
ఆధారాలు సేకరణ పటిష్టంగా చేపట్టాలి
నగరంపాలెం: క్షేత్రస్థాయిలో ఆధారాలు సేకరిస్తే ఆయా కేసుల్లో నేరస్తులకు శిక్షలు పడేందుకు అవకాశాలు ఉన్నాయని జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ అన్నారు. నగరంపాలెం జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని హాల్‌లో గురువారం జిల్లా పోలీస్ అధికారులకు ఫోరెన్సిక్ సాక్ష్యాల నిర్వహణ అనే అంశంపై చర్చా వేదిక నిర్వహించారు. జిల్లా ఏఎస్పీ రమణమూర్తి అధ్యక్షత వహించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఏదైనా నేరం జరిగితే, ముందుగా ఆధారాలు సేకరించాలని అన్నారు. సేకరించిన ఆధారాలు కూడా నేరాలకు దగ్గరగా, నేరస్తుల ఆచూకీ గుర్తించేలా ఉండాలన్నారు. ఇటువంటి వేళల్లో మెదడుకు పదునుపెట్టాలని చెప్పారు. అంతేగాక సాంకేతిక పరిజ్ఞానంతో మరింత ముందుకు వెళ్లాలని అన్నారు. ఏ ఒక్క క్లూ దొరికిన నిర్లక్ష్యం చేయవద్దని చెప్పారు. అజాగ్రత్తగా వ్యవహరిస్తే నేరస్తులు తప్పించుకునేందుకు అవకాశాలు ఉంటాయని అన్నారు. అనంతరం దర్యాప్తు ప్రక్రియకు ఉపకరించే మెళకువలను ఫోరెన్సిక్ నిపుణులు వివరించారు. సమావేశంలో ఫోరెన్సిక్ సైంటిఫిక్ అధికారులు ఎ.రీనాసూసన్, ఓ.సురేంద్రబాబు, సహాయ డైరెక్టర్లు వంశీకృష్ణ, సత్యరాజు, గుంటూరు జీజీహెచ్ నుండి వైద్యులు బి.నాగేంద్రప్రసాద్, ఫోరెన్సిక్ విభాగాధిపతి జాఫర్‌హుస్సేన్, సహాయ ఆచార్యులు, పీపీ కోటేశ్వరరావు, డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
ఏ ఒక్క క్లూ కూడా అశ్రద్ధ చేయవద్దు ఫోరెన్సిక్ సాక్ష్యాల నిర్వహణపై చర్చావేదికలో ఎస్పీ