
మాట్లాడుతున్న బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు
నెహ్రూనగర్(గుంటూరు): జనగణనలో ఓబీసీ కులగణన చేపట్టాలని, చట్ట సభల్లో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని, జనాభా దామాషా ప్రకారం బీసీల రిజర్వేషన్లను పెంచాలనే ప్రధాన డిమాండ్లతో ఈ నెల 28, 29వ తేదీల్లో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు తెలియజేశారు. సోమవారం చుట్టుగుంటలోని సంఘ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీల కులగణన చేపడతామని మాట ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం హామీని విస్మరించిందన్నారు. తొమ్మిదేళ్లుగా బీసీల సంక్షేమం కోసం కేంద్రం చేసింది శూన్యమన్నారు. చట్ట సభల్లో బీసీలకు 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని ఎన్నో ఏళ్లుగా దేశవ్యాప్తంగా ఉద్యమిస్తున్నప్పటికీ కేంద్రం పట్టించుకోకపోవడం దారుణమని పేర్కొన్నారు. సంఘ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కుమ్మర క్రాంతికుమార్ మాట్లాడుతూ ఇటీవల ఛత్తీస్‌ఘడ్‌లో జరిగిన కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశంలో బీసీల కులగణన చేస్తామని, చట్ట సభల్లో రిజర్వేషన్ కల్పిస్తామని తీర్మానం చేయడం అభినందనీయమన్నారు. సమావేశంలో సంఘ నాయకులు నిమ్మల శేషయ్య, అన్నవరపు నాగమల్లేశ్వరరావు, కొల్లికొండ వెంకటసుబ్రహ్మణ్యం, ముప్పాన వెంకటేశ్వర్లు, ద్వారకా శ్రీను, వెంకట్రావు, కుమార్ తదితరులు పాల్గొన్నారు.