ఐదుగురు గంజాయి నిందితుల అరెస్ట్‌

మాట్లాడుతున్న ఏఎస్పీ మహేష్‌, సూపరింటెండెంట్‌ అన్నపూర్ణ, సీఐలు - Sakshi

చేబ్రోలు: వివిధ ప్రాంతాల నుంచి గంజాయి తీసుకువచ్చి విక్రయిస్తున్న ఐదుగురు యువకులను పొన్నూరు పోలీసులు అరెస్ట్‌ చేశారు. చేబ్రోలు పోలీసు స్టేషనన్‌లో తెనాలి డీఎస్పీ కె.స్రవంతిరాయ్‌ సోమవారం విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. పొన్నూరు పట్టణానికి చెందిన నూనె గోపి, కొల్లి సురేష్‌, దావీద్‌ హరిబాబు, తెనాలి ప్రాంతానికి చెందిన కలవకొల్లు మాణిక్యరావు, పచ్చలతాడిపర్రు గ్రామానికి చెందన చుక్కా సుబ్బారావు వద్ద నుంచి రెండు కిలోల గంజాయిని పొన్నూరు పట్టణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ స్రవంతిరాయ్‌ మాట్లాడుతూ పట్టణంలో గంజాయిని చిన్నచిన్న పొట్లాలుగా చేసి విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు నిఘా ఏర్పాటు చేసి ఐదుగురు యువకులను అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి రెండు కిలోల గంజాయి, మూడు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. విశాఖపట్నం పరిసర ప్రాంతాల నుంచి గంజాయిని కొనుగోలు చేసిన నిందితులు పొన్నూరుకు తీసుకువచ్చారన్నారు. పొన్నూరు –గుంటూరు రోడ్డులోని కనకదుర్గమ్మ గుడి పక్క డొంకలోని చెట్ల పొదల వద్ద దాచిన గంజాయిని విక్రయించటానికి నిలబడగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితులను పట్టుకున్న పొన్నూరు అర్బన్‌ సీఐ బాబి, ఎస్‌ఐలు హసీం, రామబ్రహ్మం, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.

ముగ్గురు గంజాయి విక్రేతల అరెస్ట్‌

నగరంపాలెం(గుంటూరు): గంజాయి విక్రయించే ముగ్గురు యువకులను ఎస్‌ఈబీ (సెబ్‌) గుంటూరు– 2, డీఎస్‌ఈఓ బృందం సంయుక్తంగా అరెస్ట్‌ చేశారు. ఇన్నర్‌ రింగ్‌రోడ్డులోని ఎస్‌ఈబీ గుంటూరు– 2 స్టేషన్‌లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలను ఎస్‌ఈబీ జిల్లా ఏఎస్పీ డీఎన్‌ మహేష్‌ వెల్లడించారు. ముందస్తు సమాచారం మేరకు సోమవారం ఉదయం చుట్టుగుంట – కేవీపీ కాలనీకి వెళ్లే ప్రధాన రహదారిలో ఎస్‌ఈబీ గుంటూరు–2, డీఎస్‌ఈఓ బృందాలు వాహన తనిఖీలు నిర్వహించాయి. ఈ క్రమంలో బాపట్ల జిల్లా చీరాల టౌన్‌ జవహర్‌నగర్‌కు చెందిన మందపాటి వీరాంజనేయులు, గుంటూరు అశోక్‌నగర్‌ 4/5వ అడ్డరోడ్డుకు చెందిన బెజవాడ శ్రావణ్‌కుమార్‌, విజయవాడ పెనమలూరు వాసి సోమరోతు సాయిఆదిత్యను అదుపులోకి తీసుకుని విచారించారు. గంజాయిని వైజాగ్‌ నుంచి గుంటూరుకు తీసుకువచ్చి అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు విచారణలో వెల్లడైంది. వీరిలో వీరాంజనేయులు పదో తరగతి వరకు చదవగా, శ్రావణ్‌కుమార్‌, సాయిఆదిత్య డిగ్రీ వరకు చదివారు. వీరాంజనేయులుకు గంజాయి తాగే అలవాటు ఉండగా, సాయిఆదిత్య పాత నేరస్తుడని చెప్పారు. వీరి నుంచి రూ.35 వేలు ఖరీదు చేసే ఒక కిలో 100 గ్రాముల గంజాయి, మోటారుసైకిల్‌ సీజ్‌ చేశారు. సమావేశంలో సూపరింటెండెంట్‌ ఎన్‌.అన్నపూర్ణ, ఎస్‌ఈబీ గుంటూరు–2 సీఐ కె.కర్ణ, డీఎస్‌ఈఓ సీఐ టీపీ నారాయణస్వామి, ఎస్‌ఐ ఇ.కల్యాణ్‌చక్రవర్తి, హెచ్‌సీలు పీవీ పోతురాజు, ఎం.లక్ష్మారావు, కానిస్టేబుళ్లు ఎల్‌.కోటేశ్వరరావు, పి.రవీంద్రరెడ్డి, కె.నాగరాజు, కె.ప్రేమ్‌కుమార్‌, సీహెచ్‌ ఆంజనేయులు, వీసీహెచ్‌ ఆంజనేయులు, కె.పూర్ణచంద్రరావు పాల్గొన్నారు.

రెండు కిలోల గంజాయిని

స్వాధీనం చేసుకున్న పోలీసులు

Read latest Guntur News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top