
దాడికి ఉపయోగించిన కారు స్వాధీనం
నాదెండ్ల: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై టీడీపీ వర్గీయులు హత్యాయత్నానికి వినియోగించిన కారును గురువారం నాదెండ్ల పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈనెల 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం అప్పాపురం గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ మండల ఉపాధ్యక్షుడు కోయలమూడి సాంబశివరావుపై దాడి చేసేందుకు టీడీపీ వర్గీయులు కర్రలు, కత్తులతో వెంటపడ్డారు. సాంబశివరావు ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీసి ఓ ఇంట్లో దాక్కున్నాడు. ఇతన్ని కారులో వెంబడించారు. ఈ క్రమంలో కారు సైడు కాల్వలో దిగబడి ముందుకు కదలకపోవటంతో వారు వెనుదిరిగారు. పోలింగ్ జరిగిన రోజున గ్రామంలోని ఎస్సీ వర్గీయులు 12,13 పోలింగ్ బూత్‌ల్లో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు. సాయంత్రం 6 గంటలైనా ఓటేసేందుకు క్యూలో నిల్చుని రాత్రి సమయం వరకూ వేచి ఉండి ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎస్సీ వర్గీయులకు అండగా నిలబడిన సాంబశివరావుపై కక్ష కట్టిన టీడీపీ వర్గీయులు అదనుచూసి దాడికి యత్నించారు. తృటిలో ప్రాణాలు కాపాడుకోవటంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. దాడికి వినియోగించిన కారును గురువారం పోలీసులు స్వాధీనం చేసుకుని వివరాలు పరిశీలించగా, కారు గ్రామానికి చెందిన నీలకంఠం అనే వ్యక్తిదిగా గుర్తించారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వైఎస్సార్‌సీపీ నాయకులు సాంబశివరావు తనపై దాడికి యత్నించిన 22 మంది టీడీపీ వర్గీయులపై ఫిర్యాదు చేయటంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.