
పకడ్బందీగా సప్లిమెంటరీ పరీక్షలు
పరీక్షలపై డీఆర్‌ఓ షేక్ ఖాజావలి సమీక్ష
గుంటూరు వెస్ట్: పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు, ఇంటర్మీడియట్ (ఓపెన్ స్కూల్) పబ్లిక్ పరీక్షలు సజావుగా జరిగేందుకు వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని డీఆర్‌ఓ షేక్ ఖాజావలి తెలిపారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని డీఆర్‌ఓ చాంబర్‌లో నిర్వహించిన అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 19 నుంచి 28వ తేదీ వరకు జరుగుతాయన్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు. ఈపరీక్షలకు జిల్లా మొత్తం 27 పరీక్షా కేంద్రాలు, 4,224 మంది విద్యార్థులు హాజరు కానున్నారని పేర్కొన్నారు. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ఈనెల 19 నుంచి 24వ తేదీ వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయన్నారు. జిల్లాలోని ఆరు పరీక్షా కేంద్రాల్లో 971 మంది విద్యార్థులు హాజరు కానున్నారని పేర్కొన్నారు. వేసవి కావడంతో పరీక్షా కేంద్రాల వద్ద మంచినీటితోపాటు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని అధికారులక సూచించారు. పరీక్షలు జరుగుతున్న సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలని పేర్కొన్నారు. స్ట్రాంగ్ రూము నుంచి పరీక్ష పేపర్లు, ఇతర మెటీరియల్స్ తరలించే వాహనాలకు పోలీసులు ఎస్కార్ట్ ఉండాలన్నారు. పరీక్షా కేంద్రాల్లో మరుగుదొడ్లు, శానిటేషన్ సక్రమంగా ఉండే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో డీఈఓ రేణుక, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఎగ్జామినర్ కె.వెంకటరెడ్డి, జీఎంసీ డెప్యూటీ కమిషనర్ సి.హెచ్.శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.
ప్రకృతి వైపరీత్యాలపై అవగాహన అవసరం
గుంటూరు వెస్ట్: ప్రకృతి వైపరీత్యాలు, పెను ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రజలు భయపడకుండా కొద్దిపాటి అవగాహనతో ప్రవర్తిస్తే నష్టాలను అరికట్టవచ్చని జిల్లా రెవెన్యూ అధికారి షేక్ ఖాజావలి తెలిపారు. వరదలు, తుపానులు, అగ్నిప్రమాదాలు వంటివి సంభవించినప్పుడు తక్కువ నష్టంతోనూ, ముఖ్యంగా ప్రాణహాని కలగకుండా చేపట్టాల్సిన చర్యలపై బుధవారం కలెక్టరేట్ ఆవరణలో మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని డీఆర్సీ సమావేశ మందిరంలో డీఆర్‌ఓ విపత్తు నిర్వహణ శాఖ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ ఎ.లక్ష్మీకుమారి, జిల్లా అగ్నిమాపక శాఖాధికారి శ్రీనివాసరెడ్డి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్‌ఓ మాట్లాడుతూ ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు అగ్నిమాపక, పోలీసు, ఎన్డీఆర్‌ఎఫ్ తదితర శాఖలు ఎనలేని సేవలందిస్తాయన్నారు. ముఖ్యంగా బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించి ప్రాణనష్టం నివారించేందుకు కృషి చేస్తారని పేర్కొన్నారు. బుధవారం జరగనున్న మాక్ డ్రిల్‌లో అధికారులందరూ సమన్వయంతో పనిచేసి ప్రజలకు అవగాహన కల్పించేందుకు కృషి చేయాలని తెలిపారు. ఇన్‌చార్జ్ డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఒ.శ్రావణ్ బాబు, కలెక్టరేట్ ఏఓ పూర్ణచంద్రరావు, డీసీహెచ్‌ఎస్ మయానా మజీదాబి పాల్గొన్నారు.