గుంటూరు మెడికల్: గుంటూరు మంగళదాస్‌నగర్‌లోని కిమ్స్ శిఖర హాస్పిటల్‌లో మూడు సంక్లిష్టమైన కరోనరీ ఇంటర్వెన్షనల్ ప్రొసీజర్లు విజయవంతంగా పూర్తి చేశారు. ఆపరేషన్ చేయకుండానే ఆధునిక సాంకేతిక వైద్య పద్ధతులతో కరోనరీ రక్తనాళాల్లో ఉన్న అవరోధాలను స్టంట్‌ల సాయంతో తొలగించి ఇంటర్వెన్షనల్ కార్డియాలజీకి కొత్త ముద్రను వేశారు. ఈ విషయాన్ని గురువారం కార్డియాలజీ వైద్యులు మీడియాకు వెల్లడించారు. గుండెకు వెళ్లే రక్తనాళాల్లో అడ్డంకులు ఉండి, తీవ్రంగా కాల్షియం పెరిగిన రోగులు ముగ్గురు చికిత్స కోసం వచ్చినట్లు చెప్పారు. కిమ్స్ శిఖరలో అందుబాటులో ఉన్న ఆధునిక పరికరాల సాయంతో ముగ్గురికి గుండె చికిత్సలు విజయవంతంగా చేశామన్నారు. ఆపరేషన్లతో పనిలేకుండా స్టెంట్లతో చికిత్సను అందించామన్నారు. యూకే నుంచి వచ్చిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ అజ్ఫర్ జమాన్ నేతృత్వంలో ప్రొసీజర్లు నిర్వహించినట్లు వెల్లడించారు. ఇంట్రాకరోనరీ అల్ట్రాసౌండ్, కొత్త కట్టింగ్ బెలూన్లు, మైక్రో–క్యాథెటర్స్, డ్రగ్–ఎల్యూషన్ బెలూన్‌ల వంటి ఆధునిక పరికరాల సాయంతో ఆపరేషన్ లేకుండా గుండె సమస్యలను తొలగించామని పేర్కొన్నారు. కిమ్స్ శిఖర కార్డియాక్ సైన్సెస్ డైరెక్టర్ డాక్టర్ పర్వతనేని నాగశ్రీ హరిత, కాథ్‌ల్యాబ్ డైరెక్టర్ డాక్టర్ శివప్రసాద్ చికిత్స విజయవంతంగా చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ హరిత మాట్లాడుతూ మునుపటి రోజుల్లో ఇలాంటి సమస్యలకు శస్త్రచికిత్స కోసం పంపించాల్సిన ఉండేదన్నారు. ఆధునిక వైద్య పరికరాలు అందుబాటులోకి రావడంతో అత్యంత తక్కువ ఆపరేషన్ అవసరం కలిగిన చికిత్సలను అందిస్తున్నామన్నారు. నూతన చికిత్స పద్ధతుల ద్వారా రోగులు త్వరగా కోలుకుంటారని వెల్లడించారు.