ధర్మోరక్షతి రక్షితః

Vardhelli Murali Article On Constitutional Systems - Sakshi

జనతంత్రం

భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతున్నది. కోటానుకోట్ల యేళ్లు గడిచినా అది నిర్దేశిత కక్ష్యలోనే పరిభ్రమిస్తున్నది. కించిత్‌ గర్వమో, క్రోధమో, మోహమో ఆవహించి తన కక్ష్యను మార్చుకుంటే ఏమవుతుంది? రాశి చక్రం గతి తప్పుతుంది. దివారాత్రములు అంతర్ధానమవుతాయి. అండపిండ బ్రహ్మాండం అల్లకల్లోలమవుతుంది. మానవ పిపీలికం మటుమాయమవుతుంది. ఎన్ని యుగాలు గడిచినా, మరెన్ని మన్వంతరాలు కరిగిపోయినా అఖిలాండం మారలేదు. అంతరిక్షం మారలేదు. నక్షత్రాలు వాటి లక్ష్మణ రేఖల్ని దాటడం లేదు. గ్రహాలు వాటి ధర్మాన్ని మీరడం లేదు. భూలోకాన్ని ఆశ్ర యించిన ప్రకృతిశక్తులూ వాటి ధర్మాన్ని తప్పడం లేదు. నదులు పల్లానికే పారుతున్నాయి. గిరులు తరుల్ని మోస్తూనే ఉన్నాయి. ఎండావానా గాలీ వెన్నెల వాటి నియమం ప్రకారమే వచ్చి పోతున్నాయి. పులి శాకాహారం ముట్టలేదు. ఏనుగు మాంసా హారిగా మారితే రోజుకు ఎన్ని పీనుగులు కావాలో?

మానవుని సాంఘిక జీవితాన్ని కట్టుబాట్లలో ఉంచడానికి రకరకాల రాజ్యవ్యవస్థలు ఉనికిలోకి వచ్చాయి. వాటన్నింటిలోకి అత్యున్నతమైనది, మానవీయమైనది, తాత్విక భూమిక కలిగినది ప్రజాస్వామ్యవ్యవస్థ. ఇక్కడ ప్రజలే ప్రభువులు. ప్రజల నుంచే అధికారం ప్రభవిస్తుంది. అందులోనూ లిఖిత రాజ్యాంగం, చెక్స్‌ అండ్‌ బ్యాలెన్స్‌లతో కూడిన పార్లమెంటరీ వ్యవస్థ మరింత శ్రేష్టమైనదని మేధావుల నిశ్చితాభిప్రాయం. అటువంటి సర్వశ్రేష్టతమ రాజ్యాంగ వ్యవస్థను మనకు ప్రసాదించిన అంబేడ్కర్‌ తదాది జాతియోధులు మనకు ప్రాతఃస్మరణీయులు.

ప్రజలే రాజ్యాంగ నిర్మాతలని స్వయాన మన రాజ్యాంగమే ఘంటాపథంగా ప్రకటించింది. రాజ్యాంగ పీఠిక (preamble) మొట్టమొదటి వాక్యం ఈ దేశా ధికారం ఇక్కడ పుట్టిన ప్రతి పౌరుని చేతిలో ఉన్నదని సందేహాతీతంగా చాటి చెప్పింది. ‘భారత ప్రజలమైన మేము, మా దేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకుంటున్నామని’ మొదటి వాక్యం ప్రకటించింది. ఎందుకు ఈ రాజ్యాంగాన్ని భారత ప్రజలు రాసు కోవలసి వచ్చిందో కూడా తర్వాతి పంక్తుల్లో పీఠిక చెప్పింది. ‘ఈ దేశంలోని పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్నీ; ఆలోచనా, భావప్రకటన, విశ్వాసం, ఆరాధనల స్వాతంత్య్రాన్ని, అంతస్తులోనూ, అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చడం కోసం; వారందరిలో వ్యక్తిత్వ గౌరవాన్ని, జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి ఈ రాజ్యాంగాన్ని ఆమోదించుకుంటున్నామని పీఠిక ప్రకటించింది.

భారత రాజ్యాంగానికి ఈ పీఠిక ఆత్మ వంటిదని పలువురు న్యాయమూర్తులు, న్యాయశాస్త్ర కోవిదులు వివిధ సందర్భాల్లో ఉద్ఘాటించారు. చట్టసభలు చేసే శాసన నిర్మాణాలు కానీ, చేపట్టే రాజ్యాంగ సవరణలు కానీ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని (basic structure) దెబ్బ తీయకూడదని గతంలోనే సర్వోన్నత న్యాయస్థానం నిర్ద్వంద్వంగా ప్రకటించింది. భారత రాజ్యాంగ మౌలిక స్వరూపానికి దాని లక్ష్యాలకు నాలుగు వాక్యాల పీఠిక సూక్ష్మదర్శిని వంటిది. ఈ పీఠికలో పేర్కొన్నట్టు పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని చేకూర్చడానికి, ఆలోచనా భావప్రకటన విశ్వాసం ఆరాధనల స్వాతంత్య్రాన్ని సమకూర్చ డానికి, వారి వ్యక్తిత్వ గౌరవాన్ని (Dignity) ఇనుమడింప జేయ డానికి చేపట్టే ప్రతి చర్యా రాజ్యాంగ విహితమే. ఇందుకు విరు ద్ధంగా వ్యవహరించడం రాజ్యాంగ విద్రోహమవుతుంది. ఇటు చట్టసభలకూ, కార్యనిర్వాహక వర్గానికైనా, అటు న్యాయస్థానా లకైనా ఇదే సూత్రం వర్తిస్తుంది.

మన రాజ్యాంగం మూడు వ్యవస్థల మధ్య అధికారాలను పంపిణీ చేసింది. రాష్ట్రపతి, లోక్‌సభ, రాజ్యసభలతో (రాష్ట్రాల్లో గవర్నర్, అసెంబ్లీ, కౌన్సిల్‌) కూడిన శాసన వ్యవస్థ, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రిమండలి, పార్లమెంట్‌ (రాష్ట్రాల్లో గవ ర్నర్, ముఖ్యమంత్రి, మంత్రిమండలి, అసెంబ్లీ)తో కూడిన కార్యనిర్వాహక వ్యవస్థ, సుప్రీంకోర్టు, రాష్ట్రాల హైకోర్టులతో కూడిన న్యాయవ్యవస్థ కలిసి భారత రాజ్యాధికార వ్యవస్థ తయా రైంది. ఇందులో ఎవరి విధులూ, అధికారాలు వాళ్లకు న్నాయి. ఎవరి పరిధిలో వాళ్లు పనిచేస్తున్నంతవరకూ మన ప్రజా స్వామ్యం ఆదర్శవంతంగా ఉన్నట్టు లెక్క. పరిధులు మీరి ప్రవ ర్తిస్తే మనుగడ ఉండదని ప్రకృతి సూత్రాలు మనకు బోధిస్తు న్నాయి. ఈ మూడు వ్యవస్థల్లో దేని ప్రత్యేకత దానిదే. రాజ్యాంగం తనకు తానే చెప్పుకున్నట్టు అది జనేచ్ఛ (general will))లోంచి జనించింది. ఐదేళ్లకోమారు జరిగే జనేచ్ఛ వెల్లడి ద్వారా పార్లమెంట్, శాసనసభలు ఏర్పడుతున్నాయి.

కనుక రాజ్యాంగంతో చట్టసభలది రక్తసంబంధం. కార్యనిర్వాహక వర్గం చట్టసభల్లో భాగంగా ఉంటూ, వీటికి బాధ్యత వహిస్తూ అధికార చక్రాన్ని తిప్పుతుంది. కనుక రాజ్యాంగంతో దానిదీ రక్తసంబంధమే. న్యాయవ్యవస్థ మాత్రం జనేచ్ఛ ద్వారా ఏర్పడేది కాదు. కానీ, ప్రాథమిక జనేచ్ఛకు ప్రతిరూపమైన రాజ్యాం గానికి కాపలాదారుగా నిలబడినందు వలన దీనిది రక్షణ బంధం. జనేచ్ఛ అనే మాటను 18వ శతాబ్దంలో ఫ్రెంచ్‌ రాజనీతి తత్వవేత్త రూసో ప్రయోగించాడు. పౌరుల స్వాతంత్య్రానికి, రాజ్యాధికారానికి మధ్యన వైరుధ్యం ఏమీ లేదని రూసో వాదన. ఎందుకంటే జనేచ్ఛలోంచి ఏర్పడేవే చట్టాలు. ఆ చట్టాలను అమ లుచేయడం స్వాతంత్య్రానికి భంగమెట్లా అవుతుందనేది రూసో ప్రశ్న. ఈ పద్దెనిమిదో శతాబ్దపు వ్యవహారం మనకు అప్రస్తుతమే అయినప్పటికీ, ఇందులో మనకో ముక్తాయింపు దొరుకుతుంది. అదేమిటంటే, మనకున్న మూడు రాజ్యాంగ వ్యవస్థలు సూత్ర ప్రాయంగా సమానమే అయినప్పటికీ చట్టసభలకు బాధ్యత వహించే కార్యనిర్వాహక వర్గం కొంచెం ఎక్కువ సమానం.

కార్యనిర్వాహక వర్గానికి ఉన్న విస్తృతాధికారాల దృష్ట్యా భవిష్యత్తులో నిరంకుశంగా వ్యవహరించే అవకాశాలు ఉంటాయి కనుక, అలా జరగకుండా ఉండేందుకని న్యాయ వ్యవస్థకు కొన్ని అధికారాలను రాజ్యాంగం కట్టబెట్టింది. రాజ్యాంగం నిబంధనలకు భిన్నంగా చేసే చట్టాలను కొట్టివేసే అధికారం, రాజ్యాంగానికి భాష్యం చెప్పే విశేషాధికారం న్యాయ వ్యవస్థకు ఉన్నాయి. ఈ అధికారాలను ఉపయోగించుకొని ఎన్నో ప్రజోపయోగకర తీర్పులను ఇచ్చిన ఘనత ఈ దేశ న్యాయ వ్యవస్థకు ఉన్నది. నల్లచట్టాల నుంచి ప్రజలను రక్షించడంలో, పౌరహక్కులను నిలబెట్టడంలో న్యాయవ్యవస్థ ఎన్నదగిన పాత్రను పోషించింది. ఎమర్జెన్సీ కాలం నుంచి రెండున్నర మూడు దశాబ్దాల పాటు ప్రజానుకూల ప్రగతిశీల దృక్పథంతో న్యాయవ్యవస్థ క్రియాశీల (Judicial activism) పాత్రను పోషించింది. ఇప్పుడు కూడా న్యాయవ్యవస్థలో క్రియాశీలత కని పిస్తూనే ఉన్నది. కాకపోతే, అందులో ప్రజానుకూలత, ప్రగతి శీలత ఏమేరకు ఉన్నాయనేదానిపై భిన్నాభిప్రాయాలు వెలువ డుతున్నాయి.

జేఏజీ గ్రిఫిత్‌ అనే బ్రిటీష్‌ న్యాయశాస్త్ర కోవి దుడు 1977లో ‘పాలిటిక్స్‌ ఆఫ్‌ జ్యుడీషియరీ’ అనే పుస్తకాన్ని ప్రచురించారు. ఇది ప్రపంచవ్యాప్తంగా న్యాయశాస్త్ర వర్గాల్లో సంచలనాన్ని రేకెత్తించింది. బ్రిటన్‌లో న్యాయవ్యవస్థ తటస్థత అనేది ఒక బ్రహ్మపదార్థమనీ, కేవలం భ్రమ మాత్రమేనని ఆయన ఆ పుస్తకంలో నిరూపించారు. అదే కాలంలో ఇండి యాలో న్యాయవ్యవస్థను క్రియాశీలం చేసిన ఆద్యుల్లో ఒకరైన జస్టిస్‌ కృష్ణయ్యర్‌ ఇదేరకమైన అభిప్రాయం కలిగి ఉండేవారు. మనదేశ న్యాయవ్యవస్థలో అత్యధికులు ధనికవర్గ పక్షపాతులని ఆయన ఆక్షేపించారు. రాజకీయ అభిప్రాయాలను కలిగి వుండటం తప్పుకాదు కానీ, వాటిని దాచిపెట్టి తాము తట స్థులమని చెప్పుకోవడమే పెద్ద తప్పని ఆయన అభిప్రాయపడే వారు. ఇదంతా ఈ దేశంలో సిద్ధాంతాల ప్రాతిపదికపై రాజకీ యాలు నడిపిన కాలం సంగతి. ఇప్పుడు రాజకీయాల్లో వ్యక్తుల ప్రాధాన్యత పెరిగింది. ఇప్పుడు కూడా అన్ని వ్యవస్థల్లో ఉన్నట్టే న్యాయవ్యవస్థలో కూడా రాజకీయాభిప్రాయాలు ఉండవచ్చు. అయితే వ్యవస్థ క్షీరనీర న్యాయాన్ని పాటించినంతవరకూ ప్రమాదం లేదు.

వర్తమాన న్యాయవ్యవస్థ క్రియాశీలత (Judicial activism) గతంకంటే భిన్నమైనది. కార్యనిర్వాహక వ్యవస్థ పౌరహక్కుల మీద, ప్రజల స్వేచ్ఛా స్వాతంత్య్రాల మీద దాడి చేయకుండా నిరోధించడం నాటి క్రియాశీలత లక్ష్యం. అదొక రక్షణాత్మక వైఖరి. ప్రస్తుత క్రియాశీలత కార్యనిర్వాహక వర్గం అధికార పరిధిల్లోకి ప్రవేశిస్తున్నదని పలువురు మేధావులు ఆక్షేపిస్తున్నారు. విధానపరమైన నిర్ణయాలను కూడా తామే తీసు కుంటామని ఇటీవల న్యాయవ్యవస్థ పలుమార్లు ప్రకటించడం జరిగింది. కార్యనిర్వాహకవర్గం పాత్రను కూడా న్యాయవ్యవస్థ పోషించడం మొదలుపెడితే ప్రజాభిప్రాయానికి ఇక విలువే ముంటుందో, ప్రజాస్వామ్యం ఎలా మనుగడ సాగిస్తుందో చర్చ జరగవలసిన అవసరం ఉన్నది. న్యాయంగా ఉండటం మాత్రమే కాదు న్యాయంగా ఉన్నట్టు కనిపించాలి కూడా అంటారు. వ్యవస్థల పట్ల ప్రజలు నమ్మకం కోల్పోగూడదనే అర్థంలో అలా అంటారు. ఒకే రకమైన కేసులో రెండు భిన్నమైన తీర్పులు చూడండి. టెన్త్, ఇంటర్‌ పరీక్షలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భావించింది. పరీక్షల ద్వారా వారి మెరిట్‌ను నిర్ధా రించి చూపకపోతే భవిష్యత్‌లో ప్రతిష్టాత్మక సంస్థల్లో విద్యార్థు లకు సీట్లు లభించవన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ వైఖరి తీసుకున్నది. కేరళ ప్రభుత్వం కూడా ఇదే విధానాన్ని అవలంబిం చింది. రెండు రాష్ట్రాల మీద సుప్రీంకోర్టులోనే పిటీషన్లు పడ్డాయి. ఏపీ కేసు విచారణ సందర్భంగా ధర్మాసనం పరుష వ్యాఖ్యలు చేసింది. పిల్లలెవరైనా కోవిడ్‌ వల్ల చనిపోతే ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా? అని ప్రశ్నించింది. కేరళ కేసులో అదే బెంచ్‌ రాష్ట్ర ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో మేం జోక్యం చేసుకోలే మని అంతక్రితం చెప్పింది. విషయం ఒక్కటే. భిన్నమైన వ్యాఖ్యానాలు. ఇందులో సామాన్యులకు అర్థం కాని ధర్మ సూక్ష్మాలు, సాంకేతిక అంశాలు ఏమైనా ఉంటే ఉండవచ్చు. కానీ జనంలోకి ఏ సందేశం వెళ్లిందో గమనించాలి.

ఆంధ్రప్రదేశ్‌ వ్యవహారాలనే తీసుకుందాము. ఎంపీటీసీ, జడ్పీటీసీలకు గత యేడాది మార్చిలోనే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. మరో వారం పదిరోజులు గడిస్తే ఎన్నికలు పూర్తయ్యేవి. అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ వాయిదా వేశారు. ఆయన ఎందుకలా చేశారనేది మరో పిట్టకథ. ఎన్నికల వ్యవ హారం అనేక న్యాయ మలుపులు తిరిగి ఎట్టకేలకు మొన్న ఏప్రి ల్‌లో జరిగాయి. ఫలితాలు ప్రకటించవలసి ఉన్నది. మళ్లీ కథ కోర్టుకెక్కింది. జరిగిన ఎన్నికలను రద్దుచేస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. పనిలో పనిగా ఈ తీర్పుతోపాటు కొత్త ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్నీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని వార్తలు వచ్చాయి. వాటిపై ధర్మాసనం ముందు దాఖలుచేసిన అప్పీల్‌లో ఆమె అభ్యంతరాలు కూడా వ్యక్తం చేశారు.  

పౌరులకు దక్కవలసిన రాజకీయన్యాయం ఏడాదిన్నర కాలంగా త్రిశంకు స్వర్గంలో వేలాడుతున్నది. దేశ చరిత్రలో ఎన్నడూ కనీవినీ ఎరుగని విధంగా బలహీనవర్గాల ప్రజలకు 30 లక్షల ఇళ్లను కట్టించి ఇవ్వాలని ఆ ప్రభుత్వం సంకల్పం చెప్పుకున్నది. రాజ కీయ ప్రత్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఏడాది పైగా ఒక గొప్ప కార్యక్రమాన్ని అడ్డుకోగలిగారు. ఇప్పటికీ 3 లక్షల ఇళ్ల నిర్మాణం ఆగిపోయే వుంది. మహిళా సాధికారతను మరో అంతస్తుపైకి చేర్చే మహత్తర కార్యక్రమం ఇది. రాజ్యాంగ పీఠిక అభిలషించినట్టు వ్యక్తిగత గౌరవాన్ని (dignity ఇనుమడిం పజేసే కార్యక్రమం ఇది. రాష్ట్ర ప్రభుత్వం మీద వ్యక్తిగత కక్షతో రగిలిపోతున్న రఘురామరాజు అనే ఆర్థిక నేరస్తుడు కేసు వేస్తే ప్రజోపయోగకరమైన అమూల్‌ కార్యక్రమం ఆగిపోవలసిన అవ సరం ఉన్నదా?. సదరు రఘురామరాజుకు సరస్వతి పవర్‌పై పిటిషన్‌ వేయడానికి ఉన్న అర్హతలేమిటి?. గ్రామ సచివాలయాలను ఏర్పాటుచేసి ప్రభుత్వ పాలనను జనానికి చేరువ చేయడం నేరమా?. ఎన్నికైన ప్రజా ప్రభుత్వానికి ఆ హక్కు లేదా?. ఇక ప్రస్తుత ముఖ్యమంత్రిపై గత ప్రభుత్వం వివిధ పోలీస్‌ స్టేషన్లలో రాజకీయ కేసులు పెట్టింది. ఫిర్యాదుదారులు ఉపసంహరించుకోవడంతో మేజిస్ట్రేట్లు కేసులను మూసివేస్తూ ఉత్తర్వులిచ్చారు. ఇటువంటి కేసులు దేశంలోని రాజకీయ నాయ కులందరిపైనా దాఖలవుతాయి. తర్వాత వాటిని ఉపసంహరిం చుకోడమూ రివాజే. గత ప్రభుత్వ పెద్దలు అనేకమందిపై ఇటు వంటి కేసులు నమోదయ్యాయి. వాటి ఉపసంహరణ కూడా జరిగింది. కానీ ప్రస్తుత సీఎంపై ఉపసంహరించిన కేసులన్నిం టినీ క్రోడీకరించి విచారణ జరుపుతామని హైకోర్టు సుమోటో ప్రకటన దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఇవి కొన్ని ఉదా హరణలు మాత్రమే. ఎన్నికైన ప్రజా ప్రభుత్వం సాఫీగా పని చేయకుండా రాజకీయ ప్రత్యర్థులు న్యాయవ్యవస్థ భుజాలపై తుపాకీని మోపి కాల్పులు జరపడం ఎంతవరకు న్యాయం?. అదనులో వానలు కురవాలనీ, శీతాకాలం కోత పెడుతున్న ప్పుడు ఎండలు కాయాలనీ కోరుకుంటాము. ప్రకృతి మనల్ని ఎన్నడూ నిరాశపరచలేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలు కూడా వాటి ధర్మాన్ని అవి నిర్వర్తించాలని కోరుకోవడం తప్పు కాదు. ధర్మాన్ని మనం కాపాడితేనే కదా... ధర్మం మనల్ని కాపాడేది.


వర్ధెల్లి మురళి 
vardhelli1959@gmail.com

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top