
కనుల పండువగా అమ్మనాన్నల కల్యాణం
బాపట్ల టౌన్: మండలంలోని జిల్లేళ్లమూడి గ్రామంలో వేంచేసియున్న జగన్మాత మాతృశ్రీ అనసూయ మహాదేవి, బ్రహ్మాండం నాగేశ్వరరావుల కల్యాణ మహోత్సవం సోమవారం కనుల పండువగా జరిగింది. విశ్వజననీ పరిషత్ కోశాధికారి సుబ్రమణ్యం మాట్లాడుతూ అనసూయదేవి అందరి అమ్మగా, జిల్లేళ్లమూడి అమ్మగా లోక ప్రసిద్ధి చెందారన్నారు. జిల్లేళ్లమూడి గ్రామానికి ఏ వేళప్పుడు ఎవరొచ్చినా వారికి తృప్తిగా భోజనం పెట్టి కడుపునింపడం, ఆకలితో జిల్లెళ్లమూడి రావచ్చు కానీ, జిల్లేళ్లమూడి నుంచి ఆకలితో వెళ్లరాదనేది అమ్మ ఆశయమన్నారు. జిల్లేళ్లమూడి అమ్మ తొలినాళ్లల్లో వారి పతిదేవుల సంపాదనతోనే తమ దర్శనార్థం వస్తున్న వారందరికీ స్వయంగా అన్నం వండి, వడ్డించడం చేసేవారన్నారు. అనతి కాలంలో అమ్మ బిడ్డలందరి సమష్టి కృషితో జిల్లేళ్లమూడిలో అన్నపూర్ణాలయం ఏర్పడిందన్నారు. సంవత్సరమంతా నిత్యకల్యాణం, పచ్చతోరణం మాదిరి ఉంటుందన్నారు. అమ్మవారి కల్యాణమహోత్సవంలో భాగంగా సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అమ్మనాన్నలకు విశేష పూజా కార్యక్రమాలు జరిగాయన్నారు. కల్యాణం అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.