యావజ్జీవ శిక్ష అంటే జీవిత శేషభాగం

Tadakamalla muralidhar Gujarat Riots Bilkis Bano Case Life Sentence  - Sakshi

అభిప్రాయం

గుజరాత్‌లోని గోద్రా పేరు వినగానే మనకు స్ఫురణకు వచ్చేది సబర్మతి రైలు దుర్ఘటన, రెండోది రాష్ట్రమంతటా చెలరేగిన హింస. తద్వారా బిల్కిస్‌ బానో అనే మహిళపై సామూహిక మానభంగం, హత్యలు! ఈ ఘటనల పూర్వా పరాలను అవలోకిద్దాం. 

విశ్వహిందూ పరిషత్‌ పిలుపు మేరకు వేలాదిమంది రామ సేవకులు, కరసేవకులు ‘పూర్ణాహుతి’ అనే మహా యజ్ఞంలో పాల్గొని అయోధ్య నుండి గుజరాత్‌ రాష్ట్రానికి 2002 ఫిబ్రవరి 26న సబర్మతి రైలులో తిరిగి వస్తుండగా గోద్రా రైల్వేస్టేషన్‌ దగ్గర కొందరు దుండగులు రైలుకు నిప్పు అంటించటంతో దాదాపు 60 మంది రామ భక్తులు మంటలకు ఆహుతయ్యారు. దానితో గుజరాత్‌ రాష్ట్రం మత కల్లోలాలతో అట్టుడికి దాదాపు 2,000 మంది హిందూ ముస్లింలు అసువులు బాశారు. 2002 మార్చి 3 నాడు ఐదు నెలల గర్భవతియైన 19 ఏళ్ల మహిళ బిల్కిస్‌ బానోపై మూకుమ్మడి అత్యాచారం, ఆమె కుటుంబానికి చెందిన మరి కొంత మంది మహిళలపై అత్యాచారం, మూడున్నర సంవత్సరాల కూతురు హత్య జరిగింది. ఆ సంఘటనలో మొత్తంగా 7 మంది హతులయ్యారు. 

బిల్కిస్‌ బానో ఇచ్చిన ఫిర్యాదును సంబంధిత పోలీసు అధికారి సక్రమంగా నమోదు చేయలేదు. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు కేసు పరిశోధన సీబీఐకి అప్పచెప్పబడింది. అప్పటికి గుజరాత్‌ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం సరియైన న్యాయం చేసే అవకాశం లేదని బాధితుల కోరిక మేరకు అత్యున్నత న్యాయస్థానం కేసును మహారాష్ట్రకు బదిలీ చేసింది. ముంబై లోని ప్రత్యేక సెషన్స్‌ న్యాయస్థానం ముందు 19 మందిపై నేరారోపణ పత్రం సీబీఐ దాఖలు చేసింది. అందులో ఆరుగురు పోలీసు అధికారులూ, ఒక డాక్టర్‌ కూడ ఉన్నారు. సాక్షుల విచారణ పిదప 11 మంది ముద్దాయిలపై సామూహిక మానభంగం, కుట్ర, హత్య వంటి నేరాలకు గాను జీవిత ఖైదు విధిస్తూ జనవరి 2008లో తీర్పు చెప్పింది. ఏడుగురు ముద్దాయిలపై కేసు కొట్టివేయగా ఒకరు విచారణ మధ్యలో చనిపోయారు. శిక్ష విధింపబడ్డ ముద్దాయిలు బొంబాయి ఉన్నత న్యాయ స్థానానికి అప్పీలు చేసుకోగా... 2017 మేలో అప్పీలును కొట్టివేస్తూ కింది కోర్టు తీర్పును ధ్రువీకరించింది. బిల్కిస్‌ బానోకి 50 లక్షల రూపాయల నష్ట పరిహారం, ఉద్యోగం, ఇల్లు సుప్రీం ఆదేశాల కనుగుణంగా ఇవ్వాల్సి ఉండగా ఉద్యోగం, ఇల్లు ఇప్పటిదాకా ప్రభుత్వం ఇచ్చిన దాఖలా లేదు.

ఇదిలా ఉండగా యావజ్జీవ శిక్షను అనుభవిస్తున్న 11 మందిలో ఒకరైన రాధే శ్యామ్‌ భగవాన్‌ దాస్‌ షా అనే దోషి... జీవితఖైదు నుండి విముక్తి కలిగిస్తూ ముందస్తు విడుదల ఉత్తర్వులు జారీ చేసే విధంగా గుజరాత్‌ ప్రభు త్వాన్ని ఆదేశించాలని కోరుతూ 2022 మార్చిలో సుప్రీం కోర్టును ఆశ్రయిం చాడు. అప్పటికే తాము 14 సంవత్సరాల పైచిలుకు శిక్షను అనుభవించినట్లు, కావున 1992 రాష్ట్ర ప్రభుత్వ పాలసీ ప్రకారం జీవిత ఖైదును రద్దు చేస్తూ ముందస్తు విడుదలకు ఆదేశాలు ఇవ్వాలని కోరటం జరి గింది. దోషి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకొని సరియైన ఉత్తర్వులు జారీ చేయమని గుజరాత్‌ ప్రభుత్వానికి సుప్రీం ధర్మాసనం 2022 మే 13న ఆదేశాలిచ్చింది. జిల్లా మేజిస్ట్రేట్‌ ఆధ్వ ర్యంలోని 8 మందితో కూడిన జైలు అడ్వైజరీ కమిటీ 11 మంది దోషుల ముందస్తు విడుదలకు సిఫారసు చేసింది. 2022 ఆగస్టు పదిహేను నాడు 11 మంది దోషులనూ రాష్ట్ర ప్రభుత్వం 1992 పాలసీని అనుసరించి ముందస్తు విడుదల చేసింది.

సుప్రీం ఆదేశాల మేరకు శిక్ష విధింపబడ్డ నాటికి అమల్లో ఉన్న 1992 జులై నాటి రాష్ట్ర ప్రభుత్వ ఉపశమన విధాన పద్ధతి ఉత్తర్వుల ప్రామాణికతగా దోషులను విడుదల చేసి నట్లు న్యాయవర్గాలు పేర్కొంటున్నాయి. 2014లో గుజరాత్‌ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పాలసీ విధానం ప్రకారం జీవిత ఖైదీలూ, అత్యాచార దోషులూ, సీబీఐ విచారించిన కేసుల్లో ముందస్తు విడుదలకు అనర్హులు. 1992 పాలసీ ప్రకారం 14 సంవత్సరాల జైలు జీవితం గడిపిన జీవిత ఖైదీలను నిబంధనలకు లోబడి ముందస్తు విడుదల చేయవచ్చు. ముందస్తు విడుదలను సవాలు చేస్తూ బాధితుల పరంగా ఇది అన్యాయమంటూ బిల్కిస్‌ బానో సుప్రీంకోర్టును ఆశ్ర యించింది.  దీనిపై తీర్పు రావలసి ఉంది. రైలుకు నిప్పు అంటించిన కేసులో 31 మంది ముస్లింలకు కోర్టు శిక్ష విధించింది.

మామూలుగా యావజ్జీవ ఖైదు అంటే తుది శ్వాస దాకా ఖైదు అని అర్థం. ‘శంబా జీ కృష్ణన్‌ జీ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ మహారాష్ట్ర’ కేసులో 1974 లో సుప్రీం కోర్టు ఇదే తీర్పిచ్చింది. అయితే రాష్ట్రపతి, గవర్నర్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు శిక్షాకాలాన్ని నిబంధనలకు లోబడి తగ్గించే అధికారముంది. భారత రాజ్యాంగంలోని 161వ అధికరణ రాష్ట్ర ప్రభుత్వ సిఫారసుతో రాష్ట్ర గవర్నర్‌కు కనీస శిక్షాకాలం, రాష్ట్ర ప్రభుత్వ పాలసీతో ప్రమేయం లేకుండా శిక్షాకాలాన్ని తగ్గించే అధికారం ఇచ్చింది. నేర విచారణ స్మృతి లోని 432, 433, 433అ సెక్షన్ల ప్రకారం... యావజ్జీవ ఖైదును ఎదుర్కొనే వారు కనీసంగా 14 సంవత్సరాల జైలు జీవితాన్ని గడిపిన వారిని మాత్రమే గవర్నరు ప్రమేయం లేకుండా ముందస్తు విడుదల చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. శిక్ష విధింపబడ్డ తేదీ నాడు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ  పాలసీ అమలులో ఉంటుందో ముందస్తు విడుదలకు దానినే ప్రామాణికంగా తీసుకోవాలని చట్టం చెబుతోంది. ఇవే విషయాలను  ‘స్టేట్‌ ఆఫ్‌ రాజస్థాన్‌ వర్సెస్‌ రాజ్‌ కుమార్‌ ఎట్‌ బిట్టు’ కేసులో సుప్రీం ధర్మాసనం 2021 ఆగస్టు మూడు నాడు పేర్కొంది.

కొంత కాలం క్రితం రాజీవ్‌ గాంధీ హత్య కేసులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న దోషులను కూడా నిబంధన లను అనుసరించి మూడు దశాబ్దాల తర్వాత ముందస్తు విడుదల చేయటం జరిగింది. కొందరు ఊహించుకున్నట్లు యావజ్జీవ శిక్ష అంటే 14 లేదా 20 సంవత్సరాల ఖైదు మాత్రం కాదు.


తడకమళ్ళ మురళీధర్‌
వ్యాసకర్త విశ్రాంత జిల్లా జడ్జి ‘ 98485 45970
 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top