రూల్‌ ఆఫ్‌ లా : నాడు–నేడు

Vardhelli Murali Article On Rule Of Law - Sakshi

జనతంత్రం

ఎందుకో తెలియదు. ఆనాటి కాలమహిమ ఏమిటో సామా న్యులకు అర్థం కాదు. సాక్షాత్తూ ఒక శాసనసభ్యుడు ఒక మహిళా అధికారి జుట్టు పట్టుకుని ఈడ్చేసిన రోజున, దుశ్శాసన పర్వాన్ని బహిరంగంగా పునఃప్రదర్శించిననాడు ఎందుకనో ఈ రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు బ్రేక్‌డౌన్‌ అయినట్టు ఎవరికీ అనిపించ లేదు. రవాణా శాఖలో అత్యున్నత పదవిలో పనిచేస్తున్న ఒక సీని యర్‌ మోస్ట్‌ ఐఏఎస్‌ అధికారిని నడివీధిలో నిలబెట్టి ఒక ఎంపీ, మరో ఎమ్మెల్యే వారి అనుచరగణం చూపుడు వేళ్లతో బెదిరిస్తూ, బూతులు తిట్టిన రోజున కూడా ఎందుకనో పెద్దలెవరూ రాజ్యాంగ వ్యవస్థల భవిష్యత్తుపై బెంగపడలేదు.రిషితేశ్వరి అనే చదువుల తల్లిని, తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా పెంచుకున్న గారాల పట్టిని కామాంధులు చిదిమేస్తే, కంచే చేను మేసిన చందంగా ఆ కళాశాల ప్రిన్సిపల్‌పైనే ఆరో పణలు వస్తే, ప్రభుత్వ పెద్దల అండతో ఆ ప్రిన్సిపల్‌ నిక్షేపంగా తిరుగాడుతుంటే ఎందుకనో రూల్‌ ఆఫ్‌ లా ఏమైందని పూజ్యు లెవరూ ప్రశ్నించనే లేదు. 

పాలక పార్టీ అనుయాయులు ఇసుకాసురుల అవతారం దాల్చి వాగులూ వంకల మూల్గలు పేల్చేస్తున్న వేళ, ఈ దుర్నీ తిని ఆపేయాలని కోరుతూ ధర్నాకు దిగిన ఏర్పేడు గ్రామస్తు లను లారీలతో తొక్కించి, ఇరవైమంది ప్రాణాలను హరించి రహదారిపై వారి నెత్తురును బలి చల్లినప్పుడు ఎందుకనో ఇందులో కుట్ర కోణం తోచనేలేదు. రేషన్‌ కార్డుకు లంచం, నీ కులమేదో చెప్పడానికి లంచం, నీ రాబడి ఎంతో చెప్పే కాగితానికి లంచం, ఇంట్లో బిడ్డ పుట్టిన తేదీని నిర్ధారించే పత్రానికి లంచం. పెద్దమనిషి చనిపోయాడన్న ధ్రువీకరణ పత్రానికి లంచం. ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోతే లంచం, పింఛన్‌ ఇప్పిస్తే లంచం. అధికార వర్గానికి ఒక రేటు, పాలక పార్టీ వారి జన్మభూమి కమిటీకి మరొక రేటు. పౌరులు ఉచి తంగా పొందవలసిన సేవలకు ‘డబుల్‌ ట్యాక్స్‌’ చెల్లించిన అన్యాయపు రోజులలో ఇదేమి రాజ్యమనీ, దోపిడీ రాజ్యం కాదా అని ఎవరూ ప్రశ్నించనే లేదెందుకనో.

ప్రభుత్వ పెద్దలే పూనుకుని, బుల్డోజర్లు పెట్టి బాజప్తా బెజవాడ వీధుల్లో 40 దేవాలయాలను కూల్చివేసిన రోజున ఎవరి మతవిశ్వాసాలూ దెబ్బతిననే లేదు. స్వయంగా ముఖ్య మంత్రే మీడియా సమావేశంలో ‘దళితులుగా పుట్టాలని ఎవ రైనా కోరుకుంటారా?’ అని ఈసడించుకుంటే అందులో కుల దురహంకారం గోచరించలేదెందుకో తెలియదు. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన తర్వాత ప్రభుత్వ డబ్బును పసుపు కుంకుమ పేరుతో ఓట్ల కొనుగోలుకు బరితెగించి ఉపయోగిస్తే, ఇంటికి పదివేల చొప్పున బ్యాంకు ఖాతాల్లోకే బట్వాడా చేస్తే సమన్యాయ పాలన సమ్మగానే ఉన్నట్లు వ్యవస్థలు అనుభూతి పొందిన కారణమేమిటో ఎంతకూ అర్థం కాదు. నాటి ఐదేళ్ల పాలనలో అమలైన రూల్‌ ఆఫ్‌ లా విశేషాలను ఇలా చెప్పు కుంటూ పోతే కొండవీటి చాంతాడును పేనవలసి ఉంటుంది.

రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత న్యాయస్థానం ‘రాష్ట్రంలో రూల్‌ ఆఫ్‌ లా ఉన్నదా లేదా?’ అని వ్యాఖ్యానించి నట్టు మీడియా రిపోర్టు చేసింది. అంటే రాష్ట్రంలో చట్టబద్ధమైన పరిపాలన అందుతున్నదా... లేదా? సమన్యాయం అందుతు న్నాదా.. లేదా అని ఉన్నత న్యాయస్థానం సందేహపడినట్టు ఆ రిపోర్టులో పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థల బ్రేక్‌డౌన్‌ జరిగిందా లేదా అన్న విషయాన్ని కూడా తేల్చేస్తామని న్యాయస్థానం హెచ్చరించినట్టు రిపోర్టయ్యింది. దసరా కంటే ముందుగానే పులివేషం వేసే అవకాశాన్ని ఎల్లో మీడియాకు ఈ వార్తా కథనాలు కల్పించాయి. భూమి బద్దలై నంత ప్రాధాన్యతనిచ్చి ఎల్లో మీడియా రిపోర్టు చేసింది. అదే రోజు రాష్ట్రానికే సంబంధించిన మరో అంశంపై సుప్రీంకోర్టు ప్రాథమిక దశలోనే కేసుల దర్యాప్తుపై స్టే ఇవ్వడం సరికాదని రాష్ట్ర హైకోర్టుకు సూచనలు చేసింది. ఈ వార్తను మాత్రం ఎల్లో మీడియా ‘దాగుడుమూతలు దండాకోర్, పిల్లీ వచ్చే ఎలుకా భద్రం’ అన్నట్టుగా దాచేసింది.

రాజధాని ప్రాంతంలో అసైన్డ్‌ భూముల అక్రమ బద లాయింపులపై అప్పటి తుళ్లూరు తాసిల్దారు సుధీర్‌బాబు మీద సీఐడీ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. దీన్ని కొట్టేయాలని ఆయన హైకోర్టుకు వెళ్లారు. ఆయన కోరిన విధంగా హైకోర్టు ఆదేశాలి చ్చింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. దర్యాప్తు స్టే ఇవ్వడాన్ని ప్రాథమికంగా తప్పుపడుతూ కేసును వారంలోగా తేల్చాలని హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించింది. విజయవా డలో రమేశ్‌ ఆస్పత్రి యాజమాన్యం నిర్వహిస్తున్న కోవిడ్‌ సెంటర్‌లో జరిగిన అగ్నిప్రమాదం వ్యవహారంలోనూ ఈవి ధమైన పరిణామాలే సంభవించాయి. దర్యాప్తుకు సహకరించ కుండా పారిపోయిన ఆస్పత్రి చైర్మన్‌ రమేశ్‌బాబు తన మీద నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలని హైకోర్టును ఆశ్రయిం చారు. రమేశ్‌పై తదుపరి చర్యలను హైకోర్టు నిలుపుదల చేసింది. ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా హైకోర్టు ఇచ్చిన స్టేను తొలగించింది. ప్రాథమిక దశలోనే దర్యాప్తును అడ్డుకోవడం సరైన విధానం కాదని సర్వోన్నత న్యాయస్థానం అనేక సందర్భాల్లో ప్రకటించింది.

గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఉపసంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా అమరావతి భూముల్లో జరిగిన ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై, ఫైబర్‌నెట్‌ ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఏర్పాటు చేసింది. దాన్ని సవాల్‌ చేస్తూ తెలుగుదేశం నాయకులు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. తదుపరి చర్యలను హైకోర్టు నిలిపివేసింది. అమరావతి భూకుంభకోణంపై ఏసీబీ కేసు నమోదు చేయడానికి ముందే మాజీ అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ హైకోర్టును ఆశ్రయించి తనను అరెస్ట్‌ చేయకుండా ఆదేశాలివ్వాలని అభ్యర్థించారు. మరుసటిరోజు ఏసీబీ దమ్మాల పాటితోపాటు సుప్రీంకోర్టు సిటింగ్‌ న్యాయమూర్తి ఇద్దరు కూతుళ్లు సహా మరికొందరిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఈ ఎఫ్‌ఐఆర్‌పై కూడా స్టే విధిస్తూ నిందితులెవ్వరినీ అరెస్ట్‌ చేయ వద్దనీ, కేసు వివరాలు కూడా మీడియాలో రావద్దని హైకోర్టు ‘గ్యాగ్‌’ ఆర్డర్‌ వేసింది.

రాజకీయ నాయకులపై దాఖలైన అవి నీతి కేసుల విచారణలో జాప్యం జరగరాదని, సత్వరమే పూర్తి చేయాలనీ జస్టిస్‌ ఎన్‌.వి. రమణ నేతృత్వంలోని సుప్రీం బెంచ్‌ కింది కోర్టులను ఆదేశించిన సమయంలోనే, అవినీతి కేసులపై మన హైకోర్టులో స్టేలు మంజూరు కావడం ఆసక్తికరంగా మారింది. న్యాయవ్యవస్థ మీద, కొందరు న్యాయమూర్తుల మీద సోషల్‌ మీడియాలో కొందరు పెట్టిన పోస్టింగ్‌ల విచారణ సందర్భంగా హైకోర్టు తన ఆగ్రహాన్ని ప్రకటించింది. ఈ విష యంలో పోలీసులు, సీఐడీ జరుపుతున్న విచారణ తీరుతెన్ను లను పరిశీలిస్తామని కూడా న్యాయస్థానం స్పష్టం చేసింది. నిజమే, ఎటువంటి నియంత్రణ లేకుండా సోషల్‌ మీడియాలో సాగుతున్న వ్యక్తిత్వహనన రాతలను తీవ్రంగా గర్హించవలసినదే, అరికట్టవలసినదే. గౌరవ న్యాయమూర్తులే కాకుండా సమా జంలో సెలబ్రిటీలుగా చలామణిలో ఉన్న రాజకీయ ప్రము ఖులు, కళాకారులు ముఖ్యంగా మహిళలు సోషల్‌ మీడియా వెకిలిరాతల బాధితులే.

ఇందులో భిన్నాభిప్రాయానికి తావు లేదు. ఈ సందర్భంగా న్యాయస్థానం చేసిన తీవ్ర వ్యాఖ్యానాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కేవలం సోషల్‌ మీడియా అనే ఒక అంశాన్ని తీసుకొని మొత్తం వ్యవస్థకు ఆపాదించే ప్రయత్నం చేయడం సరికాదని అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఒకవేళ న్యాయస్థానం ఆ వ్యాఖ్యలు చేసి ఉన్నట్లయితే వాటిని తీర్పులో అంతర్భాగం చేయాలని కూడా కోరింది. రాజకీయ స్పందనలే కాకుండా, న్యాయస్థానం చేసిన ‘రూల్‌ ఆఫ్‌ లా ఉన్నదా లేదా?’, రాజ్యాంగ వ్యవస్థలు బ్రేక్‌డౌన్‌ అయ్యాయా?’ తదితర వ్యాఖ్యలు ప్రజల్లో కూడా చర్చనీయాంశాలుగా మారిపోయాయి. ఈ అంశాలపై చంద్రబాబు పరిపాలనా కాలాన్ని, నేటి పరిస్థితులను పోల్చి చూసుకుంటున్నారు. విపక్షాల విమర్శల పరదాలను, మీడియా కప్పేసిన పచ్చ ముసుగును తొలగించి చూస్తే ఆంధ్రప్రదేశ్‌ సమాజంలో చోటు చేసుకుంటున్న మార్పులను గమనించగలుగుతాము. అప్పుడు మాత్రమే అక్కడ రూల్‌ ఆఫ్‌ లా ఎలా వుందో తెలుస్తుంది. సమ న్యాయ పాలన ఏవిధంగా అమలవుతున్నదో చూడవచ్చు.

సామాజిక న్యాయం తీరుతెన్నులు చూడవచ్చు. శిథిలమైన సర్కారు బడుల్లో చిగురిస్తున్న వసంతాన్ని చూడవచ్చు. ధర్మాసు పత్రులు ఆధునిక హంగులు తొడుక్కుని జనానికి చేరువవుతున్న దృశ్యాన్ని గమనించవచ్చు. గడపగడపనూ తాకిన సర్కారు సంక్షేమాన్ని చూడవచ్చు. ఊరూరా ఎగరేసిన గ్రామ స్వరాజ్యపు గాంధేయ పతాకానికి సెల్యూట్‌ చేయవచ్చు. అన్నిటినీ మించి పల్లెటూళ్ల నుంచి లంచావతారం పారిపోతున్న అద్భుత దృశ్యాన్ని గమనించవచ్చు. అప్పటి పాలనకూ ఇప్పటి పాల నకూ తేడా ఏం చెబుతావని డెబ్బయ్యేళ్ల వయోధికుడు నాగ న్నను ప్రశ్నించినప్పుడు ‘లంచాలు అవసరం లేని పరిపాలన ఇప్పుడు చూడగలుగుతున్నానని చెప్పాడు. నాగన్నది ఎల్లుట్ల గ్రామం.

పుట్లూరు మండలం. అనంతపురం జిల్లా. ఇంతకు ముందు పుట్టినా, చచ్చినా కాగితం కావాలంటే వెయ్యి రూపా యలు ముట్టజెప్పి ఎదురు చూడవలసి వచ్చేది. ఇప్పుడు గ్రామ సచివాలయంలో అర్జీ పడేస్తే పనైపోతున్నదన్నాడు. గతంలో రేషన్‌ కార్డు, కుల, ఆదాయ, ధ్రువీకరణ పత్రాలు, అడంగల్‌లో పేరు నమోదు, పాస్‌ పుస్తకం వంటి చిన్నచిన్న పనులకోసం సగటున ప్రతి గ్రామంలోని ప్రజలు హీనపక్షం పది లక్షల రూపాయలను యేటా సమర్పించుకోవాల్సి వచ్చేదని తెనాలి సమీపంలోని బుర్రిపాలెం గ్రామ ఉపాధ్యాయుడు అంచనా వేసి చెప్పాడు. ఇప్పుడు ఆ పది లక్షలు గ్రామ ప్రజల జేబుల్లో భద్రంగా ఉంటున్నాయని చెప్పాడు. ఏ గ్రామంలో ఏ వ్యక్తిని పలకరించి అడిగినా సరే సంక్షేమ పథకాల అమలులో ‘కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం, అర్హుడయితే చాలు’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన బాస నూటికి నూరుపాళ్లు అమలవుతున్నదని చెబుతాడు.

ఇంతకంటే సమ న్యాయపాలన ఏముంటుంది? జస్ట్‌ ఆరోపణ వస్తేనే అధికార పార్టీ ఎమ్మెల్యేను సైతం అరెస్ట్‌ చేసి విచారించిన ప్రభుత్వం ఇది. రూల్‌ ఆఫ్‌ లా అమలుకు ఈ ఒక్క ఉదాహరణ చాలదా అని విజయవాడలోని ఒక న్యాయవాది ప్రశ్నించారు. విద్యకూ వైద్యా నికి దూరమై, వ్యవసాయం నిర్లక్ష్యానికి లోనై, చిన్నచిన్న పనుల కోసం ఎమ్మెల్యేల చుట్టూ, ఎమ్మార్వోల చుట్టూ తిరిగే జనంతో నిస్తేజంగా మారిన గ్రామసీమల్లో ఇప్పుడు కొత్త గాలులు వీస్తు న్నాయి. బాపుగారి ముత్యాల ముగ్గు సినిమాలో గుంటూరు శేషేంద్ర శర్మ పాటలాగా. ‘నిదురించే తోటలోకి పాట ఒకటి వచ్చింది. కన్నుల్లో నీరు తుడిచీ కమ్మని కల ఇచ్చింది.’

- వర్ధెల్లి మురళి

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top