
ఈదురుగాలులు, భారీ వర్షం
విరిగిపడిన విద్యుత్ స్తంభాలు
మంచాల(చేబ్రోలు): చేబ్రోలు మండల పరిధిలోని గ్రామాల్లో గురువారం అకాల వర్షం కురిసింది. మండల పరిధిలోని మంచాల గ్రామంలో కురిసిన భారీ వర్షం, ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. చెట్లు కొమ్మలు విరిగిపోయాయి. మధ్యాహ్న సమయంలో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు సంభవించి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. మిగిలిన గ్రామాల్లో మోస్తరు వర్షం కురిసింది. మంచాల గ్రామంలో విద్యుత్ స్తంభాలు విరిగిపోవడంతో సరఫరా నిలిచిపోయింది. సిబ్బంది రాత్రికి పునరుద్ధరించారు. ఈదురు గాలులకు మామిడి, సపోటా తోటలకు నష్టం చేకూరింది. కొత్తరెడ్డిపాలెం, వడ్లమూడి, శేకూరు, శలపాడు గ్రామాల్లోని మామిడి తోటలల్లోని కాయలు రాలిపోయాయి. మామిడి చెట్లు కొమ్మలు విరిగిపోవటంతో పండ్ల రైతులకు తీవ్ర నష్టం కలిగింది.
ప్రభుత్వ పరీక్షల విభాగ సైట్‌లో టెన్త్ షార్ట్ మెమోలు
గుంటూరు ఎడ్యుకేషన్: గత మార్చిలో జరిగిన పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరైన విద్యార్థుల షార్ట్ మెమోలను ప్రభుత్వ పరీక్షల విభాగ డైరెక్టర్ వెబ్‌సైట్‌లో ఉంచినట్లు జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో అన్ని యాజమాన్యాల్లోని ఉన్నత పాఠశాలల నుంచి టెన్త్ పరీక్షలు రాసిన విద్యార్థులకు సంబంధించిన మార్కుల మెమోలను ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు డౌన్‌లోడ్ చేసుకుని, వాటిపై సంతకంతో విద్యార్థులకు అందజేయాలని సూచించారు. మెమోల్లో ఏవైనా తప్పులు, పొరపాట్లు దొర్లితే రికార్డు ప్రకారం పరిశీలించి, అడ్మిషన్ రిజిస్టర్ కాపీ, మార్కుల మెమోను ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు ధ్రువీకరించుకుని, ఈనెల 25లోపు ప్రభుత్వ పరీక్షల విభాగ డైరెక్టర్ కార్యాలయానికి పంపాలని సూచించారు.
తీరంలో ఇద్దరు
యువతులు గల్లంతు
కాపాడిన పోలీసులు
బాపట్ల టౌన్: స్నానాలు చేస్తూ ఇద్దరు యువతులు సముద్రంలో మునిగిపోయిన ఘటన గురువారం సూర్యలంక తీరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన దుర్గేశ్‌దేవి, నీషాలు గుంటూరు జిల్లా ఏటుకూరు రోడ్ బైపాస్, హనుమాన్ టెంపుల్ సమీపంలోని బుల్లెట్ స్పిన్నింగ్ మిల్లులో నివాసముంటున్నారు. గురువారం కుటుంబ సభ్యులతో కలిసి సూర్యలంక బీచ్‌కి వచ్చారు. స్నానాలు చేస్తుండగా ఒక్కసారిగా వచ్చిన ఆలల తాకిడికి సముద్రంలో ఇద్దరు యువతులు గల్లంతయ్యారు. ఈ విషయాన్ని గమనించిన పోలీసులు వెంటనే అప్రమత్తమై కాపాడారు. ఇద్దరు ప్రాణాలు కాపాడిన కోస్టల్ సెక్యూరిటీ సీఐ లక్ష్మారెడ్డి, ఎస్‌ఐ నాగశివారెడ్డి, ఏఎస్‌ఐ అమరేశ్వరరావు, హెడ్‌కానిస్టేబుల్ గంగాధర్‌రావు, హోంగార్డు నారాయణలను ఎస్పీ తుషార్ డూడీ అభినందించారు.
దివ్యాంగులకు డీఎస్సీ క్రాష్ కోర్సులో ఉచిత శిక్షణ
నెహ్రూనగర్: గుంటూరు జిల్లాలోని దివ్యాంగ అభ్యర్థులకు విజయవాడలో డీఎస్సీ క్రాష్ కోర్స్‌పై ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సువార్త గురువారం ఓ ప్రకటనలో తెలియజేశారు. ఎస్‌జీటీ టీచర్ పోస్టులకు అర్హత గల అభ్యర్థుల కోసం ఈ శిక్షణ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఈ నెల 11వ తేదీలోగా ఎంపీఎఫ్‌సీ.ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్.ఇన్ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కనీసం 40శాతం వికలాంగత్వం ఉన్నవారు అర్హులని తెలిపారు. టెట్ స్కోర్ ఆధారంగా ఎంపిక జరుగుతుందని, ఎంపికై న వారికి ప్రత్యేక బోధన పద్ధతుల్లో శిక్షణ, స్టడీ మెటీరియల్, ఉచిత భోజనం, వసతి సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు.