సార్వత్రిక ఎన్నికలకు కొలమానం

Neerja Chowdhury Article On Five State Assembly Election 2022 - Sakshi

చిన్న పార్టీలను చేర్చుకోవడంలో బీజేపీ విఫలమై ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం జరిగినట్లయితే, దాని తక్షణం ప్రభావం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పైనే పడుతుంది. జాతీయ స్థాయికి ఎదగాలనే ఆయన ఆంక్షలకు గండి పడవచ్చు. 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం ప్రధాని నరేంద్రమోదీ ప్లాన్‌లో భాగంగా, కిందిస్థాయి ఓబీసీలకు ప్రాతినిధ్యం వహించేటటువంటి, మరింత యోగ్యత కలిగిన మరొక నేత యోగి స్థానాన్ని భర్తీ చేయవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే యూపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు యోగి ఆదిత్యనాథ్‌ భవిష్యత్తునే కాదు... జాతీయ రాజకీయాలను కూడా తీవ్రంగా ప్రభావితం చేయనున్నాయి.

ఉత్తరప్రదేశ్‌లో నడుస్తున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ అనేక కారణాల వల్ల బీజేపీపై తీవ్ర ప్రభావం చూపవచ్చు. ఎన్నికలు జరుగుతున్న అయిదు రాష్ట్రాల్లో నాలుగింటిలో అధికారంలో ఉన్న బీజేపీ గత అయిదేళ్లలో తన పనితీరును సమర్ధించుకుని ప్రజావ్యతిరేకతను తట్టుకుని నిలబడాల్సి ఉంటుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీకి అత్యంత కీలకంగా మారనున్న 2024 సార్వత్రిక ఎన్నికల కోసం ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు దిశానిర్దేశం చేయనున్నాయి.

2017లో యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 403 స్థానాల్లో 302 సీట్లను బీజేపీ గెల్చుకోవడంతో ఆ తర్వాత జరిగిన 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆ పార్టీకి బలమైన పునాది ఏర్పడింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో కూడా యూపీలో 71 లోక్‌సభా స్థానాలను బీజేపీ గెల్చుకోకపోయి ఉన్నట్లయితే కేంద్రంలో సంకీర్ణప్రభుత్వం తప్పేది కాదు. దానితో మోదీ రాజకీయ ప్రాభవం మరోరకంగా ఉండేది. కాబట్టి, యూపీ అసెంబ్లీ ఎన్నికలు అంటే కేవలం ఆ రాష్ట్రానికి సంబం ధించిన వ్యవహారం కాదు. అవి జాతీయ రాజకీయాలకు దిక్సూచి లాంటివి.

యూపీ ఎన్నికల ఫలితాలు వెల్లడయిన వెంటేనే రాష్ట్రపతి పదవికి ఎన్నికలు వస్తాయి. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పదవీకాలం ముగుస్తోంది. ఈ నేపథ్యంలో యూపీ ఎన్నికల్లో అధికారం పోగొట్టుకోవడం లేదా కనాకష్టంగా గెలుపొందడం అనేవి, బీజేపీకి చెందిన వ్యక్తిని మళ్లీ అదే పదవిలో కూర్చోబెట్టడం విషయంలో ఇబ్బందులు తీసుకొస్తాయి. కాబట్టి ఈ ఎన్నికల్లో గెలుపు బీజేపీకి చాలా ముఖ్యం.

2012లో గుజరాత్‌ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు మోదీని రైజీనా హిల్స్‌ మార్గం పట్టించినట్లే, 2022 యూపీ అసెంబ్లీ ఎన్నికలు భావి ప్రధాని భవిష్యత్తును నిర్ణయించనున్నాయని ఉత్తరప్రదేశ్‌ గ్రామీణ ప్రాంతంలో ఇప్పటికే  గుసగుసలు మొదలయ్యాయి. తదుపరి దశలో హిందూ రాజ్యం వైపుగా ప్రయాణం సాగించడానికి, హిందూ ప్రతినిధిగా ఉండే కాషాయాంబరధారి యోగి ఆదిత్యనాథ్‌ సమర్ధుడని ఆరెస్సెస్‌ కుటుంబంలోని కొన్ని వర్గాలు ఇప్పటికే భావిస్తున్నాయి. ఒక వర్గం ప్రజలు ఇప్పటికే యోగిని ఆరాధిస్తున్నారు. ఇది మోదీ ఆస్వాదిస్తున్న ఆరాధనకు పూర్తిగా భిన్నమైనది.

ముస్లింలను నిర్మూలించాలని పిలుపునిస్తూ హరిద్వార్‌లో యతి నర్సింగానంద్‌ చేసిన విద్వేషపూరిత ప్రసంగం కానీ, భవిష్యత్తులో కాషాయ జెండా మన జాతీయ జెండా కావచ్చంటూ కర్ణాటకలో బీజేపీ మంత్రి కెఎస్‌ ఈశ్వరప్ప చేసిన ప్రకటన కానీ ట్రయల్‌ బెలూన్లు మాత్రమే. చీకట్లో రాళ్లు వేయడానికి వీటిని డిజైన్‌ చేశారు. జనం వీటిని ఎలా తీసుకుంటారో చూడటానికి ఇలా ముందస్తుగా కొన్ని మాటలు వదులుతుంటారు. 

కరుడుగట్టిన హిందుత్వకు యోగి అధికార ప్రచారకర్త. ఎన్నికల సమయంలో వేర్వేరు రాష్ట్రాల్లో పార్టీ ఆయన్ని ప్రచారం కోసం ఉపయోగించింది. ఈ క్రమంలో ఆయనకు అఖిల భారత స్థాయి లభించేలా చేయడమే దీని లక్ష్యం. ఉత్తరప్రదేశ్‌లో శాంతి భద్రతలను మెరుగుపర్చడం వంటి తాను సాధించిన విజయాల గురించి మాట్లాడుతున్నప్పుడు, యూపీలో హిందూ, ముస్లిం ఓటర్లను వేరు చేయడం గురించి ఏకరువు పెడుతూ హిందువులు తన వెనకాలే నిలిచేలా చూసుకుంటారు. గోరఖ్‌పూర్‌ నుంచి అయిదుసార్లు ఎంపీగా గెలిచిన యోగి తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

వారణాసి, మథుర, ప్రయాగ్‌రాజ్, చిత్రకూట్‌ హిందూ మత క్షేత్రాలను యోగి పునరుద్ధరించారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం చేస్తున్న ఘనత తన ఖాతాలోనే చేర్చుకున్నారు. రాబోయే ఎన్నికలు 80 శాతానికి 20 శాతానికి మధ్య పోరాటంగా ఉంటాయని యోగి జనవరిలో పేర్కొన్నారు. అంటే హిందూ మెజారిటీకి ముస్లిం మైనారిటీకి మధ్య యుద్ధం అని నొక్కి చెప్పారన్నమాట. తర్వాత తన ఉద్దేశం అది కాదని చెప్పారనుకోండి. హిందూస్తాన్‌ కోసం యుద్ధం గురించి కలగంటున్న వారు ఎన్నడూ విజయం సాధించలేరని, ఎందుకంటే దేశాన్ని నడుపుతోంది రాజ్యాంగమే కానీ షరియత్‌ కాదని యోగి స్పష్టం చేశారు. తర్వాత యూపీ వాలాలు బీజేపీకే ఓటు వేస్తారని, యూపీని కశ్మీర్‌లాగా, బెంగాల్‌లాగా, కేరళలాగా మార్చే తప్పిదం వారు చేయరని యోగి నొక్కిచెప్పారు. ఈ రాష్ట్రాలు ముస్లింలను బుజ్జగిస్తున్నాయని బీజేపీ ఆరోపణ. అందుకే యోగి ఈ అంశాన్ని వీలైన ప్రతిచోటా ప్రస్తావిస్తుంటారు. 

అయితే ఈ సారి ఎన్నికల క్షేత్రంలో ఇది నిజానికి పనిచేస్తుందా అనేది చూడాలి. మరోవైపున అఖిలేశ్‌ యాదవ్, జయంత్‌ చౌదరి ప్రజలను బాగా ఆకర్షిస్తున్నారు. ప్రత్యేకించి పశ్చిమ యూపీలో రైతుల ఆగ్రహం మిన్నంటుతోంది. జాట్లు కూడా బీజేపీకి దూరం జరిగారు. 2014 ఎన్నికలను ప్రభావితం చేసిన 2013 ముజఫర్‌నగర్‌ అల్లర్ల నేపథ్యంలో తాము వ్యవహరించినట్లుగా... ఈసారి హిందూ–ముస్లిం అంటూ వేరుచేసి చూసే పదాల డాంబికానికి తాము లోబడిపోమని చాలామంది ఓటర్లు చెప్పారు. 2013 ముజఫర్‌నగర్‌ అల్లర్లను బీజేపీ ఎంతగా వాడుకుందంటే, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీకి అవి వరంలా మారాయి. ఏ రకంగా చూసినా ఫిబ్రవరి 10, 14 తేదీల్లో పశ్చిమ యూపీలో జరిగిన తొలి రెండు దశల ఎన్నికలు ఎస్పీ, ఆర్‌ఎల్‌డీ కూటమి వైపే మొగ్గు చూపాయి. కానీ ఇంకా అయిదు దశల ఎన్నికలు జరగాల్సి ఉంది. (చదవండి: పశ్చిమ యూపీ... కాషాయానికి కీలకం!)

చిన్న పార్టీలను చేర్చుకోవడంలో బీజేపీ విఫలమై ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం జరిగితే, తక్షణం కలిగే ప్రభావం రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పైనే పడుతుంది. ముఖ్యమంత్రి పదవిని యోగి కోల్పోతారు. అలాగే జాతీయ స్థాయికి ఎదగాలనే ఆయన ఆంక్షలకు గండి పడవచ్చు కూడా. 2024లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం ప్రధాని నరేంద్రమోదీ ప్లాన్‌లో భాగంగా కిందిస్థాయి ఓబీసీలకు ప్రాతినిధ్యం వహించేటటువంటి, మరింత యోగ్యత కలిగిన మరొక నేత యోగి స్థానాన్ని భర్తీ చేయవచ్చు. 2017, 2019 ఎన్నికల్లో అత్యంత వెనుకబడిన కులాలకు చెందిన వారు గణనీయంగా మోదీకే ఓటేశారు. ప్రత్యేకించి బీజేపీ నుంచి డజనుకు పైగా మంత్రులు, ఎమ్మెల్యేలు బీజేపీని వీడి సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. వీరిలో చాలామంది ఈబీసీలకు చెందినవారు కావడం గమనార్హం. 

యోగికి కళ్లెం వేయడం బీజేపీకి కష్టసాధ్యమని ఇప్పటికే రుజువైపోయింది. ప్రధానమంత్రి విశ్వాసం చూరగొన్న బ్యూరోక్రాట్‌ అయిన ఏకే శర్మను యూపీకి పంపించడం ద్వారా బీజేపీ కేంద్ర నాయకత్వం యోగిపై స్వారీ చేయాలని ప్రయత్నించింది. ప్రభుత్వాధికారిగా ఉండి ఎంఎల్‌సీ అయిన శర్మను డిప్యూటీ సీఎంగా చేయాలన్నది ప్లాన్‌. కానీ యోగి దాన్ని అడ్డుకోవడంతో బీజేపీ కేంద్ర నాయకత్వం రచించిన పథకం ఫలించలేదు. (చదవండి: మూడో ఫ్రంట్‌ మనగలిగేనా?)

ఉత్తరప్రదేశ్‌లో చాలామంది నేడు మార్పు కోరుకుంటున్నారు. అఖిలేశ్‌ యాదవ్‌ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమివైపు జనం మొగ్గు చూపుతున్నట్లు కనిపిస్తోంది. అయితే ఇప్పుడు ఎన్నికలు ప్రజల మనోభావాల మీద మాత్రమే ఆధారపడి ఉండవు. ఆ సెంటిమెంట్లను మేనేజ్‌ చేయడానికి తగిన యంత్రాంగం కూడా అవసరం. ఇక బీజేపీ విషయానికి వస్తే అత్యధిక వనరులతో కూడిన సుసంపన్న యంత్రాంగం దానికి ఉంది. చివరి నిమిషంలో తలెత్తే సమస్యలను కూడా అది నిర్వహించుకోగలుగుతుంది. 

అయితే, ఈ సెంటిమెంట్‌ ప్రభుత్వంపై కేవలం అసంతృప్తిగా మాత్రమే ప్రతిఫలిస్తుందా లేక ఆగ్రహంగా మారుతుందా అనే అంశంపైనే ఫలితాలు ఆధారపడి ఉంటాయి. ఇదొక్కటే ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీ, యోగి ఆదిత్యనాథ్‌ల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం కలిగిస్తుంది. (చదవండి: బుద్ధి చెప్పువాడు గుద్దిన నేమయా?!)

చివరగా చెప్పాలంటే యూపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు యోగి ఆదిత్యనాథ్‌ భవిష్యత్తునే కాదు... జాతీయ రాజకీయాలను కూడా తీవ్రంగా ప్రభావితం చేయడం ఖాయం.

– నీరజా చౌదరి
సీనియర్‌ రాజకీయ వ్యాఖ్యాత

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top