
టౌన్ ప్లానింగ్ అధికారుల అత్యుత్సాహం
పెదవడ్లపూడి(మంగళగిరి): మంగళగిరి తాడేపల్లి నగర పాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు అత్యుత్సాహంతో వైఎస్సార్ సీపీ నాయకుడి దుకాణం కూల్చివేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధితుడి సద్దామ్ హుస్సేన్ తెలిపిన వివరాల మేరకు.. నగర పరిధిలోని పెదవడ్లపూడి కొత్తపాలెం రోడ్డు పక్కన దుకాణం నిర్మించుకుని చికెన్ షాపు పెట్టుకుని జీవనం కొనసాగిస్తున్నాడు. అదే రోడ్డు పక్కన ఆక్రమించి టీడీపీ నాయకుడు కొత్తగా చికెన్ దుకాణం ఏర్పాటు చేసుకున్నాడు. తన వ్యాపారం కోసం సద్దామ్ హుస్సేన్ దుకాణం తొలగించేందుకు అధికారులకు ఫిర్యాదు చేశాడు. టీడీపీ నాయకుడు దుకాణంపై ఎన్నిసార్లు ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోని అధికారులు మాత్రం వైఎస్సార్ సీపీ నాయకుడి దుకాణంపై ఫిర్యాదుకు వెంటనే స్పందించారు. శుక్రవారం రాత్రి ఏసీపీ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో టౌన్ ప్లానింగ్ అధికారులు జేసీబీలను తీసుకెళ్లి దుకాణాన్ని వెంటనే తొలగించుకోవాలని సద్దామ్ హుస్సేన్‌ను ఆదేశించారు. లేనిపక్షంలో ధ్వంసం చేస్తామని బెదిరించి, అతడితోనే దుకాణాన్ని తొలగింపచేశారు. సమాచారం అందుకున్న వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు నాలి మురళీకృష్ణ ఘటనా స్థలానికి చేరుకున్నారు. అన్ని దుకాణాలు తొలగించాలని, వైఎస్సార్ సీపీ నాయకుడు దుకాణం ఒక్కటే ఎందుకు తొలగిస్తారని ప్రశ్నించినా అధికారులు పట్టించుకోలేదు. దుకాణం తొలగించి టీడీపీ నాయకులను సంతృప్తి పరచడంపై సద్దామ్ హుస్సేన్‌తో పాటు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైఎస్సార్ సీపీ నాయకుడి దుకాణం కూల్చివేత
అదే రోడ్డులో టీడీపీ నాయకుల దుకాణాల జోలికి వెళ్లలేదు