
ఈపీఓఎస్‌లో ఎరువుల విక్రయాల నమోదు తప్పనిసరి
నగరంపాలెం: డీలర్లు విక్రయించిన ఎరువులను ఎప్పటికప్పుడు రైతుల ఆధార్ ద్వారా ఈపీఓఎస్ (అమ్మకం యంత్రాలు)లో నమోదు చేయాలని కమిషనర్ కార్యాలయ సంయుక్త వ్యవసా య సంచాలకులు వీడీవీ కృపాదాస్ ఆదేశించారు. పరదీప్ ఫాస్పేట్ లిమిటెడ్ , కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంయుక్తంగా కలెక్టర్ బంగ్లా రోడ్డులోని కృషి భవన్‌లో సోమవారం జిల్లాలోని రిటైల్ ఎరువుల డీలర్లకు అమ్మకం యంత్రాలు ఉచితంగా పంపిణీ చేశాయి. కృపాదాస్ మాట్లాడుతూ ఈపీఓఎస్‌లో నమోదు కాకపోతే కేంద్రం నిర్వహించే ఐఎఫ్‌ఎంఎస్ పోర్టల్‌లో ఏపీలో అధిక ఎరువుల నిల్వలు ఉన్నట్లు చూపుతాయని తెలిపారు. తద్వారా రాష్ట్రానికి ఎరువులు సకాలంలో పంపిణీకావని చెప్పారు. జిల్లా వ్యవసాయ అధికారి నున్నా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పరదీప్ ఫాస్పేట్ లిమిటెడ్, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కంపెనీలు రూ.27 వేలు ఖరీదు చేసే 276 అమ్మకం యంత్రాలను రిటైల్ డీలర్లకు ఉచితంగా అందించాయని తెలిపారు. త్వరలో మరో 400 పంపిణీ చేయనున్నారని ఆయన వెల్లడించారు. 2015లో అందించిన యంత్రాల కంటే ఆధునాతనమైనవని, రైతుసేవలో వాటిని వినియోగించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ఏడీఏలు తోటకూర శ్రీనివాసరావు, జయదేవ్‌రాజన్ (ఎరువులు), ఏపీ రాష్ట్ర ఎరువుల డీలర్ల సంఘం అధ్యక్షుడు వి.నాగిరెడ్డి, పీపీఎల్ ప్రతినిధులు పీవీ సుభాష్, షేక్ మహమ్మద్ రఫీ పాల్గొన్నారు.