
కార్యక్రమంలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఇన్నోవేటర్ సుధాన్షు మణి
● వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఇన్నోవేటర్ సుధాన్షు మణి ● విజ్ఞాన్‌లో వైభవంగా ముగిసిన జాతీయస్థాయి సృజనాంకుర–2కే23
చేబ్రోలు: ఓటములను ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడే విజయాలకు దరిచేరగలమని వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఇన్నోవేటర్ సుధాన్షు మణి అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో రెండు రోజుల పాటు నిర్వహించిన జాతీయస్థాయి విజ్ఞాన్ సృజనాంకుర–2కే23 కార్యక్రమం శనివారం అట్టహాసంగా ముగిసింది. ముగింపు కార్యక్రమంలో వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఇన్నోవేటర్ సుధాన్షు మణి మాట్లాడుతూ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ విజయవంతం కావడంలో తనతో పాటు తెరవెనుక ఎంతోమంది కృషి చేశారని తెలియజేసారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ విజయవంతం కావడం కంటే ముందు తాను లెక్కించలేనన్ని ఓటములను ఎదుర్కొనన్నారు. విద్యార్థులు మీ దగ్గరున్న ఐడియాలను సరైన దిశలో ఆచరణ పెట్టినట్‌లైతే విజయం సాధించగలరన్నారు.
న్యూఢిల్లీలోని బోట్‌ల్యాబ్ డైనమిక్స్ ఎండీ డాక్టర్ సరిత అహల్వాత్ మాట్లాడుతూ కలల సాకారానికి విద్యార్థులు అంకితభావంతో కృషి చేస్తే ఉన్నతంగా ఎదిగే శక్తి సామర్థ్యాలు ఉంటాయన్నారు. భయం, సందేహాలకు జీవితంలో తావివ్వొద్దని విద్యార్థులకు సూచించారు. డబ్బుతో సాధించలేనివి ఎన్నో ప్రేమ, మన్నింపు, ధైర్యంతో సాధించవచ్చనన్నారు. నూకాన్ ఏరోస్పేస్ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ అరవింద్ కే సింగ్ మాట్లాడుతూ భారతీయ యువతలో మేథాశక్తికి కొదవలేదని దేశాన్ని ఆర్థికంగా పరిపుష్ఠం చేయడానికి ఆలోచనలకు పదునుపెట్టాలన్నారు. విద్యార్థులు చేసే ప్రయోగాలు సామాన్యుల అవసరాలను తీర్చే లా సైన్స్ ఉండాలన్నారు. విజ్ఞాన్ సృజనాంకుర–2కే23 విజేతలకు రూ.9 లక్షల విలువైన బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో విజ్ఞాన్ సంస్థల చైర్మన్ లావు రత్తయ్య, వీసీ పీ.నాగభూషణ్, రిజిస్ట్రార్ ఎంఎస్ రఘునాథన్ ప్రిన్సిపాల్స్ తదితరులు పాల్గొన్నారు.