చరిత్రను కాటేయ జూస్తున్నారు!

Vardhelli Venkateswarlu Write on Telangana People Armed Struggle - Sakshi

అభిప్రాయం

తొలిసారి నేను 1999లో నల్లమలను చూశాను. చెంచుల తొలి పరిచయం అప్పుడే. అప్పాపూర్‌ పెంట పెద్ద మనిషి తోకల గురువయ్య నాకు తొలి చెంచు మిత్రుడు. అప్పటికే 60 ఏళ్లు దాటిన వృద్ధుడు. తెల్లటి ఛాయ, బుర్ర మీసాలు... చెంచు ఆహార్యమే గాని, ఇగురం తెలిసిన మనిషి. ఈడు మీదున్నప్పుడు ఇప్ప సారా గురిగి లేపితే సేరు సారా అవలీలగా పీకేటో డట. 83 ఏళ్ల వయసులో మూడేళ్ల కిందట చనిపోయాడు.    

తుంగతుర్తి పోలీస్‌ స్టేషన్‌ మీద భీమిరెడ్డి ఫైరింగ్‌. బాలెంల, పాత సూర్యాపేట ఊదరబాంబు దెబ్బ. పాలకుర్తి పోరాటానికి ఐలమ్మ స్ఫూర్తి. దొడ్డి కొమురయ్య, మల్లెపాక మైసయ్య, బందగీ అమరత్వంతో ఊరూరా ప్రజా యుద్ధం సాగింది. ఈ దశలోనే రైతాంగ సాయుధ పోరాటానికి బీజం పడ్డది. భీమిరెడ్డి నర్సింహారెడ్డి (బీఎన్‌) తొలి తుపాకీని భుజం మీద పెట్టుకున్నడు. సాయుధ రైతాంగ దళాలు ఏర్పడి,  పోరాటం చేసి మూడువేల గ్రామాలను విముక్త గ్రామాలుగా ప్రకటించాయి. భూములను పంచాయి. ఖాసీం రజ్వీ సేనల నరమేధానికి కమ్యూ నిస్టు గెరిల్లాలు వెనక్కి తగ్గలేదు. పంచిన భూములను జనం వదల్లేదు. పంట ఇంటికి చేరు తోంది. అప్పుడప్పుడే జనానికి కడుపు నిండా బువ్వ దొరుకు తోంది. అగో.. అప్పుడు దిగింది పటేల్‌ సైన్యం!

నాలుగు రోజుల్లో యుద్ధం ముగిసింది. ఆశ్చర్యకర పరి ణామాల నేపథ్యంలో నిజాం మకుటం లేని మహారాజు అయిండు. నయా జమానా మొదలైంది. పటేల్‌ సైన్యం నిజాంకు రక్షణ కవచం అయింది. కమ్యూనిస్టుల వేట మొదలు పెట్టింది. అట్లాంటి సంక్లిష్ట సమయంలో రావి నారాయణరెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి లాంటి పెద్దలు సాయుధ పోరాటం వద్దన్నరు. భీమిరెడ్డి ఎదురు తిరిగిండు. సర్దార్‌ పటేల్‌ది విద్రోహం అన్నడు. తుపాకి దించితే జరిగే అనర్థాన్నీ, భవిష్యత్తునూ కళ్లకు గట్టినట్టు వివరించాడు. మనలను నమ్మి దళాల్లోకి వచ్చిన దళిత బహుజన గెరిల్లాలను మనంతట మనమే శత్రువుకు అప్ప గించినట్టేనని వాదిస్తున్నాడు. కానీ మితవాద కమ్యూనిస్టుల చెవికి ఎక్కడం లేదు. 
          
బీఎన్‌ అనుమానమే కాలగమనంలో అప్పాపూర్‌ చెంచు పెద్ద తోకల గురువయ్య అనుభవంలోకి వచ్చింది. 1999లో నేను నల్లమల వెళ్ళినప్పుడు ఆయన్ను కదిలిస్తే... ‘కమ్యూనిస్టుల దెబ్బకు గడీలను వదిలి పట్నం పారి పోయిన భూస్వాములు తెల్ల బట్టలేసుకొని, మల్లా పల్లెలకు జొచ్చిండ్రు. వీళ్లకు పటేల్‌ సైన్యాలే కావలి. కమ్యూనిస్టు దళాలల్ల చేరి, దొరల భూముల్లో ఎర్రజెండాలు పాతిన వాళ్లను దొరక బట్టి, కోదండమేసి నెత్తుర్లు కారంగ కొట్టేటోళ్లు. బట్టలు విప్పించి, ఒంటి మీద బెల్లం నీళ్లు చల్లి, మామిడి చెట్ల మీది కొరివి చీమల గూళ్ళు తెచ్చి దులిపేవాళ్లు. కర్రలతో కొట్టి సంపేవాళ్లు. (క్లిక్ చేయండి:  సెప్టెంబర్‌ 17.. ప్రాధాన్యత ఏమిటి?)

దొరతనం ముందు నిలువలేక సోర సోర పొరగాండ్లు మల్లా ఈ అడివికే వచ్చిండ్రు. ఎదురు బొంగులను జబ్బకు కట్టుకొని, దాని మీదంగ గొంగడి కప్పుకునేటోళ్లు. చూసే వాళ్లకు జబ్బకున్నది తుపాకి అనిపించేది. సైన్యం అంత సులువుగా వీళ్ల మీదికి రాకపోయేది. గానీ... ఆకలికి తాళలేక ఎక్కడి వాళ్లు అక్కడ పడి పాణం ఇడిసేటోళ్లు. చెంచులం అడివికి పొలం పోతే సచ్చి పురుగులు పట్టిన పీనిగెలు కనపడేయి. అట్లా సావటానికైనా సిద్ధపడ్డరు కానీ... ఇంటికి పోవటానికి మాత్రం సాహసం చేయక పోయేటోళ్లు. దొరలు పెట్టే చిత్ర హింసల సావు కంటే, ఇదే నయం అనుకునేటోళ్లు’... ఇలా ఎన్నో విషయాలు చెప్పాడు. బీఎన్‌ ఆనాడు మితవాద కమ్యూనిస్టు నేతలతో చివరి నిమిషం వరకు తుపాకి దించనని చెప్పింది ఇందుకే. ఇప్పుడు ఓ మత పార్టీ రాజకీయ క్రీడ ఆడబూనింది. కమలం పువ్వు మాటున చరిత్రను కాటేయాలనుకుంటోంది. సాయుధ పోరాట అపూర్వ ఘట్టాలకు గోరీ కట్టి ఖాకీ నిక్కరు తొడగాలని తాపత్రయపడుతోంది. తెలంగాణ పౌరుల్లారా... తస్మాత్‌ జాగ్రత్త!


- వర్ధెల్లి వెంకటేశ్వర్లు 
సీనియర్‌ జర్నలిస్టు, పరిశోధక రచయిత

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top