నరసరావుపేట: పట్టణంలోని బరంపేటలో గల విద్యుత్ ఆఫీసు పక్కనే ఉన్న శ్రీరస్తు కన్వెన్షన్ సెంటర్‌లో మంగళవారం ఉదయం 10 గంటలకు విద్యుత్ సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వై.ఏడుకొండలు ఆదివారం వెల్లడించారు. ఏపీసీపీడీసీఎల్ పరిధిలోని ఎన్టీఆర్, బాపట్ల, గుంటూరు, పల్నాడు, నరసరావుపేట, ప్రకాశం జిల్లాలలోని హెచ్‌టీ వినియోగదారుల విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు విద్యుత్ ఫోరంను నిర్వహిస్తున్నామన్నారు. సరఫరాలో ఎటువంటి సమస్య ఉన్నా రాతపూర్వకంగా సర్వీసు కనెక్షన్ నెంబరు, పూర్తి అడ్రస్సు, సెల్ నంబరుతో పోస్టు ద్వారా లేదా వ్యక్తిగతంగా హాజరై తెలియజేయాలన్నారు. ఫిర్యాదుల కోసం ఎటువంటి డబ్బులు, వకీలును పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు. విద్యుత్ సరఫరాలో తరచుగా వచ్చే సమస్యలు, విద్యుత్ హెచ్చుతగ్గులు, మీటరు ఎక్కువగా తిరుగుట, ఆగిపోవుట, నూతన సర్వీసులు ఇచ్చేందుకు నిరాకరణ, జాప్యం, సరఫరాకు సంబంధించిన ఇతర సమస్యలను పరిష్కరించుకోవచ్చన్నారు.
ఆరు రేవులకు బహిరంగ వేలం రేపు
గుంటూరుఎడ్యుకేషన్: జెడ్పీ ఆధీనంలోని కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో ఆరు రేవులకు ఈనెల 21న ఉదయం 10.30 గంటలకు బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు జెడ్పీ సీఈఓ జె.మోహన్‌రావు ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కృష్ణానదిలో పడవలు, బల్లకట్టు నడుపుకొనేందుకు సుంకం వసూలు చేసుకునే నిమిత్తం 2023–24 సంవత్సరానికిగాను ఈనెల 9వ తేదీన 12 రేవులకు నిర్వహించిన బహిరంగ వేలంలో ఆరు రేవులకు సంబంధించి వేలం పూర్తయిందని తెలిపారు. అచ్చంపేట మండలంలోని మాదిపాడు, పుట్లగూడెం, మాచవరం, గోవిందాపురంలలో బల్లకట్టు, కొల్లిపర మండలంలోని వల్లభాపురం, మున్నంగిలో పడవలు తిప్పుకొనేందుకు తిరిగి మంగళవారం బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.