
ప్రసంగిస్తున్న ఆచార్య సెబాస్టియన్
ముంబై ఐఐటీ అధ్యాపకుడు ఆచార్య సెబాస్టియన్
ఏఎన్‌యూ: హింసకు తావు లేకుండా అహింస ద్వారా మానవ మనుగడ సాధించడం జీవితంలో ఎంతో ముఖ్యమని ముంబై ఐఐటీ అధ్యాపకుడు ఆచార్య సీడీ సెబాస్టియన్ తెలిపారు. ప్రపంచ తత్వశాస్త్ర దినోత్సవం పురస్కరించుకొని ఏఎన్‌యూ బౌద్ధ అధ్యయన విభాగం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ఉపన్యాసానికి ఆయన ప్రధాన వక్తగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగిస్తూ బౌద్ధ ఆచారాత్మక తత్వశాస్త్రం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని సూచించారు. యుద్ధం, హింసను వీడితేనే మానవ జీవితం నిజమైన మార్గంలో పయనిస్తుందని తెలిపారు. అన్ని మతాలు ధర్మం, నైతిక విలువలు, ప్రపంచ శాంతి, మానవ మనుగడ అనే అంశాలు ఉద్బోధిస్తున్నాయని, వాటిలోని అంశాలు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని చెప్పారు. బౌద్ధ ధర్మంలో పంచశీల అనేది ముఖ్యమైన అంశమని పేర్కొన్నారు. బౌద్ధ ధర్మం ద్వారా మానవ మనుగడ ఉత్తమ మార్గంలో కొనసాగుతుందని చెప్పారు. ఏఎన్‌యూ వీసీ ఆచార్య పి. రాజశేఖర్ ప్రసంగిస్తూ అందరూ శాంతియుత వాతావరణంలో మనుగడ సాగించాలనే వాస్తవాన్ని గుర్తించాలని తెలిపారు. యూనివర్సిటీ బుద్ధిజం విభాగం ఆధ్వర్యంలో బుద్ధుని సిద్ధాంతాలపై అధ్యయనం, పరిశోధన క్షేత్రస్థాయిలో కొనసాగేందుకు చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. రెక్టార్ ఆచార్య పి. వరప్రసాదమూర్తి, రిజిస్ట్రార్ ఆచార్య బి. కరుణ, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సీహెచ్. స్వరూపరాణి, దూరవిద్యా కేంద్రం డైరెక్టర్ డాక్టర్ బి. నాగరాజు, బుద్ధిజం విభాగాధిపతి ఆచార్య ఎల్. ఉదయకుమార్ ప్రసంగించారు. అధ్యాపకులు, బౌద్ధ భిక్షవులు, విద్యార్థులు, పరిశోధకులు పాల్గొన్నారు.
అంతర్జాతీయ సదస్సు పోస్టర్ ఆవిష్కరణ
బుద్ధిజం విభాగం ఆధ్వర్యంలో వచ్చే ఏడాది మార్చి 20 నుంచి 22వ తేదీ వరకు ‘బుద్ధిస్ట్ ఫిలాసఫీ అండ్ మైండ్ అండ్ కాగ్నిటివ్ సైన్స్ విత్ హ్యూమన్ మోరల్ ఎక్స్‌పీరియన్స్’ అనే అంశంపై నిర్వహించే అంతర్జాతీయ సదస్సు బ్రోచర్‌ను వీసీ ఆచార్య పి. రాజశేఖర్, ఐఐటీ అధ్యాపకుడు ఆచార్య శబాస్టియన్, యూనివర్సిటీ ఉన్నతాధికారులు ఆవిష్కరించారు.