గుంటూరు ఎడ్యుకేషన్: పదో తరగతి దశను అధిగమించి ఇంటర్మీడియెట్‌లోకి ప్రవేశించే విద్యార్థులు క్రమశిక్షణతో ఉన్నత చదువుల దిశగా ముందుకు వెళ్లాలని ఆంధ్రప్రదేశ్ అన్‌ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (అపుస్మా) జిల్లా అధ్యక్షుడు బి.పోతిరెడ్డి పేర్కొన్నారు. నగరంపాలెంలోని ప్రజ్ఞ స్కూల్లో సోమవారం టెన్త్ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజ్ఞ విద్యాసంస్థల కరస్పాండెంట్ ఎన్.చక్రనాగ్ మాట్లాడుతూ మూడు దశాబ్దాలుగా తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలుపుకుంటూ, విద్యార్థులతో స్నేహపూర్వకంగా మెలిగి ప్రతిభావంతులుగా తీర్చిదిద్దుతున్నామన్నారు. టెన్త్ తరువాత ఇంటర్‌లో చేరే విద్యార్థులు తమకు నచ్చిన ఎంపీసీ, బైపీసీ తదితర కోర్సులను ఎంపిక చేసుకుని, వాటిపై దృష్టి సారించేందుకు అవసరమైన నైతిక స్థైర్యాన్ని అందించామని వివరించారు. ఇంటర్ దశలో క్రమశిక్షణతో ఎంచుకున్న సబ్జెక్టులలో ప్రణాళికాబద్ధంగా చదివి ఉన్నత విద్యకు బాటలు వేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఒకటో తరగతి నుంచి టెన్త్ వరకు కలిసి చదువుకున్న విద్యార్థులు తమ సహచరులను వీడుతున్నామనే బాధతో భావోద్వేగానికి గురయ్యారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎన్.కోటేశ్వరరావు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.