తగ్గుతున్న డాలరు ఆధిపత్యం

US Dollar Value Domination Decreasing Guest Column Buddiga Zamindar - Sakshi

అభిప్రాయం

రష్యా ఆర్థిక వ్యవస్థను పతనం చేయాలనే వాంఛ అమెరికా మిత్ర దేశాలకు ఎప్పటి నుండో ఉండగా ఉక్రెయిన్‌ యుద్ధం కలిసొచ్చింది. విదేశీ బ్యాంకుల్లో 80,000 కోట్ల డాలర్లకు పైగా ఉన్న రష్యా నగదు నిల్వలపై ఆంక్షలు విధించి జప్తు చేయనారంభించి, ‘స్విఫ్ట్‌’ వ్యవస్థ నుండి రష్యాను బహిష్కరించటంతో కంపెనీల జమాఖర్చుల లావాదేవీలు నిలిచిపోతున్నాయి.  

రూబుల్‌ విలువ పడిపోతున్న సమ యంలో, పుతిన్‌ ఎత్తుగడతో, మార్చి 24న రష్యా రూబుల్‌ తోనే తమ చమురు, గ్యాస్‌కు చెల్లించాలని ప్రపంచ దేశాలకు అల్టిమేటం జారీ చేశాడు. దీంతో ముఖ్యంగా యూరప్‌ దేశా లైన జర్మనీ, ఫ్రాన్స్‌ ఇరకాటంలో పడ్డాయి. అమెరికా ఏకంగా తాను తీసుకొన్న గోతిలో తానే పడిపోయినంత వ్యథ చెందు తున్నది. ప్రపంచంలో 12 శాతం ముడి చమురును ఉత్పత్తి చేస్తూ యూరపు దేశాలకు అవసరమగు 40 శాతం పైగా ఇంధనాన్ని రష్యా ఎగుమతి చేస్తుంది. 

ఫ్రాన్స్‌ మాక్రోన్, జర్మన్‌ షోల్జ్‌లు రూబుల్‌ కరెన్సీ మారకాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఒప్పందాల ప్రకారం యూరోలో లేదా డాలరులో చెల్లిస్తామంటున్నారు. చెల్లిం పుల మొత్తం ఎలానూ స్విఫ్ట్‌ ద్వారా రష్యా ఖాతాల్లోకి జమ కాదు, అలా జరిగినా బ్యాంకుల్లోని నిల్వలను స్తంభింప జేస్తారు. పుతిన్‌ అధికార ప్రతినిధి డిమిట్రీ ప్రెస్‌కోవ్‌ మాత్రం రూబుల్‌ చెల్లింపులతోనే గ్యాసు, ఆయిల్‌ పంపిస్తామనీ, చారిటబుల్‌ సంస్థను నడపటం లేదనీ నిర్మొహమాటంగా స్పందించాడు. యుద్ధం ముందు ఒక డాలరుకు 75 రూబుళ్లు ఉన్న మారకపు విలువ, ఆంక్షలతో 145కు చేరి, ప్రస్తుతానికి 95 రూబుళ్లతో స్థిరత్వం దిశగా పయనిస్తోంది.

మరోవైపు సౌదీ అరేబియా, చైనాల మధ్య ముడి చమురు వాణిజ్యం  యువాన్‌లతో జరపటానికి సౌదీ అంగీ కరించింది. చైనా ఇంధన అవసరాలను 25 శాతం వరకూ సౌదీ అరేబియా తీరుస్తుంది. యువాన్‌లో సౌదీ లావాదేవీలు జరిపితే చైనా ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావటం, డాలరు ప్రాధాన్యత తగ్గటం ఒకేసారి జరుగుతుంది. ఇప్పటికే రష్యా, చైనా యువాన్‌ వాణిజ్యానికి ముందుకొచ్చాయి. సౌదీ ప్రిన్స్‌ మొహమ్మద్‌ బిన్‌ సల్మాన్, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ షేక్‌ మొహమ్మద్‌ నహ్వాన్‌ ఇద్దరూ వైట్‌హౌస్‌ నుండి వచ్చిన ఫోన్‌కాల్స్‌కు స్పందించలేదంటే మధ్య ప్రాచ్యంలో డాల రుతో పాటుగా అమెరికా ఎంత తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కో నుందో అర్థమవుతుంది.

డాలరు ఆధిపత్య వ్యతిరేక పోరులో నేను సైతం అంటూ భారత్‌ ముందుకు వస్తోంది. రష్యాతో లోగడ కుది రిన ఒప్పందం ప్రకారం తక్కువ ధరకు ముడి చమురును భారత్‌ దిగుమతి చేసుకొంటున్నది. రష్యా భారత్‌ మధ్య ఇకపై రూబుల్‌–రూపాయి వాణిజ్యం జరగనుందని వార్తలొస్తున్నాయి. వీరికి తోడు ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికాలోని అనేక దేశాలు ఈ బాటనే అనుకరించటానికి సిద్ధంగా ఉన్నాయి. 

1944లో న్యూహాంషైర్‌ బ్రెట్టన్‌ ఉడ్స్‌లో 44 సభ్యదేశాలు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థను, ప్రపంచ బ్యాంకులను స్థాపించి బంగారు నిల్వల ఆధారంగా అమెరికా డాలరును అంతర్జాతీయ కరెన్సీగా ప్రకటించాయి. 1971లో బంగారు నిల్వలు అమెరికా దగ్గర లేకపోవటంతో అమెరికాకు ముడి చమురును ఎగుమతి చేయబోమని అరబ్‌ దేశాలు ప్రక టించాయి. అమెరికా ఆర్థికవ్యవస్థ కుప్పకూలింది. మరలా నిక్సన్‌ షాక్‌ పేరిట ఫ్లోటింగ్‌ డాలరు రూపాంతరం చెంది, ఇప్పటివరకూ వాల్‌స్ట్రీట్‌లోని తన అనుకూల ఫారిన్‌ ఎక్స్‌ఛేంజ్‌ విభాగంతో ప్రపంచ కరెన్సీలతో తనకు అను కూలంగా కరెన్సీ మార్పిడులను చేస్తోంది.

కృత్రిమ డాలరు మార్పిడీకి వ్యతిరేకంగా ఫ్రాన్స్, జర్మనీ 1970 ప్రాంతంలోనే బ్రెట్టెన్‌ ఉడ్‌ సిస్టమ్‌ నుండి తప్పుకొని బలపడ్డాయి. డాలరు మార్పిడీలతో అనేక దేశాలు బలవు తున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలోని దేశాలన్నిటితో (మెక్సికోతో తప్ప) అమెరికా వాణిజ్య లోటుతో,  సుమారు 25 లక్షల కోట్ల డాలర్ల రుణంతో ఉన్నా, తన చేతిలోని వాల్‌స్ట్రీట్‌ ఊహాజనిత ద్రవ్య పెట్టుబడులతో, ఫోరెక్స్‌ మారకాన్ని కృత్రిమంగా నడుపుతూ, ఆయుధ అమ్మకాలతో, కృత్రిమ మేధో సంపత్తితో జూదమాడుతోంది. డాలరుకు ప్రత్యమ్నాయంగా వాణిజ్యం చేయగలిగిననాడు, ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను అస్తవ్యస్తం చేస్తున్న డాలరు ఆధిపత్యం పతనంగాక తప్పదని ఆర్థిక నిపుణులు అంటున్నారు.

బుడ్డిగ జమిందార్‌
వ్యాసకర్త అసోసియేట్‌ ప్రొఫెసర్,
కె.ఎల్‌. యూనివర్సిటీ ‘ 98494 91969

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top