
ఇంటింటి సర్వే చేస్తున్న వైద్య సిబ్బంది
● ఇంటింటి సర్వే చేస్తున్న వైద్య సిబ్బంది ● హెచ్3 ఎన్2 వైరస్ కేసులను గుర్తించే పనిలో వైద్య సిబ్బంది ● గుంటూరు వైద్య కళాశాలలో వ్యాధి నిర్ధారణ పరీక్షలు ● జ్వరాలపై అవగాహన, అప్రమత్తత అవసరం
గుంటూరు మెడికల్: కోవిడ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయని సంతోష పడుతున్న తరుణంలో నూతనంగా హెచ్3 ఎన్2 వైరస్ కేసులు కొద్దిరోజులుగా దేశ వ్యాప్తంగా నమోదవుతున్నాయి. ఈనేపథ్యంలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ పలు రాష్ట్రాలను అలెర్ట్ చేసింది. ముఖ్యంగా నూతన వైరస్ కేసులు నమోదవుతున్న రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని, వైరస్ సోకకుండా తగు నివారణ చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఏపీలో కేంద్ర నివేదిక ప్రకారం నూతన వైరస్ కేసులు నమోదు కాలేదు. అయినప్పటికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైద్య రంగంపై ప్రత్యేక దృష్టి సారించి ముందస్తుగా వైరస్ బారిన పడకుండా ప్రజలను కాపాడాలనే ఉద్దేశంతో వైద్య ఆరోగ్య శాఖను అప్రమత్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయా జిల్లాల వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఈనెల 13 నుంచి ఇంటింటి సర్వే ప్రారంభించారు.
గుంటూరు వైద్య కళాశాలలో టెస్టులు..
రాష్ట్ర ప్రభుత్వం గతంలో కోవిడ్ వ్యాధి నిర్ధారణ పరీక్షలను గుంటూరు వైద్య కళాశాలలోనే చేసేలా ప్రత్యేక వైద్య పరికరాలను వైద్య కళాశాలకు అందజేసింది. కోట్లాది రూపాయలతో నూతనంగా ల్యాబ్‌ను సైతం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తాజాగా హెచ్3ఎన్2 వైరస్ నిర్ధారణ పరీక్షలు సైతం గుంటూరు వైద్య కళాశాలలోనే చేసేలా సంబంధిత కిట్‌లను జిల్లాకు పంపించింది. ఒక్కో టెస్ట్ చేసేందుకు సుమారు రూ. 40వేలు ఖరీదు చేసే కిట్‌లను రాష్ట్ర ప్రభుత్వం గుంటూరుకు సరఫరా చేసింది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
కొంతకాలంగా జ్వరం కేసులు జిల్లాలో నమోదవుతున్నాయి. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జ్వరాలపై కొంత అవగాహన కలిగిఉండాలి. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది జ్వరాలపై సర్వే చేస్తున్నారు. ఏమాత్రం అనుమానం ఉన్నా తక్షణమే వారిని సంప్రదించి చికిత్స పొందాలి. నూతన వైరస్ వ్యాధి నిర్ధారణ కిట్‌లను సైతం ప్రభుత్వం గుంటూరుకు పంపించింది. వైరస్‌ల బారిన పడకుండా ప్రజలు మాస్క్‌లు ధరించడం, తరచూ శానిటైజర్ వినియోగించడం, భౌతిక దూరం పాటించడం వంటివి చేయాలి
– డాక్టర్ అమర్తలూరి శ్రావణ్‌బాబు, డీఎంహెచ్‌ఓ
6,36,465 ఇళ్ల సర్వే పూర్తి..
జిల్లాలో నూతన వైరస్ బారిన పడకుండా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ప్రజలను అప్రమత్తం చేస్తూ ఇంటింటికి తిరిగి వివరాలు నమోదు చేస్తున్నారు. జ్వరం అనుమానిత లక్షణాలు ఉంటే తక్షణమే వారికి చికిత్స అందిస్తున్నారు. ముఖ్యంగా జ్వరం, దగ్గు, జలుబు తదితర లక్షణాలు ఉన్నవారికి వ్యాధి నియంత్రణ కోసం తక్షణమే మందులు అందిస్తున్నారు. జిల్లాలో 7,14,045 ఇళ్లు ఉన్నాయి. వైద్య ఆరోగ్యశాఖకు చెందిన ఆశ, ఏఎన్‌ఎంలతోపాటు, వార్డు వలంటీర్లు వారం రోజుల వ్యవధిలో 6,36,465 ఇళ్లు సర్వే చేశారు. సర్వేలో భాగంగా జ్వరం, ఇతర లక్షణాలతో 850 మంది బాధపడుతున్నట్లు గుర్తించి, వారికి తక్షణ వైద్య సహాయం అందించారు. ఇంటింటి సర్వేలో రాష్ట్రంలో గుంటూరు జిల్లా 90.48 శాతంతో ఐదో స్థానంలో ఉంది.
