ఎంత గాలి వీచేను?

Kommineni Srinivasa Rao TRS Party, BRS Party BJP Bandi Sanjay - Sakshi

విశ్లేషణ

తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పుడు భారత్‌ రాష్ట్ర సమితిగా పేరు మార్చుకుని ప్రజల ముందుకొచ్చింది. సాంకేతికంగా ఎన్నికల సంఘం ఆమోదం రావాల్సి ఉన్నప్పటికీ, అదేమీ సమస్య కాకపోవచ్చు. దీనివల్ల ఎలాంటి రాజకీయ ప్రయోజనం కలుగుతుందన్న చర్చ వస్తుంది. కేసీఆర్‌ నిజానికి వచ్చే శాసనసభ ఎన్నికలలో విజయం సాధించిన తర్వాత జాతీయ పార్టీ ప్రతిపాదనపై ముందుకు వెళ్లవచ్చని చాలామంది ఊహించారు. అందుకు భిన్నంగా జాతీయ పార్టీగా టీఆర్‌ఎస్‌ను మార్చడం వల్ల శాసనసభ ఎన్నికలలో కూడా లబ్ధి చేకూరుతుందన్న అంచనాకు ఆయన వచ్చి ఉండాలి. తన కుమారుడు కేటీఆర్‌ను సీఎంను చేయడం కూడా ఇందులో ఒక లక్ష్యమంటారు. అయితే పార్టీ ప్రభావం ఏపీలో ఎంత ఉంటుందన్నది అనుమానమే!

కేసీఆర్‌కు సెంటిమెంట్లు, నమ్మకాలు ఎక్కువే. ఎవరో తాంత్రికుడు చెప్పాడని పార్టీ పేరు మార్చారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరో పించారు. వాస్తు దోషం ఉందని సచివాలయాన్ని పడగొట్టి, కొత్త సచి వాలయం నిర్మిస్తున్నారు. ఇవన్నీ నమ్మకాల ఆధారంగా తీసుకున్న నిర్ణయాలా, కాదా? అన్నదానికి జవాబు చెప్పలేం. తెలంగాణ పేరుతో పార్టీ ఉంటే జాతీయ రాజకీయాలలో ఎంత క్రియాశీలకంగా ఉన్నా, కొన్ని పరిమితులు ఉంటాయి. ఒక రాష్ట్రం పేరుతో ఉన్న పార్టీని ఇతర రాష్ట్రాలలో విస్తరించడం సాధ్యపడదు. దానిని అధిగమించాలంటే పాన్‌ ఇండియా... అంటే దేశ వ్యాప్తంగా అందరూ ఆకర్షితులయ్యే విధంగా పార్టీ పేరు ఉండాలని ఆయన తలపెట్టారు. తదనుగుణంగా టీఆర్‌ఎస్‌ కాస్తా బీఆర్‌ఎస్‌గా మారిపోయింది. 

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అఖిల భారత స్థాయిలో పలువురు తెలుగు ప్రముఖులు రాజకీయాలలో తమ ప్రభావాన్ని చూపారు. వారిలో కొద్దిమంది జాతీయ పార్టీలకు అధ్యక్షులు అయ్యారు. నీలం సంజీవరెడ్డి, దామోదరం సంజీవయ్య, కాసు బ్రహ్మానందరెడ్డి, పీవీ నరసింహారావు ఏఐసీసీ అధ్యక్షులుగా ఎన్నికకాగా, వెంకయ్య నాయుడు బీజేపీ అధ్యక్ష పదవిని అలంకరించారు. సినీనటుడు, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్‌.టి.రామారావు కూడా జాతీయ పార్టీని స్థాపిం చాలని గట్టి ప్రయత్నాలే చేశారు. తెలుగుదేశం పార్టీ అంటే తెలుగు వారికే పరిమితం అవుతుంది కనుక భారతదేశం పేరుతో మరో పార్టీ పెట్టాలనుకున్నారు. ఆచరణలో చేయలేక పోయారు. కానీ జాతీయ స్థాయిలో వివిధ పార్టీలను కలిపి నేషనల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు కావడంలో ముఖ్య భూమిక పోషించారు. ఆ ఫ్రంట్‌కు ఆయనే ఛైర్మన్‌గా ఉండే వారు. ఎంత ఛైర్మన్‌ అయినా, 1989లో ఆయన అధికారం కోల్పో వడంతో ప్రధాని రేసులో నుంచి తప్పుకోవలసి వచ్చింది.

ఎన్టీఆర్‌ అభిమానిగా తెలుగుదేశంలో చేరి, తదనంతర కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నేతగా, రెండు టరమ్‌లు విజయం సాధించి ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తిగా కేసీఆర్‌ దేశస్థాయిలో ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే టీఆర్‌ఎస్‌ పేరు మార్పు వల్ల ఇంతవరకూ ఆ పేరుకు ఉన్న బ్రాండ్‌ ఇమేజీ దెబ్బతినే అవకాశం ఉందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఒక్క పదం తప్ప మిగిలిన దంతా యథాతథంగా ఉంటుందనీ, పార్టీ రంగు, గుర్తు ఏవీ మారవు కాబట్టి ప్రజలు తేలికగానే అడ్జస్టు అవుతారనీ బీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. కాకపోతే పార్టీ జెండాలో తెలంగాణ మ్యాప్‌ బదులు భారతదేశ మ్యాప్‌ ఉంచాలి.

జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్‌లను ఈ కొత్త జాతీయ పార్టీ ఎదుర్కోగలదా అంటే అప్పుడే సాధ్యం కాదని చెప్పక తప్పదు. తెలంగాణ రాష్ట్ర సాధనకు కేసీఆర్‌ ఒంటరిగానే ప్రయాణం ఆరం భించి, తన పోరాటం, వ్యూహాలతో లక్ష్యాన్ని సాధించారనీ, ఇప్పుడు కూడా భారత్‌ రాష్ట్ర సమితిని విజయపథంలో నడిపిస్తారనీ టీఆర్‌ఎస్‌ నేతలు అంటున్నారు. వాదన వినడానికి బాగానే ఉన్నా, ఆయా రాష్ట్రాలలో తనకు కలిసి వచ్చే శక్తులు, వ్యక్తులను గుర్తించి ముందుకు వెళ్లడం అంత తేలిక కాదు. కర్ణాటకలో జేడీఎస్‌తో కలిసి బీఆర్‌ఎస్‌ పోటీ చేస్తుందనీ, ఈ కూటమి అధికారంలోకి వస్తుందనీ కేసీఆర్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. 224 సీట్లు ఉన్న కర్ణాటక అసెంబ్లీలో జేడీఎస్‌కు 35 సీట్లే ఉన్నాయి. వారి బలమే అంతంతమాత్రంగా ఉన్నప్పుడు వారి పొత్తు బీఆర్‌ఎస్‌కు ఎంత మేర ఉపయోగపడు తుందన్నది ప్రశ్నార్థకం. అందువల్లే కర్ణాటక శాసనసభ ఎన్నికలలో బీఆర్‌ఎస్‌తో పొత్తు ఉండదని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి స్పష్టం చేశారు. ఒకప్పటి హైదరాబాద్‌ రాష్ట్ర పరిధి కర్ణాటకలోని కొన్ని జిల్లాలు, మహారాష్ట్రలోని కొన్ని జిల్లాల్లో కేసీఆర్‌ ప్రభావం ఉండవచ్చని కొందరు చెబుతున్నారు. ఈ రెండు రాష్ట్రాల సరిహద్దులో ఉండే కొన్ని గ్రామాలవారు తెలంగాణ ప్రభుత్వ స్కీములకు ఆకర్షితు లవుతున్నారని కథనం. కాంగ్రెస్, జేడీఎస్‌లతో పాటు బీఆర్‌ఎస్‌ కలిస్తే కేసీఆర్‌కు రాజకీయంగా ప్రయోజనం ఉంటుంది. కానీ కాంగ్రెస్‌తో జత కడతామని ఇప్పటికిప్పుడు చెప్పలేని స్థితిలో కేసీఆర్‌ ఉన్నారు.

అదే సమయంలో తోటి తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పుడు రంగంలోకి దిగేది కేసీఆర్‌ నేరుగా చెప్పలేదు. ఆయన మంత్రివర్గ సహచరులు ఎర్రబెల్లి దయాకరరావు వంటివారు మాత్రం సంక్రాంతికి విజయవాడ, గుంటురులలో కేసీఆర్‌ భారీ బహిరంగ సభ ఉండ వచ్చని చెప్పారు. పలువురు ఏపీ నేతలు తమతో టచ్‌లో ఉన్నారని కూడా వారు అంటున్నారు. అనంతపురం జిల్లాకు చెందిన ఒక ప్రముఖ టీడీపీ నేత, ఆయన సోదరుడి పేరు వినవస్తోంది. కానీ ధ్రువీకరణ కాలేదు. ఇదే సమయంలో బీజేపీ తెలంగాణ, ఏపీ నేతలు   గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రావారిని ఉద్దేశించి కేసీఆర్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారనీ, ఆంధ్రలో ఏమని ప్రచారం చేస్తారనీ ప్రశ్నిస్తున్నారు. ఆంధ్రావారి సంస్కృతి, ఆహారపు అలవాట్లు, భాషను ఎద్దేవా చేస్తూ మాట్లాడారని వారు గుర్తు చేస్తున్నారు. కృష్ణానదీ జలాల వివాదం, ఆస్తుల విభజన మొదలైన సమస్యలు ఉండగా, ఏపీలో కేసీఆర్‌ ఏం చెబుతారని అడుగుతున్నారు. ఏపీలో అధికార వైసీపీతో గానీ, ముఖ్యమంత్రి జగన్‌తో గానీ ఇంతవరకూ వ్యక్తిగత విభేదాలు లేవు. కానీ ఈ మధ్యకాలంలో విధాన పరమైన విషయాలలో తేడాలు వచ్చాయి. దానికితోడు కొందరు తెలంగాణ మంత్రులు ఆంధ్ర ప్రభుత్వాన్ని విమర్శించడం, దానిపై ఏపీ మంత్రులు రియాక్ట్‌ కావడం వంటివి జరిగాయి. అయినా కేసీఆర్‌ ఆంధ్రలో బీఆర్‌ఎస్‌ స్థాపించవచ్చు. టీడీపీ వారే ఎక్కువగా చేరే అవకాశం ఉందని అంచనా. గతంలో కేసీఆర్‌ తెలుగుదేశంలో ప్రము ఖుడిగా ఉండి పలువురితో సత్సంబంధాలు కలిగి ఉన్నారు. ఆ పరిచ యాలు పనిచేస్తే హైదరాబాద్‌ ఆర్థిక ప్రయోజనాలతో ముడిపడి ఉన్న కొంతమంది చేరవచ్చు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌తో గానీ, టీడీపీ అధినేత చంద్రబాబుతో గానీ కలిసి బీఆర్‌ఎస్‌ పనిచేసే అవ కాశం ఉందా అన్న దానిపై ఊహాగానాలు ఉన్నా, అవి తేలికగా సాధ్య పడేవి కావు. పైగా సెంటిమెంట్‌తో ముడిపడి ఉన్న రాజకీ యాలు అన్న సంగతి మర్చిపోకూడదు. చంద్రబాబు ఎలాంటి వ్యాఖ్య చేయ కుండా నవ్వి ఊరుకున్నారంటే అందులో చాలా అర్థాలు ఉండవచ్చు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును ఉద్దేశించి డర్టియస్ట్‌ పొలిటీషి యన్‌ అంటూ కేసీఆర్‌ చేసిన విమర్శల వల్ల వీరి మధ్య బంధం ఏర్పడకపోవచ్చు. అయితే వైసీపీ వారు తమకు బీఆర్‌ఎస్‌ వల్ల ఎలాంటి సమస్యా ఉండదని స్పష్టం చేశారు.

తమిళనాడుకు చెందిన తిరుమావళవన్‌ పొత్తు పెట్టుకున్నా, ఆ రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పుంజుకోవడం కష్టసాధ్యం. ఇప్పటికే దేశంలో పలు జాతీయ పార్టీలు ఒకటి, రెండు రాష్ట్రాలకే పరిమితమై ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విభజన తర్వాత జాతీయ పార్టీ అని చెప్పు కొన్నప్పటికీ, తన కార్యక్షేత్రం విభజిత ఏపీకే పరిమితం అయింది. ఎస్పీ, బీఎస్పీ, ఎన్సీపీ, తృణమూల్‌ కాంగ్రెస్, జేడీయూ, ఆర్జేడీ వంటివి జాతీయ పార్టీలు అని చెప్పుకొంటున్నా, వాస్తవానికి అవి తమకు ప్రాబల్యం ఉన్న రాష్ట్రాలలోనే ప్రభావం చూపగలుగు తున్నాయి. ఆమ్‌ ఆద్మీ పార్టీ మాత్రం ఢిల్లీ నుంచి పంజాబ్‌కు విస్తరించి అధికారం సాధించింది. ఇప్పుడు పేరు, స్వరూపం మార్చుకుని ఏర్పడ్డ బీఆర్‌ఎస్‌ దేశం అంతటా వ్యాపించగలిగితే గొప్ప విషయమే అవుతుంది. ప్రధాని మోదీ పైనా, భారతీయ జనతా పార్టీ పైనా కేసీఆర్‌ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తమ కుటుంబ అవినీతి బయట పడకుండా, సీబీఐ, ఈడీ కేసులు వస్తాయేమోనన్న భయంతోనే ఈ కొత్త ఆలోచన చేశారని బీజేపీ వ్యాఖ్యానిస్తోంది. ఏది ఏమైనా ఒక తెలుగునేతగా కేసీఆర్‌ చేస్తున్న సాహసాన్ని అభినందించవచ్చు. కాక పోతే అది దుస్సాహసంగా మారకుండా ఉంటేనే ఆయనకూ, ఆ పార్టీకీ మేలు జరుగుతుంది.


కొమ్మినేని శ్రీనివాసరావు 
వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు
    

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top