నగరంపాలెం: ప్రైవేటు వైద్యులు సక్రమంగా శస్త్రచికిత్సలు నిర్వర్తించకపోవడంతో కుమారుడు మంచానికి పరిమితమైనట్లు ఓ తండ్రి వాపోయారు. జనసేన నేతపై భార్యభర్తలు ఫిర్యాదు చేశారు. నగరంపాలెంలోని జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ ఆదేశాల మేరకు జిల్లా ఏఎస్పీ (పరిపాలన) ఏవీ రమణమూర్తి బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. బాధితులకు సకాలంలో న్యాయం చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ఏఎస్పీలు కె.సుప్రజ (క్రైం), హనుమంతు (ఏఆర్), డీఎస్పీలు రమేష్ (ట్రాఫిక్), శివాజీరాజు (సీసీఎస్)లు కూడా అర్జీలు స్వీకరించారు. రెండేళ్ల కిత్రం కుమారుడు వంశీ క్రికెట్ ఆడుతుండగా కుడి కాలికి గాయం కావడంతో శస్త్రచికిత్స చేసినా ఫలితం దక్కలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్నామని చిలకలూరిపేటకు చెందిన తండ్రి దార్ల జోజయ్య తెలిపారు. సంగడిగుంట జీరో వీధికి చెందిన ఓ వివాహిత తన అత్తింటివారిపై ఫిర్యాదు చేశారు. తన భర్తకు మరో పెళ్లి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, భర్తను పిలిచి విచారించాలని కోరారు. గుంటూరు టౌన్‌కు చెందిన ఎస్.వెంకటేశ్వరరావు తన కుమారుడికి ఉద్యోగం నిమిత్తం ఉండవల్లిలోని కన్సల్టెన్సీని సంప్రదించారు. రూ.1.30 లక్షలు చెల్లించాక నకిలీ కాల్ లెటర్ ఇచ్చారని చెప్పారు. న్యాయం చేయాలని కోరారు. కొబ్బరికాయల సాంబయ్య కాలనీకి చెందిన డ్వాక్రా గ్రూప్ లీడర్‌పై లాలాపేట పీఎస్‌లో ఫిర్యాదు చేశామని విజయలక్ష్మి, దేవి, దేవిక, హేమలత తెలిపారు. రూ.4.70 లక్షలు చెల్లించాల్సి ఉందన్నారు. తమకు న్యాయం చేయాలని కోరారు. పాతగుంటూరు, దుర్గానగర్ ఒకటో వీధికి చెందిన కర్పూరపు రమాదేవి, రాంబాబు మాట్లాడుతూ.., జనసేన నేతకు రూ.4 లక్షలు ఇచ్చామన్నారు. తిరిగి ఇవ్వడం లేదని వాపోయారు.
జనసేన నేత బెదిరింపులపై ఫిర్యాదు