44 టీఎంసీలకు చేరిన పులిచింతల ప్రాజెక్టు

- - Sakshi

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నీటి సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా ఎగువ పరీవాహక ప్రాంతాలలో కురిసిన వర్షం నీరు వచ్చి చేరడంతో ప్రస్తుత నీటి నిల్వ 44.1326 టీఎంసీలకు చేరింది. ఇది 173.9480 అడుగుల లోతుతో సమానం. ప్రాజెక్టు రేడియల్‌ గేట్స్‌ మొత్తం మూసి ఉంచినట్లు ప్రాజెక్టు ఏఈ రాజశేఖర్‌ ఆదివారం విలేకరులకు తెలిపారు. ఎగువ నుండి 4,000 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా, క్రస్ట్‌ గేటు లీకుల ద్వారా దిగువ 200 క్యూసెక్కులు మాత్రమే వెళుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ప్రాజెక్టులో కృష్ణా, డెల్టా ప్రాంత రైతులకు రెండు సీజన్ల పాటు ఏడాదిలో రెండు పంటలు పండించుకునేందుకు అవసరమైన సాగునీరు నిల్వ ఉంది. గత నాలుగేళ్లుగా ప్రతి ఏటా ప్రాజెక్టులో 44 టీఎంసీలకు నీరు చేరుతూనే ఉంది. గత ప్రభుత్వ హయాంలో ఎన్నడూ ప్రాజెక్టులో 25 నుంచి 30 టీఎంసీలకు మించి నిల్వ ఉన్న పరిస్థితి లేదు.

అద్దంకి శాసనం కోసం కృషి హర్షణీయం

బాపట్ల అర్బన్‌: అద్దంకి పద్య శాసనాన్ని తిరిగి రాష్ట్రానికి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేయడం హర్షణీయమని ఫోరం కార్యదర్శి డాక్టర్‌ పీసీ సాయిబాబు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. తమిళనాడు ప్రభుత్వానికి లేఖ రాయడం ముదావహం అని, ఇది తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి పద్యశాసనంగా నిలుస్తోందని పేర్కొన్నారు. 12 శతాబ్దాల క్రితం బాపట్ల జిల్లాలోని అద్దంకిలో ఈ పద్య శాసనం వెలుగు చూసిందన్నారు. అంటే తెలుగు సాహిత్యంలో తొలి కిరణాలు బాపట్ల జిల్లా నుంచే ప్రసరించాయన్నారు.

తెలుగు సాహిత్యం బాపట్ల జిల్లాలోనే ఓనమాలు దిద్దుకున్న విషయాన్ని వెల్లడించారు. సంస్కృత భాషాపెత్తనాన్ని ధిక్కరించి, తెలుగు పద్యాలను శాసనాల కెక్కించిన కవులు ఆనాడే జిల్లాలో ఉండడం మనకు గర్వకారణమన్నారు. తెలుగు పద్య మహా సౌధానికి పునాదిరాళ్లు మోసినవారు మన జిల్లా వారు కావడం విశేషమన్నారు. తూర్పు చాళుక్య మహారాజగు మూడవ గుణగ విజయాదిత్యుడు కాలం నాటిది ఈ శాసనమన్నారు. ఆయన సేనాధిపతి పాండురంగడు క్రీస్తు శకం 848లో దీనిని వేయించారని చరిత్ర చెబుతోందన్నారు. అద్దంకి పొలాల్లో ఇది లభ్యమైందని, తరువాత 1922లో దీనిని చైన్నె ఎగ్మోర్‌లోని ప్రభుత్వ మ్యూజియానికి తరలించినట్లు చరిత్ర చెబుతోందని వివరించారు. దానిని వందేళ్ల తర్వాత రాష్ట్రానికి తిరిగి తీసుకురావడానికి ప్రయత్నాలు జరగడం ఆహ్వానించదగ్గ పరిణామంగా పేర్కొన్నారు.

Read latest Guntur News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top