ఉద్యోగుల ప్రాణాలు గాలిలో దీపాలేనా?

Kommineni Srinivasa Rao Article On Panchayat Elections In AP - Sakshi

విశ్లేషణ

దేశంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వంకన్నా.. ప్రభుత్వాలు లేదా ఆయా వ్యవస్థల ద్వారా నియమితులైన వారే పవర్‌ఫుల్‌గా ఉంటారా? గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అలాగే అనిపించింది. ఎన్నికల ప్రక్రియ ఆరంభం అయిందన్న ఒకే ఒక కారణంతో న్యాయవ్యవస్థ ప్రభుత్వ వాదనను తోసిపుచ్చడం ఎంతవరకు మంచిదని ఆలోచించాలి. ఏపీలో పంచాయతీ ఎన్నికల విషయంలో న్యాయ వ్యవస్థ అన్ని కోణాలలో విచారణ జరపలేదనిపిస్తుంది. పైగా ఉద్యోగ సంఘాల వాదనను సుప్రీంకోర్టు అసలు పరిగణనలోకి తీసుకోకపోవడం ధర్మమేనా? తమ ప్రాణాలకు గండం తేవద్దని కోరితే న్యాయవ్యవస్థ పట్టించుకోకపోతే వారు ఎవరికి చెప్పుకోవాలి? ఏపీలో కరోనా కేసులు పెరిగితే ఎవరు బాధ్యత వహించాలి?

ఏపీలో పంచాయతీ ఎన్నికల వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అనేక ప్రశ్నలకు తావిస్తోంది. ఈ తీర్పును ముఖతా చూస్తే ప్రభుత్వానికి కాస్త ఇబ్బంది కలిగించేదే కావచ్చు. కానీ ఆ ఇబ్బంది ఎవరి కోసం ఎదురైందన్నది చర్చనీయాంశం అవుతుంది. దాదాపు ఏడాది కాలంగా ప్రభుత్వానికి ఎన్నికల కమిషనర్‌కు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న మాట నిజమే కావచ్చు. రెండు వైపులా పట్టుదలలు ఉండవచ్చు. కాని రాజ్యాంగ వ్యవస్థగా భావించే ఎన్నికల కమిషనర్‌ నిష్పక్షపాతంగా ఉండాలని ఆశించడం తప్పు అవుతుందా? ఆయన ఏకపక్షంగా నిర్ణయాలు చేయడం సరైనది అవుతుందా అన్నది ఆలోచించాలి. ఎన్నికల విధులలో పాల్గొనే అధికారుల ఆరోగ్యం, ఓటు వేయడానికి వచ్చే ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకోవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉండదా?

ఆ మాటకు వస్తే న్యాయ వ్యవస్థకు, ఎన్నికల కమిషన్‌కు కానీ ఆ బాధ్యత ఉండదా? కచ్చితంగా ఉంటుంది. కానీ పంతాలు,  పట్టింపుల ముందు అవన్నీ వీగిపోతున్నాయి. దేశంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికన్నా ప్రభుత్వాలు లేదా ఆయా వ్యవస్థల ద్వారా నియమితులైన వారే పవర్‌ ఫుల్‌గా ఉంటారా? గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అలాగే అనిపిం చింది. కేవలం ఎన్నికల ప్రక్రియ ఆరంభం అయిందన్న ఒకే ఒక కారణంతో న్యాయవ్యవస్థ ప్రభుత్వ వాదనను తోసిపుచ్చడం ఎంతవరకు మంచిదని ఆలోచించాలి. అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో ఎలా చేయాలి అన్నది న్యాయ వ్యవస్థ ఆలోచిస్తున్నట్లుగా లేదు. కేవలం సాంకేతిక కారణాలతోనే నిర్ణయాలు చేయడం ప్రజలకు మేలు చేస్తుందా? లేదా అన్నది చూడాల్సిన అవసరం కూడా ఉంది. మొత్తం సమస్య అంతటినీ సమగ్రంగా పరిశీలించి నిర్ణయాలు ఇస్తున్నట్లుగా కనిపించడం లేదు. 

న్యాయవ్యవస్థ నిష్పాక్షికమేనా?
అయినా కోర్టు వారిదే  పూర్తి అధికారం కనుక వారిని మనం తప్పుపట్టజాలం. గౌరవించాల్సిందే. కాకపోతే ప్రజాభిప్రాయం ఒక రకంగా, న్యాయ లేదా ఎన్నికల వ్యవస్థల అభిప్రాయాలు మరో రకంగా ఉంటున్నాయనిపిస్తుంది. ఉదాహరణకు ఏపీ ఎన్నికల కమిషనర్‌ విషయాన్నే తీసుకుందాం. 2018లో జరపవలసిన ఎన్నికలను ఆయన అప్పుడు ఎందుకు పెట్టలేదని న్యాయవ్యవస్థ ఎందుకు ప్రశ్నించలేదో అర్థం కాదు. మూడు నెలల్లో ఎన్నికలు జరపాలని గౌరవ హైకోర్టువారు అప్పట్లో చెప్పినా ఎందుకు వాటి జోలికి వెళ్లలేదు. మరి అది హైకోర్టు ఉత్తర్వులను ధిక్కరించినట్లు కాదా?

కొత్త ప్రభుత్వ హయాంలో ఎన్నికలు జరుగుతున్న తరుణంలో అతి తక్కువ కేసులు ఉన్న సమయంలో కరోనా పేరుతో రాష్ట్ర ప్రభుత్వాన్ని కనీసం సంప్రదించకుండా వాయిదా వేయడాన్ని న్యాయ వ్యవస్థ ఎందుకు పట్టించుకోలేదు. పైగా అప్పుడు ఎన్నికల వ్యవస్థ నిర్ణయంలో జోక్యం చేసుకోబోమని, ఎన్నికల వాయిదాకు ఓకే చేసింది. ఆ తర్వాత అనేక పరిణామాలు జరి గాయి. ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేస్తూ ఎన్నికల కమిషనర్‌ పేరుతో కేంద్రానికి ఒక లేఖ వెళ్ళడం వివాదాస్పదం అయింది. 

అలాగే ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ పార్క్‌ హయత్‌ హోటల్‌లో రాజకీయ నేతలతో సమావేశం అయిన విషయం జోలికి ఎవరూ వెళ్లకూడదా? ఒకవైపు కరోనా కేసులను తగ్గించడం, మరో వైపు వ్యాక్సిన్‌ పంపిణీ చేయడం వంటి కార్యక్రమాలతో ప్రభుత్వం ఎన్నికలను రెండు నెలలు వాయిదా వేయాలని కోరితే న్యాయ వ్యవస్థ ఎందుకు అంగీకరించలేదంటే ఎన్నికల కమిషన్‌ రాజ్యాంగ వ్యవస్థ కాబట్టి అని అంటున్నారు. రాజ్యాంగ వ్యవస్థలోని వ్యక్తులు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా, నియంతృత్వ ధోరణిలో, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని అవమానించే విధంగా వ్యవహరిస్తున్నా, ప్రభుత్వపరంగా ఎన్నికల నిర్వహణలో ఉన్న ఇబ్బందులు చెప్పినా పట్టించుకోని కమిషనర్‌ను ఎవరూ ప్రశ్నించరాదని న్యాయ వ్యవస్థ భావిస్తే ప్రజలు ఏమి చేయగలరు? కేరళలో ఎన్నికలు జరగలేదా అని గౌరవ సుప్రీంకోర్టు వారు అన్నారు. నిజమే. కానీ ఎన్నికల తర్వాత అక్కడ కరోనా కేసులు చాలా అధికంగా రోజుకు ఆరువేలకు పైగా వస్తున్నాయని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి శైలజ స్వయంగా ప్రకటించారు కదా. వారి అనుభవాలను పరిగణనలోకి తీసుకోనవసరం లేదా? బిహార్‌లో శాసనసభ ఎన్నికల తర్వాత లక్షమంది ఉద్యోగులకు కరోనా సోకిందని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి.

రెండు నెలలు ఆగితే రాజ్యాంగ సంక్షోభం వచ్చేస్తుందా?
ఇదే తరుణంలో కరోనా వ్యాక్సిన్‌ వేయడం కోసం గోవాలో స్థానిక ఎన్నికలు వాయిదా పడ్డాయని వార్తలు వచ్చాయి. అక్కడ ప్రభుత్వం, ఎన్నికల కమిషన్‌ మధ్య సమన్వయం, అవగాహన ఉన్నాయి కనుక ఇబ్బంది లేదా? హైదరాబాద్‌లో స్థానిక ఎన్నికల తర్వాత కరోనా కేసులు పెరిగాయి. ఇలాంటి పరిస్థితిలో ఏపీలో రెండేళ్లుగా జరగని పంచాయతీ ఎన్నికలు మరో రెండు నెలలు ఆగితే అంత పెద్ద రాజ్యాంగ సంక్షోభం వస్తుందా? న్యాయ వ్యవస్థ కొన్ని సందర్భాలలో న్యాయం, ధర్మంతో పనిలేకుండా సాంకేతిక కారణాలతోనే నిర్ణయాలు చేస్తే అది సమాజానికి మేలు చేసినట్లు అవుతుందా? ప్రభుత్వ సంప్రదింపులతో ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు వారు గతంలో ఆదేశాలు ఇచ్చారు. మరి ఎన్నడైనా ప్రభుత్వ వాదనను కమిషనర్‌ పరిగణనలోకి తీసుకున్నారా? ప్రభుత్వ ఛీప్‌ సెక్రటరీ ఏ లేఖ రాసినా దానిని తోసిపుచ్చి, తన ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు తీసుకున్నారు.

ఎన్నికలకు సంబంధించి సరైన ఏర్పాట్లు చేసుకోకుండా హడావుడిగా నిర్వహిస్తే అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దానిని కూడా కోర్టువారు పరిగణనలోకి తీసుకున్నట్లు లేదు. ఇదే సమయంలో ఎన్నికల కమిషన్‌ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లకు అధికారులు వెళ్లలేదు. అది కూడా వివాదం అయింది. ఎన్నికల కమిషనర్‌ గత ఏడాది మార్చిలో ముందుగా జెడ్పీ, మండల ఎన్నికలు నిర్వహిస్తూ, మధ్యలోనే నిలుపుదల చేశారు. ఇప్పుడు వాటిని పెట్టకుండా, పంచాయతీ ఎన్నికలను ఎలా నిర్వహిస్తున్నారు? సాధారణంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవంగా జరగాలని ప్రభుత్వాలు రివార్డులు ఇచ్చి ప్రోత్సహిస్తుంటాయి. కానీ ఈ కమిషనర్‌ ఏకగ్రీవ ఎన్నికలను నిరుత్సాహపరిచే రీతిలో ఆదేశాలు ఇవ్వడం సరైనదేనా?ఎక్కడైనా ఒత్తిడి చేసి ఏకగ్రీవ ఎన్నిక జరుపుకుంటే చర్య తీసుకోవచ్చు. అలాకాకుండా అసలు ఏకగ్రీవాలే వద్దన్న చందంగా నిర్ణయాలు చేయడం సమంజసమేనా? 

ఉద్యోగుల ప్రాణాలు పోతే.. కరోనా కేసులు పెరిగితే..?
ఉద్యోగ సంఘాల వాదనను సుప్రీంకోర్టు అసలు పరిగణనలోకి తీసుకోకపోవడం ధర్మమేనా? తమ ప్రాణాలకు గండం తేవద్దని కోరితే న్యాయవ్యవస్థ పట్టించుకోకపోతే వారు ఎవరికి చెప్పుకోవాలి? రేపు ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు పెరిగితే దానికి ఎవరు బాధ్యత వహించాలి. ఏది ఏమైనా గౌరవ సుప్రీంకోర్టువారు ఆదేశాలు ఇచ్చారు కనుక ప్రభుత్వం కూడా పాటించక తప్పకపోవచ్చు. ఎన్‌జీఓ సంఘాలు ఏమైనా అభ్యంతరం చెబితే చెప్పలేం. గతంలో తమిళనాడులో జల్లికట్టుపై నిషేధం పెట్టారు. ఆ జల్లికట్టు వల్ల పలువురు ప్రాణాలు కోల్పోతుంటారు. అందుకే ఆ నిషేధాన్ని న్యాయ వ్యవస్థ విధించింది. కానీ తమిళనాడులో దానిపై పెద్ద అలజడి వచ్చింది. దాంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకించి ఒక ఆర్డినెన్స్‌ను తెచ్చి జల్లికట్టును అనుమతించింది. దానికి కోర్టు కూడా అంగీకరించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి.

పలుచోట్ల జల్లికట్టు క్రీడతో ప్రతి ఏటా కొందరు మరణిస్తున్నారు. అనేకమంది గాయపడుతున్నారు. అయినా వీటిని అనుమతిస్తున్నారే! శబరిమలైలో మహిళల ప్రవేశానికి సంబంధించి న్యాయ వ్యవస్థ ఏమి చెప్పింది? దానికి వ్యతిరేకంగా కొన్ని రాజకీయ పార్టీలు ఎలా వ్యవహరించాయి అన్నది కూడా అందరికీ తెలుసు. ఇవి ఎందుకు చెప్పవలసి వస్తోందంటే ఎంత గొప్ప న్యాయవ్యవస్థ అయినా కొన్నిసార్లు చట్టంతో సంబంధం లేకుండా ప్రజాభీష్టాన్ని పరిగణనలోకి తీసుకోక తప్పదన్న అభిప్రాయం కలుగుతుంది. కానీ ఏపీలో పంచాయతీ ఎన్నికల విషయంలో న్యాయ వ్యవస్థ అన్ని కోణాలలో విచారణ జరపలేదనిపిస్తుంది. అందువల్లే ఈ తీర్పు ఇచ్చి ఉండవచ్చు. ఏది ఏమైనా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది మంచి పరిణామమా? కాదా అన్నది అంతా ఆలోచించాలని మాత్రం చెప్పక తప్పదు.

కొమ్మినేని శ్రీనివాసరావు 
వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు
   

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top