గుంటూరు మెడికల్: దేశంలోని చిన్న రాష్ట్రాల్లోనూ ఆహార ప్రయోగశాలలు ఉన్నాయని, మన రాష్ట్రంలో ప్రయోగశాల నిర్మాణం 15 ఏళ్ల క్రితం ప్రారంభమైనా, పూర్తికాలేదని, నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో భవనం శిథిలావస్థకు చేరిందని జాతీయ వినియోగదారుల సమాఖ్య ఉపాధ్యక్షుడు డాక్టర్ చదలవాడ హరిబాబు పేర్కొన్నారు. ధర్మపురి కన్జూమర్స్, జిల్లా వినియోగదారుల సంఘాల సమావేశం గుంటూరులో గురువారం జరిగింది. సమావేశంలో ఆహార కల్తీ నియంత్రణపై డాక్టర్ చదలవాడ హరిబాబు మాట్లాడుతూ ప్రతి రెండేళ్లకొకసారి భవనానికి మరమ్మతులు చేయడానికి రూ.2 కోట్లు ఖర్చు చేస్తున్నారని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం స్పందించి ఆహార ప్రయోగశాలకు అవసరమైన పరికరాలు, సిబ్బందిని త్వరగా సమకూర్చి అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. ఆహార ప్రయోగశాలలో మైక్రోబయాలజీ, కెమికల్ ల్యాబ్స్ ఉన్నాయని, కేవలం 50 శాతం పరికరాలు, నలుగురు సిబ్బంది ఉన్నారని ఆవేదన చెందారు. రసాయనాలు లేకపోవడంతో ఎలాంటి పరీక్షలు జరగడం లేదన్నారు. పల్నాడు జిల్లా విజిలెన్స్ కమిటీ సభ్యుడు పిల్లి యజ్ఞ నారాయణ మాట్లాడుతూ గత ఫిబ్రవరి 25న ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ఆహార ప్రయోగశాలలను వర్చువల్‌గా ప్రారంభించారని, కానీ రాష్ట్రంలో ప్రయోగశాల అందుబాటులోకి రాలేదని పేర్కొన్నారు. కనీసం వాచ్‌మెన్‌ను కూడా నియమించకపోవడం దారుణమన్నారు. విజిలెన్స్ కమిటీ సభ్యులు చేకూరి రాజశేఖర్ మాట్లాడుతూ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా విడుదల చేసిన భద్రతా సూచిక గత ఐదు ఏళ్లుగా అట్టడుగు స్థానంలో ఉందని పేర్కొన్నారు. వినియోగదారుల సంఘాలు పోరాటాలకు సిద్ధపడాలని పిలుపునిచ్చారు.
జాతీయ వినియోగదారుల సమాఖ్య
ఉపాధ్యక్షుడు డాక్టర్ చదలవాడ హరిబాబు