
గుంటూరురూరల్: ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన 48వ డివిజన్ కార్పొరేటర్ తనుబుద్ధి కృష్ణారెడ్డి కుటుంబసభ్యులు సోమవారం సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మాజీ మంత్రి, ఎమ్మెల్యే మేకతోటి సుచరితతో కలిసి సీఎం క్యాంపు కార్యాలయంలో కలిశారు. కృష్ణారెడ్డి అకాల మృతి విషయాన్ని ఎమ్మెల్యే సుచరిత సీఎం దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన సీఎం వైఎస్ జగన్ వైఎస్సార్ సీపీ అండగా ఉంటుందని కృష్ణారెడ్డి కుంటుంబానికి హామీ ఇచ్చారన్నారు. కృష్ణారెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుని ప్రార్థిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు.
పరమపదనాథుని అలంకారంలో నారసింహుడు
మంగళగిరి: నగరంలోని లక్ష్మీనృసింహస్వామి ఆస్థాన అలంకారోత్సవాలలో భాగంగా సోమవారం రాత్రి పరమపదనాథుడు అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామి వారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకోగా ఉత్సవాన్ని ఆలయ ఈఓ ఏ రామకోటిరెడ్డి పర్యవేక్షించారు. ఉత్సవానికి కై ంకర్యపరులుగా ఆత్మకూరుకు చెందిన మురికిపూడి మాధవరావు, ఆస్థాన కై ంకర్యపరులుగా మంగళగిరికి చెందిన లంకా కృష్ణమూర్తిలు వ్యవహరించారు.
1,10,687 బస్తాల మిర్చి విక్రయం
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డుకు సోమవారం 1,27,477 మిర్చి బస్తాలు రాగా, గత నిల్వలతో కలిపి ఈ–నామ్ విధానం ద్వారా 1,10,687 బస్తాలు అమ్మకాలు జరిగాయి. నాన్ ఏసీ కామన్ రకం 334, నెంబర్–5, 273, 341, 4884, సూపర్–10 రకాల మిర్చి సగటు ధర రూ.9,000 నుంచి రూ.26,000 వరకు పలికింది. నాన్ ఏసీ ప్రత్యేక రకం తేజ, బాడిగి, దేవనూరు డీలక్స్ రకాల మిర్చి సగటు ధర రూ.9,000 నుంచి రూ.27,000 వరకు పలికింది. తాలు రకం మిర్చికి రూ.5,500 నుంచి రూ.13,000 వరకు ధర లభించింది. అమ్మకాలు ముగిసే సమయానికి యార్డులో ఇంకా 90,378 బస్తాలు మిర్చి నిల్వ ఉన్నట్లు యార్డు ఉన్నత శ్రేణి కార్యదర్శి ఐ.వెంకటేశ్వరరెడ్డి తెలిపారు.
దుర్గమ్మకు
బంగారు ఆభరణాలు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మకు పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు దంపతులు బంగారు బొట్టు, నత్తు, బులాకీని సోమవారం సమర్పించారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావును ఆలయ కమిటీ చైర్మన్ కర్నాటి రాంబాబు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. మంత్రి వెంట మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఆలయానికి విచ్చేశారు. మంత్రి నాగేశ్వరరావు దంపతులు 18 గ్రాముల బంగారంతో తయారు చేయించిన బొట్టు, నత్తు, బులాకీలను చైర్మన్‌కు అందచేశారు. అనంతరం వేద పండితులు ఆశీర్వదించగా, చైర్మన్ అమ్మవారి ప్రసాదాలు, పట్టువస్త్రాలను మంత్రికి అందజేశారు.
ఇంద్రకీలాద్రిపై చురుగ్గా ఉగాది ఏర్పాట్లు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంలో ఉగాది పర్వదినానికి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. వసంత నవరాత్రోత్సవాలు పురస్కరించుకుని అమ్మవారికి తొమ్మిది రోజులు నిర్వహించే విశేష పుష్పార్చనకు లక్ష్మీ గణపతి ప్రాంగణంలోని యాగశాలలో ఏర్పాట్లు చేస్తున్నారు. రాజగోపురం ఎదుట కళావేదికపై పంచాంగ శ్రవణానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అమ్మవారి ఆలయానికి విద్యుత్ దీపాలను ఏర్పాటు చేస్తున్నారు. ఉగాది రోజు అమ్మవారి ప్రధాన ఆలయంతో పాటు గుడి ప్రాంగణంలో పుష్పాలతో అలంకరించాలని ఆలయ సిబ్బందిని అధికారులు ఆదేశించారు. పండుగ రోజు శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి ఉత్సవమూర్తులను వెండి రథంపై ఊరేగించనున్నారు.

సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో ఎమ్మెల్యే సుచరిత, కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు