
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పారిశ్రామిక రంగంపై అవగాహన కల్పించే ఉద్దేశంతో సోమవారం నగరంపాలెంలోని స్టాల్ బాలికోన్నత పాఠశాలలో ఎంటర్‌ప్రెన్యూరియల్ మైండ్‌సెట్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (ఈఎండీపీ)లో భాగంగా జిల్లా స్థాయి ప్రదర్శన నిర్వహించారు. డీఈవో పి.శైలజ పర్యవేక్షణలో జరిగిన ప్రదర్శనకు జిల్లాలోని వివిధ ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్, కేజీబీవీ, సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈఎండీపీ జిల్లా మేనేజర్ బి.ఆరాధ్యశర్మ మాట్లాడుతూ విద్యార్థులకు పారిశ్రామిక విధానంపై అవగాహన కల్పించేందుకు గత ఏడాది 14 నుంచి జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. క్షేత్రస్థాయి శిక్షణలో భాగంగా 85 పాఠశాలల నుంచి 317 ప్రాజెక్టులను ఏర్పాటు చేయగా, వాటిలో జిల్లా స్థాయికి 10 ప్రాజెక్టులు ఎంపికై నట్లు తెలిపారు. వీటిలో రెండు ప్రాజెక్టులను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేశామని తెలిపారు. మంగళగిరి మండలం చినకాకాని జెడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయులు డి.సుజాత, స్వర్ణ రాజలతతో పాటు విద్యార్థులు వి.ధనుష్, దివ్య, సాత్విక, తెనాలి మండలం కొలకలూరులోని జెడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయుడు ఎం.అన్నారావు, విద్యార్థులు వి.ఝాన్సీ, ఎస్.కావ్య, ఎన్.స్వాతి రాష్ట్ర స్థాయికి ఎంపికై నట్లు వివరించారు. కార్యక్రమంలో గుంటూరు డీవైఈవో కె.సుధాకర్‌రెడ్డి, జిల్లా సైన్స్ అధికారి ఆర్.శివనాగేశ్వరరావు, డైట్ ప్రిన్సిపాల్ సుభాని, ప్రోగ్రామ్ మేనేజర్ సీహెచ్ బ్రహ్మం, పాఠశాల హెచ్‌ఎం ఆనందకుమారి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.