
జిల్లా జైలునుసందర్శించిన జడ్జి
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): గుంటూరు బ్రాడీపేటలోని జిల్లా జైలును జిల్లా జడ్జి వై.వి.ఎస్.జి.పార్థసారథి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి టి.లీలావతి ఆదివారం సందర్శించారు. ఈ క్రమంలో వంటశాల, రేషన్ స్టోర్, ఖైదీలు భుజించేందుకు సిద్ధమైన ఆహారాన్ని పరిశీలించారు. ప్రతి ఖైదీతోనూ మాట్లాడారు. వారికి అందుతున్న న్యాయ సహాయం, ఇతర మౌలిక సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. గతంలో చేసిన తప్పును మళ్లీ చేయవద్దని, ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తనతో జీవించాలని చెప్పారు. జైలు అధికారులు సరైన ప్రమాణాలను ఆచరిస్తూ ఖైదీల హక్కులను కాపాడుతున్నారని సంతృప్తి వ్యక్తం చేశారు. జైలు నిర్వహణలో అధికార, సిబ్బంది కృషిని ప్రశంసించారు. జిల్లా జైలు సూపరింటెండెంట్ కె.రఘు, జైలర్ సీహెచ్.కిరణ్, డిప్యూటీ జైలర్ ఎ.కల్యాణ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
శతాధిక వృద్ధురాలు మృతి
కాకుమాను: పెదనందిపాడు మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన శతాధిక వృద్ధురాలు బిళ్లా మరియమ్మ(106)ఆదివారం వేకువజామున అనారోగ్య కారణంతో మృతి చెందారు. మృతురాలికి నలుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆమెకు మనుమలు, మనుమరాళ్లు, ముని మనుమలు కలిపి మొత్తం 40 మంది సంతానం ఉన్నారు.
ఆకట్టుకున్న కూచిపూడి నృత్య ప్రదర్శన
నగరంపాలెం: స్థానిక బృందావన్ గార్డెన్స్ వేంకటేశ్వరస్వామి దేవాలయం అన్నమయ్య కళావేదికపై జానకి వల్లభ నృత్య కళాకేంద్రం (వెలగపూడి) నాట్యాచారిణి అలేఖ్య శిష్య బృందం ఆదివారం కూచిపూడి నృత్య ప్రదర్శన చేపట్టింది. ఆలయ సహాయ కార్యదర్శి ఊటుకూరి నాగేశ్వరరరావు, నూతలపాటి తిరుపతయ్య జ్యోతిప్రజ్వలనతో ప్రదర్శనను ప్రారంభించారు. తొలుత మూషిక వాహనతో ప్రారంభమై, ఏకదంతాయా, ముకుంద ముకుంద, కొండలలో నెలకొన్న, బ్రహ్మ మొక్కటే, పలుకే బంగారమాయేరా అంటూ పలు అన్నమయ్య కీర్తనలకు చక్కగా నృత్యప్రదర్శన చేశారు. ప్రేక్షకులను అలరించారు. ఎ.బి.బ్రహ్మాజి కార్యక్రమాన్ని నిర్వహించగా, అనంతరం దేవాలయ పాలకవర్గం నాట్యాచారిణి అలేఖ్య శిష్యబృందాన్ని సత్కరించి, స్వామి వారి తీర్థప్రసాదాలను అందించారు.
పెళ్లి కుమారుడిగా రంగనాథుడు
యడ్లపాడు: మండలంలోని సోలస గ్రామంలోని భూ సమేత రంగనాయక స్వామి ఆలయంలో కల్యాణ మహోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా దేవతామూర్తులకు అభిషేకాలు చేసి మహిళలు ఆలయ ప్రాంగణంలో పసుపు కొట్టుడు కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం వధూవరులకు పసుపు పూసి సుందరంగా తీర్చిదిద్దారు ఆలయ ప్రధాన అర్చకులు పరుచూరి రామకృష్ణచార్యులు నేతృత్వంలో ఆయా కార్యక్రమాలు నిర్వహించగా ధర్మకర్తలు అరవపల్లి మనోహర్ నాగలక్ష్మి దంపతులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
పెనుగంచిప్రోలులో
భక్తజన సందడి
పెనుగంచిప్రోలు: గ్రామంలోని శ్రీ గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట జిల్లాలతో పాటు స్థానికులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. వచ్చే నెలలో పాఠశాలల ప్రారంభం, రైతులు వ్యవసాయ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉండడంతో భక్తులు మొక్కులు తీర్చుకుంటున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా ఆలయ పాలకవర్గ సభ్యులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.

జిల్లా జైలునుసందర్శించిన జడ్జి

జిల్లా జైలునుసందర్శించిన జడ్జి

జిల్లా జైలునుసందర్శించిన జడ్జి