
నులకపేటలో కారు బీభత్సం
పలు వాహనాలను ఢీకొట్టిన వైనం.. ఇద్దరికి గాయాలు
తాడేపల్లి రూరల్: మంగళగిరి ప్రకాశం బ్యారేజ్ పాత జాతీయ రహదారిపై నులకపేట వద్ద ఓ కారు అదుపుతప్పి పలు వాహనాలను ఢీకొట్టిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం నులకపేట వినాయకుడి గుడి వద్ద మంగళగిరి నుంచి వస్తున్న కారు ఎదురుగా వెళుతున్న ఆటోను ఢీకొట్టి రోడ్డు పక్కనే ఉన్న ద్విచక్ర వాహనాన్ని, సోడా బండిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న విజయవాడకు చెందిని ఇద్దరు ప్రయాణికులకు గాయాలయ్యాయి. రోడ్డు పక్కనే ఉన్న సోడా బండి, ద్విచక్రవాహనం దెబ్బతిన్నాయి. ఢీకొట్టిన కారు యజమాని పరారవుతుండగా స్థానిక యువకులు వెంబడించి నులకపేట సెంటర్‌లో అడ్డుకున్నారు. కారు డ్రైవ్ చేస్తున్న యువకుడు గాయపడిన వారిని ఆసుపత్రికి తీసుకువెళతాను, దెబ్బతిన్న వాహనాలను బాగు చేయిస్తానని మాయ మాటలు చెప్పి అక్కడి నుంచి జారుకున్నాడు. జరిగిన ఈ సంఘటనపై సమాచారం అందుకున్న తాడేపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి విచారణ చేసి బాధితుల దగ్గర నుంచి ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేస్తామని తెలిపారు.