
టీకా వేస్తున్న జేడీ డాక్టర్ హనుమంతరావు
బల్లికురవ: మద్యం మత్తు, ఎండతాపానికి గురై రోడ్డు మార్జిన్‌లోనే పడిపోయి యువకుడు అనమానాస్పదంగా మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం మండలంలోని కొత్తమల్లాయపాలెం గ్రామ సమీపంలో జరిగింది. ఎస్సై వీ వేమన తెలిపిన వివరాల మేరకు.. శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన లక్ష్మీనారాయణ (35) ఇక్కడ క్వారీల్లో పనిచేస్తున్నాడు. సంతమాగులూరుకు చెందిన కాంట్రాక్టర్ సత్యం ద్వారా వచ్చాడు. మద్యానికి బానిస కావడంతో ఏ క్వారీలోనూ సక్రమంగా పనిచేయలేకపోయాడు. దీంతో క్వారీల నిర్వాహకులు పనిలో పెట్టుకోలేదు. ఈ క్రమంలో కొత్తమల్లాయపాలెం నుంచి క్వారీలకు వెళ్లే రోడ్డులోని మార్జిన్‌లో పూటుగా మద్యం సేవించి పడిపోయి ఉండటంతో స్థానికులు ఎస్‌ఐకి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి వచ్చి ఎస్‌ఐ పరిశీలించగా అతను మృతి చెందినట్లు తెలుసుకున్నాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
భర్త ఇంటిముందు భార్య ఆందోళన
చీరాల: తన భర్త తనకు కావాలి.. న్యాయం చేయాలంటూ వివాహిత భర్త ఇంటిముందు ఆందోళనకు దిగింది. ఈఘటన మంగళవారం రాత్రి పట్టణంలోని హారీస్‌పేటలో చోటు చేసుకుంది. అందిన వివరాల మేరకు.. హారీస్‌పేటకు చెందిన లేళ్ల చైతన్యకు రాజ్య లక్ష్మితో కొంతకాలం కిందట వివాహం జరిగింది. అయితే కొన్ని రోజుల నుంచి తన భర్త చైతన్య తనను వేధించడంతోపాటు అత్తమామల మాటలకు ఒత్తాసు పలుకుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని వాపోయింది. అత్తమామల ఆదేశాలతో భర్త తనను ఇంట్లోకి రానివ్వకుండా వేధిస్తుండటంతో గత్యంతరం లేక తన భర్త ఇంటి ముందు ఆందోళన చేస్తున్నానని తెలిపింది. తనకు న్యాయం చేసేంత వరకు ఆందోళన విరమించనని ఇంటి ముందు భీష్మించుకుని కూర్చుంది. సమాచారం అందుకున్న ఒన్‌టౌన్ పోలీసులు ఆందోళన చేస్తున్న వివాహిత, ఇరువర్గాల కుటుంబ సభ్యులతో సంప్రదింపులు చేస్తున్నారు. న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
చెక్ బౌన్స్ కేసులో టీచర్‌కు ఏడాది జైలు శిక్ష
సత్తెనపల్లి: చెక్ బౌన్స్ కేసులో ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుడికి ఏడాది జైలు శిక్ష, రూ.4 లక్షలు నష్టపరిహారం చెల్లించాల్సిందిగా సత్తెనపల్లి రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి మహమ్మద్ గౌస్ మంగళవారం తీర్పు వెలువరించారు. వివరాలు ఇలా ఉన్నాయి. రాజుపాలెం మండలం ఇనిమెట్ల గ్రామానికి చెందిన కూరాకుల పున్నయ్య వద్ద 2015 అక్టోబర్ 10న కుటుంబ అవసరాల నిమిత్తం నూజెండ్ల మండలం రవ్వవరం ఎంపీయుపీ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న పమిడిమళ్ల ఏసుబాబు రూ.4 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. పున్నయ్య తిరిగి నగదు ఇవ్వాలని కోరగా, దీని నిమిత్తం 2017 జనవరి 27న రూ.4 లక్షలకు ఏసుబాబు చెక్ ఇచ్చాడు. ఆ చెక్కును కూరాకుల పున్నయ్య తన బ్యాంకు ఖాతాలో వేయగా ఖాతాలో సరిపడా నగదు లేకపోవడంతో చెక్ బౌన్స్ అయ్యింది. నేరం రుజువు కావడంతో ఎన్‌ఐ యాక్ట్ కింద న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు.
గాలికుంటు టీకాతో పశువులకు రక్షణ
వేటపాలెం: ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ద్వారా ఉచితంగా అందిస్తున్న గాలికుంటు వ్యాక్సిన్ పశువులకు రక్షణగా ఉంటుందని బాపట్ల జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి ఎం హనుమంతరావు పేర్కొన్నారు. మండల పరిధిలోని కొత్తరెడ్డిపాలెంలో ఏర్పాటు చేసిన గాలికుంటు వ్యాక్సిన్ పంపిణీ శిబిరాన్ని ఆయన మంగళవారం సందర్శించారు. జిల్లాలో అన్ని గ్రామాల్లో వ్యాక్సిన్ ఏప్రిల్ 24వ తేదీ వరకు పంపిణీ చేస్తారని తెలిపారు. రైతులు, పశుపోషకులు వ్యాక్సిన్‌ని తమ పశువులకు వేయించి వ్యాధి బారిన పడకుండా కాపాడాలని సూచించారు. కొత్తరెడ్డిపాలెం గ్రామంలో 62 గేదెలు, 28 లేగ దూడలు, నాలుగు ఆవులకు వ్యాక్సిన్ వేశామని తెలిపారు. కార్యక్రమంలో సజ్జా చిట్టిబాబు, డాక్టర్ దేవలక్ష్మి, సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా పశుసంవర్ధక అధికారి హనుమంతరావు

ఇంటి ముందు నేలపై కూర్చొని ఆందోళన చేస్తున్న రాజ్యలక్ష్మి

మృతుడు లక్ష్మీనారాయణ