ఇదిగో అభివృద్ధి చిరునామా!

Vardhelli Murali Article On Andhra Pradesh Socio Economic Conditions - Sakshi

జనతంత్రం

ఇండియన్‌ యూనియన్‌లోని అన్ని రాష్ట్రాల సామాజిక – ఆర్థిక స్థితిగతులపై ‘ఇండియా టుడే’ మీడియా సంస్థ గత పద్దెనిమిదేళ్లుగా సర్వే చేస్తున్నది. ఏడెనిమిది అంశాలపై ఈ సర్వే ఉంటుంది. వివిధ రంగాల నిష్ణాతులతో కూడిన బృందం తుది ఫలితాలను నిర్ధారిస్తుంది. ఈ సంవత్సరానికి గాను తాజాగా వెలువరించిన ఫలితాల్లో ‘సమ్మిళిత అభివృద్ధి’ అనే విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు తొలిస్థానం లభించింది.

సమ్మిళిత అభివృద్ధి అంటే ఏమిటి?... సమాజంలోని అన్ని వర్గాలు, సమూహాలకు ఆర్థికాభివృద్ధి ఫలితాలు అందడం. పేదలకు కూడా విద్య, వైద్యం వంటి అత్యవసర సేవలు అందుబాటులో ఉండటం. అవకాశాల్లో సమానత్వం. వెనుకబాటు తనానికి గురైన వారిని గుర్తించి వారిని సాధికార శక్తులుగా తీర్చిదిద్దడానికి వారి విద్య, నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టడం. పర్యావరణ హితమైన అభివృద్ధి మార్గాన్ని ఎంచుకోవడం.

అవకాశాల్లో, అధికారాల్లో స్త్రీ పురుష సమానత్వం. ప్రజలకు చేరువగా ఉండే సుపరిపాలన. సమ్మిళిత అభివృద్ధిలో ఇవన్నీ కీలకాంశాలు. వరల్డ్‌ సోషల్‌ ఫోరం, ఓఈసీడీ వంటి అంతర్జాతీయ వేదికలు నిజమైన అభివృద్ధిని ఈ కోణం నుంచే చూస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి ప్రబోధిస్తున్న ‘సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు’ కూడా సమ్మిళిత అభివృద్ధిని అందుకోవడానికి ఉద్దేశించినవే.

సమ్మిళిత అభివృద్ధిలో ఆర్థికాభివృద్ధి ఒక భాగం మాత్రమే! ఏడంతస్తుల మేడలు ఒకవైపూ, పెరుగుతున్న మురికివాడలు ఒకవైపా? ఇదేమి న్యాయమని తరతరాల నుంచి తాత్వికులు, రచయితలు, సామ్యవాదులు ప్రశ్నిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ ప్రశ్నలకు పెట్టుబడిదారీ వ్యవస్థ పరిధిలోనే లభించిన ఒక సమాధానం సమ్మిళిత అభివృద్ధి. ఇది ఆర్థికాభివృద్ధి కంటే బహుముఖీనమైనది. విశాలమైనది. మానవీయమైనది. సంపద సృష్టి ఆర్థికాభివృద్ధికి తార్కాణం. సంపదను సృష్టించడంతోపాటు దాని పంపిణీ, ఫలితంగా ఏర్పడే సర్వతోముఖ సమాజ వికాసాన్ని ‘సమ్మిళిత అభివృద్ధి’ (Inclusive development) అంటాము.

ఇటువంటి ఆదర్శప్రాయమైన అభివృద్ధి పథంలో దేశంలోని మిగిలిన రాష్ట్రాలకంటే ఆంధ్రప్రదేశ్‌ ఓ నాలుగడుగులు ముందుకు వేసిందని ‘ఇండియా టుడే’ సర్వే ధ్రువీకరించింది. ఈ ధ్రువీకరణకోసం పరిశీలించిన అంశాలను కూడా ఆ మీడియా సంస్థ ప్రకటించింది. పేదరిక నిర్మూలన కార్యక్రమాలు, బ్యాంకు ఖాతాలున్న పేద కుటుంబాలు, వంటగ్యాస్‌ కనెక్షన్‌ ఉన్న కుటుంబాలు, ఉపాధి హామీ విస్తృతి, సార్వత్రిక ఆరోగ్య ధీమా, ప్రజా పంపిణీతో లబ్ధి పొందుతున్న కుటుంబాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, బడికి వెళ్తున్న పిల్లల శాతం, శాచ్యురేషన్‌ పద్ధతిలో అమలు జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాల వంటి అంశాల ఆధారంగా సమ్మిళిత అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్‌ అగ్రస్థానాన్ని దక్కించుకున్నది.

నిజానికి ‘ఇండియా టుడే’ ఎంచుకున్న పరిశీలనాంశాల పరిధిని దాటి మరిన్ని విప్లవాత్మక కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్టింది. గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ, ఆర్‌బీకే సెంటర్ల ఏర్పాటు ద్వారా పాలనా వికేంద్రీకరణలో చిట్టచివరి దశకు చేరుకున్నట్టయింది. కడగొట్టున నిలబడిన పౌరునితో సర్కార్‌ కరచాలనం చేసినట్టయింది. వికేంద్రీకరణతోపాటు ప్రవేశపెట్టిన పారదర్శకత కూడా ముఖ్యమైన అంశం. ఏ రాజకీయ నాయకుని తోడు లేకుండా, ఏ పైరవీ లేకుండా, పైసా ఖర్చు కాకుండా గ్రామ సచివాలయానికి వెళ్లి తన అర్హతలకు తగిన పథకంలో లబ్ధి కోసం పౌరుడు దరఖాస్తు చేసుకోవచ్చు. నిర్ణీత కాలపరిమితిలోగా ఆ దరఖాస్తు పరిష్కారం కావాలి. ఈ రకమైన పారదర్శకత, వికేంద్రీకరణలే సుపరిపాలనకు (good governance) కొండగుర్తులు.

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది మూడో ఆర్థిక సంవత్సరం. ఈ మూడేళ్ల బడ్జెట్‌లలో సామాజిక వ్యయంతోపాటు అభివృద్ధి వ్యయం కూడా గణనీయంగా పెరిగిందని సాక్షాత్తూ రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తన నివేదికలో ఘంటాపథంగా వెల్లడించింది. మొదటి బడ్జెట్‌లో ఒకలక్షా ఆరువేల కోట్లున్న అభివృద్ధి వ్యయం రెండేళ్లు తిరిగేసరికి 1 లక్షా 58 వేల కోట్లకు పెరిగిందని రిజర్వు బ్యాంకు విశ్లేషించింది.

సోషల్‌ సెక్టార్‌పై చేసిన వ్యయం 78 వేల కోట్ల నుండి 1 లక్షా 13 వేల కోట్లకు పెరిగింది. గత మూడేళ్లుగా ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ పద్దులు పెరిగాయి. ఉద్యోగుల జీతభత్యాల ఖర్చు భారీగా పెరిగింది. చంద్రబాబు పాలన చివరి సంవత్సరంలో (2018–19) ఉద్యోగుల జీతభత్యాల ఖర్చు రూ. 32,743 కోట్లు. వర్తమాన సంవత్సరం (2021–22)లో ఆ పద్దు రూ. 50,662 కోట్లకు చేరింది. మూడేళ్లలో 55 శాతం పెరుగుదల. ఈ మూడేళ్ల బడ్జెట్‌ పద్దుల్ని పరిశీలిస్తే మిగతా వ్యయాల కంటే అభివృద్ధి వ్యయమే ఎక్కువగా పెరిగింది. ఇవన్నీ రిజర్వు బ్యాంకు విశ్లేషణలో తేలిన లెక్కలు.

నిపుణులు నిగ్గుతేల్చిన వాస్తవాలు ఇట్లా వుంటే – ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష కూటమి (టీడీపీ, మీడియా, ఇతర పార్టీల్లోని కోవర్టులు, స్లీపర్‌ సెల్స్‌ కలిపి) ప్రచారం ఇందుకు పూర్తి భిన్నంగా నడుస్తున్నది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దివాళా తీసిందని, అభివృద్ధి జాడే లేదని, వచ్చిన ఆదాయాన్ని పప్పు బెల్లాలకు ఖర్చు చేస్తున్నారనీ, పరిపాలన స్తంభించిపోయిందనీ, ఈ కూటమి యుద్ధప్రాతిపదికపై ప్రచారాన్ని చేపట్టింది. ఈ ప్రచారోధృతి ఏ స్థాయిలో వుందంటే, కొందరు తటస్థులుగా చెప్పుకునే వాళ్లు, మేధావులమనుకునేవాళ్లు, కూడా ఏమో నిజమే కామోసు అనుకునేంతగా!

సుపరిపాలన దిశగా, సమ్మిళిత అభివృద్ధి పథంలో ఆంధ్రప్రదేశ్‌ అడుగులు పడుతున్నాయన్న ‘ఇండియా టుడే’ సర్వేకూ, రాష్ట్రంలో అభివృద్ధి వ్యయమే ఎక్కువుందనీ–ఉద్యోగుల జీతభత్యాల వ్యయం కూడా మూడేళ్లలో 55 శాతం పెరిగిందనీ రిజర్వు బ్యాంకు చేసిన విశ్లేషణకూ ఈ ప్రచారం పూర్తి విరుద్ధం. నిపుణుల అంచనాలకు భిన్నమైన గణాంకాలు ఎక్కడి నుంచి తెచ్చారని తటస్థులనుకునేవాళ్లు ప్రతిపక్ష కూటమిని ప్రశ్నించాలి. అలా కాకుండా వారి తప్పుడు ప్రచారంలో కొట్టుకొనిపోవడం బాధాకరం.

అప్పులు వాస్తవం. ఆర్థిక ఇబ్బందులు వాస్తవం. అవి వారసత్వ సంపదగా ఈ ప్రభుత్వానికి సంక్రమించాయన్నది కూడా నిఖార్సయిన నిజం. రాష్ట్ర విభజనకు ముందు ఉమ్మడి రాష్ట్ర ఆదాయంలో హైదరాబాద్‌ వాటా 55 శాతం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఆదాయంలో ఆ ఒక్క నగరం వాటా 75 శాతం. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు ఈ ఆదాయ గండి పడింది. ఈ గండికి పరిహారాన్ని సమకూర్చడంలో నాటి అధికార ప్రతిపక్షాలు విఫలమయ్యాయి.

అప్పటి ప్రతిపక్ష నేత స్వయంగా చంద్రబాబే. తిలాపాపంలో తలా పిడికెడు పాత్ర ఉన్నది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామన్న యూపీఏ హామీని ఎన్డీఏ సర్కార్‌కు అమ్మేసుకుని ఆంధ్రప్రదేశ్‌కు మరో భారీ గండిని తవ్వింది మళ్లీ స్వయంగా చంద్రబాబే! ప్రత్యేక హోదా సంజీవని ఏమీ కాదనీ, ప్రత్యేక ప్యాకేజీ వల్ల ఎక్కువ ప్రయోజనం కలుగుతుందనీ ఆనాడు ఆయన సుభాషితాలు కూడా చెప్పారు. ప్రత్యేక హోదాకు ముఖ్యమంత్రే నీళ్లొదులుకోవడంతో అది ‘గతం గతః’ పద్దులో పడిపోయింది.

పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను ఉపయోగించుకునే వెసులుబాటును కూడా చేజేతులా చంద్రబాబే వదిలేసుకున్నారు. తెలంగాణ రాజకీయాల్లో దొంగవేలు దూర్చి అడ్డంగా దొరికిపోయి, కేసుల భయంతో రాత్రికి రాత్రే బిస్తరు సర్దేశారు. ఐదేళ్ల పదవీకాలంలో ఉమ్మడి రాష్ట్రం చేసిన అప్పులను మించి చేశారు. అయినా బడ్జెట్‌ పద్దుల్లో అభివృద్ధి వ్యయానికి అగ్రాసనం దక్కలేదు. అప్పు చేసిన డబ్బులతో అధికారికంగా ఓట్ల కొనుగోలుకు కూడా ప్రయత్నించారు. అప్పుడు చేసిన అప్పులకు ఏటా రూ. 20 వేల కోట్ల వడ్డీలు కట్టాల్సిన వారసత్వ బాధ్యత ఈ ప్రభుత్వం మీద పడింది. ఈ అప్పుల భారం మళ్లీ అప్పులకు దారి తీసింది.

రాజధాని పేరుతో ఐదేళ్ల పుణ్యకాలాన్ని పూర్తిగా వ్యాపార లావాదేవీల కోసం హారతి కర్పూరం చేశారు. ఒక్క శాతం పనిని కూడా పూర్తి చేయలేదు. అసలు అమరావతి రాజధాని ప్రకటనే ఏకపక్షం. వ్యాపార ప్రేరేపితం. నిపుణుల అభిప్రాయాలకు విరుద్ధం. ప్రాంతీయ అసమానతలను తొలగించడం, ప్రాంతీయ ఆకాంక్షలను గుర్తించి నెరవేర్చడం కూడా సమ్మిళిత అభివృద్ధిలో ముఖ్యమైన అంశాలే. రాయలసీమ వెనకబాటుతనానికి నెట్టబడిన ప్రాంతం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కోసం రాజధాని హోదాను త్యాగం చేసిన ప్రాంతం. ఉత్తరాంధ్ర అలక్ష్యానికి గురైన ప్రాంతం. ఆధునిక తెలుగు సంగీత సాహిత్య సంస్కృతులకు తొలి భిక్ష వేసిన ప్రాంతం.

ఈ ప్రాంతాల గుండె చప్పుళ్లను చంద్రబాబు ప్రభుత్వం వినిపించుకోలేదు. రాజధాని విషయంలో చంద్రబాబు చేసిన చారిత్రక తప్పిదాన్ని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం సరిదిద్దే ప్రయత్నం చేసింది. అమరావతిని శాసన రాజధానిగా కొనసాగిస్తూనే... న్యాయ రాజధానిగా కర్నూలును, కార్యనిర్వాహక రాజధానిగా విశాఖను ప్రకటించింది. ఈ పని 2014లోనే చేసి ఉన్నట్లయితే ఆంధ్రప్రదేశ్‌కు అన్నివిధాలా కలిసి వచ్చేది. సమయం, డబ్బు వృథా కాకుండా వుండేవి. ఇప్పటికే విశాఖ అభివృద్ధి చెందిన కాస్మొపాలిటన్‌ నగరం. సహజసిద్ధ రేవు పట్టణం. కలకత్తా, చెన్నైలను మించి అంతర్జాతీయ సముద్ర వర్తకాన్ని శాసించగల సత్తా వున్న నగరం.

దేశంలోని సహజ సంపదలో సగానికి పైగా నిక్షిప్తమై ఉన్న ఒడిషా, ఛత్తీస్‌గడ్, జార్ఖండ్‌లకు అందుబాటులో ఉన్న నగరం. రాజధాని హోదాను సమకూర్చి మౌలిక వసతులను జోడించినట్లయితే ఈ ఏడేళ్లలో ఇబ్బడిముబ్బడిగా రాష్ట్రానికి ఆదాయాన్ని సమకూర్చి ఉండేది. ఇప్పుడు కూడా మూడు రాజధానులను అడ్డుకుంటూ చంద్రబాబు తన చారిత్రక తప్పిదాన్ని కొనసాగిస్తున్నారు. రాష్ట్ర ఆదాయం పెరగకుండా అడ్డుపడుతున్నారు. రావణాసురుడు జటాయువు రెక్కల్ని తెగనరికినట్టు చంద్రబాబు రాష్ట్ర ఆదాయ వనరుల్ని ఖండిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌కే పరిమితమైన ఈ శాపాలతోపాటు ప్రపంచాన్నే శాపగ్రస్థం చేసిన కోవిడ్‌ మహమ్మారి వేటును కూడా కాచుకోవలసి వచ్చింది. రెండున్నరేళ్ల పాలనాకాలంలో రమారమి రెండేళ్లుగా కోవిడ్‌ ముప్పు తరుముతూనే వస్తున్నది. అన్ని రాష్ట్రాలు దేశాల ఆదాయాలు గణనీయంగా పడిపోయాయి. అప్పోసప్పో చేసి ఈ రెండేళ్లలో లక్షా పదహారువేల కోట్ల రూపాయలను పేద వర్గాలకు నగదు బదిలీ చేయకపోయి ఉన్నట్లయితే ఏమి జరిగేది? పేద వర్గాలు అనాధలయ్యేవారు. కొనుగోలు శక్తి నశించి ఉండేది. వ్యాపారాలు దివాళా తీసేవి. ఫలితంగా మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగస్థులు కూడా ఉపాధి కోల్పోయేవారు. ఆర్థిక చక్రం విరిగిపోయి ఉండేది.

ఈ ప్రభుత్వం అప్పుచేసి రాష్ట్రాన్ని పెను సంక్షోభం నుంచి కాపాడింది. ఫలితంగా ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు పూర్తిస్థాయి జవసత్వాలను కూడదీసుకుంటున్నది. ఇదీ జరిగింది. జరుగుతున్న ప్రచారం మాత్రం రాష్ట్రం దివాళా తీసిందని! ఈ దివాళాకోరు ప్రచారానికి చెంపపెట్టు ‘ఇండియా టుడే’ సర్వే. సమ్మిళిత అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్‌ వేస్తున్న అడుగులను ఈ సర్వే శాటిలైట్‌ కెమెరాలు గుర్తించాయి. అవును... చుట్టూ చీకటి ఆవరించి ఉన్నది. భయం లేదు. చేతిలో అభివృద్ధి దీపం ఉన్నది. ఎగుడు దిగుడు దారి ముందున్నది. పరవాలేదు. దీపకాంతిలో గమ్యం కనిపిస్తున్నది. జాగ్రత్తగా అడుగులు వేస్తే చాలు!


వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com

 

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top