
బీఆర్ స్టేడియం అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
గుంటూరు వెస్ట్ ( క్రీడలు ): రాష్ట్రంలోనే పలు ప్రత్యేకతలు ఉన్న బీఆర్ స్టేడియం అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి స్పష్టం చేశారు. పాత గుంటూరులోని స్టేడియం ప్రహరీ గోడలకు శుక్రవారం తూర్పు నియోజకవర్గ శాసన సభ్యుడు మొహమ్మద్ నసీర్ అహ్మద్, డెప్యూటీ మేయర్ షేక్ సజీలతో కలిసి కలెక్టర్ శంకుస్థాపన చేశారు. అనంతరం స్టేడియంలో కలియతిరిగి, అధికారుల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎందరో క్రీడాకారులకు జీవితాలను ప్రసాదించిన స్టేడియం అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. తొలి దశలో కాంపౌండ్ వాల్ సహా కొన్నింటికి రూ.1.60 కోట్లతో పనులు జరుగుతాయని తెలిపారు. తూర్పు నియోజకవర్గ శాసన సభ్యుడు మొహమ్మద్ నసీర్ అహ్మద్ మాట్లాడుతూ సుమారు 18 ఎకరాల్లో స్టేడియం విస్తరించి ఉందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఖేల్ ఇండియా, సీఎస్‌ఆర్ నిధులు, శాప్ ద్వారా స్టేడియం అభివృద్ధికి డీపీఆర్ తయారు చేయించామని చెప్పారు. రాబోయే రోజుల్లో కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కృషితో మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. ప్రస్తుతం పిల్లలు చదువుల మీద ద్యాస కారణంగా పెద్దగా క్రీడలవైపు రావడంలేదని తెలిపారు. ఈ నేపథ్యంలో వారికి అహ్లాదకరమైన వాతావరణంలో క్రీడా మైదానాలు రూపొందించాల్సిన అవసరముందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఫుట్‌బాల్, స్కేటింగ్, క్రికెట్ వాలీబాల్, ఇండోర్ గేమ్స్ కు రూ.100 కోట్లతో అభివృద్ధి జరుగుతుందని వెల్లడించారు. ఇదే క్రీడా మైదానంలో ఆడుకుని దాని అభివృద్ధికి అవకాశం రావడం గొప్ప అదృష్టంగా బావిస్తున్నానని నసీర్ అహ్మద్ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పి.నరసింహారెడ్డి, జిల్లా ఒలింపిక్ అధ్యక్షులు చల్లా వెంకటేశ్వరరెడ్డి, స్థానిక కార్పొరేటర్ పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి
రూ.1.60 కోట్లతో అభివృద్ధి పనులకు
శంకుస్థాపన