుత్వం
నరసరావుపేట: పొగాకు కొనుగోలు కంపెనీ ప్రతినిధుల మాటలు నమ్మి నల్లబర్లీ పొగాకు సాగుచేసిన రైతులు నిలువునా మునిగిపోతున్నారని, ప్రభుత్వం సైతం వారి గోడు పట్టించుకోవడం లేదని కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.హరిబాబు పేర్కొన్నారు. గురువారం స్థానిక కలెక్టరేట్ వద్ద పొగాకు రైతులతో ధర్నా నిర్వహించారు. హరిబాబు మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో నల్లబర్లీ పొగాకును కనీస మద్దతు ధర రూ.15వేల నుంచి రూ.18వేల వరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గత ఏడాది ధర కాస్త ఆశాజనకంగా ఉండడం, కంపెనీ ప్రతినిధులు గ్రామాల్లో తిరిగి రైతులను సంప్రదించి ఇతర పంటలు సాగు చేయొద్దని, నల్లబర్లీ సాగుచేస్తే మంచి ధర చెల్లిస్తామని నమ్మించారన్నారు. తీరా పంటచేతికి వచ్చాక కంపెనీలు మొత్తం సిండికేట్‌గా ఏర్పడి రైతులను లూటీ చేసేందుకు సిద్ధమయ్యాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మోసాన్ని ప్రభుత్వం చోద్యంగా చూస్తుందని ఎద్దేవా చేశారు. పర్చూరు, ఇంకొల్లు తదితర ప్రాంతాలలో పొగాకు సాగుచేపట్టిన రైతులు, కౌలురైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఎంతమంది ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వం స్పందిస్తుందని ప్రశ్నించారు. ఇటీవల ఉద్యాన పంటలపై సమీక్షించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతి ఎకరాకు రూ. లక్ష ఆదాయం వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని చెబుతున్న వ్యాఖ్యలు గారడీ మాటలను తలపిస్తున్నాయన్నారు.
స్పందించకుంటే సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తాం..
రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య మాట్లాడుతూ దేశంలో వందేళ్ల చరిత్రలో పండించిన పొగాకులో 30శాతం మాత్రమే భారతదేశంలో వినియోగిస్తున్నారని 70 శాతం విదేశాలకు ఎగుమతి చేస్తున్నారని, ఇంత డిమాండ్ ఉన్నప్పటికీ ఎగుమతి చేసే పొగాకును కంపెనీలు ఎందుకు కొనడంలేదని ప్రశ్నించారు. పొగాకు కొనుగోలుకు ఇప్పటికై నా ప్రభుత్వం ముందుకు రాకపోతే ఈనెల చివరిలో రైతులను ఏకంచేసి ఛలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి పిలుపునిస్తామని హెచ్చరించారు. కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.రాధాకృష్ణ, రైతు సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షుడు గుంటుపల్లి బాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఏపూరి గోపాలరావు, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కామినేని రామారావు, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు నాయక్, ఉపాధ్యక్షుడు గుంటూరు విజయకుమార్ అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో దయనీయంగా కౌలు రైతుల పరిస్థితి
కలెక్టరేట్ వద్ద ధర్నాలో రైతు, కౌలు రైతు సంఘాల నాయకులు