తాడేపల్లి రూరల్: కుంచనపల్లిలోని దళిత లంక పొలాల సమస్యను వెంటనే పరిష్కరించాలని సీపీఎం గుంటూరు జిల్లా కార్యదర్శి వై. నేతాజీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎంటీఎంసీ పరిధిలోని కుంచనపల్లిలో సోమవారం సీపీఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ప్రజాచైతన్య యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన రైతులతో మాట్లాడారు. కృష్ణానది ఒడ్డున దళితులకు ఇచ్చిన 30 ఎకరాల లంక పొలాల సమస్య పరిష్కారం కావడం లేదన్నారు. సాగు చేసుకునేందుకు సరైన సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేనందున ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. సీపీఎం సీనియర్ నాయకులు జొన్న శివశంకరరావు, సీపీఎం తాడేపల్లి మండల కార్యదర్శి పల్లె కృష్ణ, కుంచనపల్లి గ్రామ శాఖ కార్యదర్శి అమ్మిశెట్టి రంగారావు, నాయకులు నాగపోగు విజయరాజు, అమ్మిశెట్టి రామారావు, కంచర్ల సాంబశివరావు, కొండపల్లి యశోద, సింగంశెట్టి రవికిషోర్, అమ్మిశెట్టి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.