
నేషనల్ ఆర్చరీ చాంపియన్‌షిప్ పోటీలు ప్రారంభం
పెదకాకాని: ఆర్చరీ క్రీడాకారులు అత్యున్నత శిఖరాలను అధిరోహించి రాష్ట్ర ఖ్యాతిని పెంచాలని రాష్ట్ర స్పోర్ట్స్ ఆథారిటీ (శాప్) చైర్మన్ అనిమిని రవినాయుడు చెప్పారు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలంలోని నంబూరు వాసిరెడ్డి వెంకటాద్రి అంతర్జాతీయ సాంకేతిక విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో చెరుకూరి లెనిన్ వోల్గా మెమోరియల్ నేషనల్ ఆర్చరీ చాంపియన్‌షిప్ పోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 26 నుంచి 29 వరకు నాలుగు రోజుల పాటు జరిగే ఈ పోటీలను రాష్ట్ర స్పోర్ట్స్ ఆథారిటీ (శాప్) చైర్మన్ అనిమిని రవినాయుడు, అర్జున ద్రోణాచార్య అవార్డు గ్రహీత సంజీవ సింగ్, వీవీఐటీయూ చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా అర్చరీ క్రీడకు విశేష ఆదరణ లభిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆర్చరీ క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న చెరుకూరి లెనిన్ వోల్గా అసోసియేషన్ కృషి ప్రశంసనీయమన్నారు. క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. అమరావతి వేదికగా స్పోర్ట్స్ విలేజ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటునట్లు వివరించారు. వీవీఐటీయూ చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ మాట్ల్లాడుతూ నేషనల్ ఆర్చరీ చాంపియన్‌షిప్ నిర్వహణకు వీవీఐటీ యూనివర్శిటీ వేదిక కావడం సంతోషంగా ఉందన్నారు. ఆర్చరీ వంటి క్రీడల ద్వారా విద్యార్థులలో ఆత్మవిశ్వాసం, స్నేహ సంబంధాలు పెరుగుతాయన్నారు. ఈ పోటీలలో పాల్గొనేందుకు దేశంలో వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 900 మంది ఆర్చరీ క్రీడాకారులు, కోచ్‌లు హాజరయ్యారు. అండర్ 10, అండర్ 13, అండర్ 15 విభాగాలుగా నిర్వహించనున్న పోటీలలో తొలి రోజు బుధవారం 723 మంది పోటీదారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వీవీఐటీయూ ప్రిన్సిపల్ డాక్టర్ వై.మల్లికార్జునరెడ్డి, ఏపీ అర్చరీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ చెరుకూరి సత్యం, వీవీఐటీయూ ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్.అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.