సాగుచట్టాలతో రైతులకు మేలెంత?

Kommineni Srinivasa Rao Analysis On New Farm Bills In India - Sakshi

విశ్లేషణ

దేశంలో 86 శాతంగా ఉన్న సన్నకారు రైతులు మార్కెట్‌ యార్డులకు కాకుండా సుదూర ప్రాంతాలకు వెళ్లి తమకు గిట్టుబాటు ధర వచ్చేలా చేసుకోగలరా అన్నది ప్రశ్నార్థకమే. కొత్త విధానం ప్రకారం పెద్ద, పెద్ద వ్యవసాయ సంస్థలు, కార్పొరేట్లు, స్టార్టప్‌లు ధరతో సహా రైతులతో ఒప్పందానికి వచ్చి పంటలు వేయించి, ఆ ఉత్పత్తులకు ఆ సంస్థలే మార్కెటింగ్‌ బాధ్యత తీసుకుంటాయి. మార్కెట్‌ యార్డులు మూతపడకుండా, కనీస మద్దతు ధర కొనసాగితే, ఈ బిల్లుల వల్ల రైతులకు నష్టం కలగకపోవచ్చు. అటు మార్కెట్‌ యార్డులు దెబ్బతిని, ఇటు రైతు తన ఉత్పత్తిని ఎక్కడా అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడితే తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ప్రభుత్వాలు తిరిగి రైతుల్ని ఆదుకోవలసి ఉంటుంది. కేంద్రం తీసుకు వచ్చిన చట్టాల వల్ల రైతులకు ప్రయోజనం చేకూరకపోతే, ఏ రాష్ట్ర ప్రభుత్వమూ అమలు చేయదు.

దేశంలో కొత్తగా తీసుకు వస్తున్న వ్యవసాయ చట్ట సవరణలు రైతులకు ఏ మేరకు మేలు చేస్తాయన్నది చర్చనీయాంశంగా ఉంది. ఇది రైతులకు సాధికారిత ఇస్తుందని, వారి ఉత్పత్తులకు వారే ధరలు నిర్ణయించుకునే స్వేచ్ఛ ఇస్తుందని, మధ్య దళారుల వ్యవస్థను అంతం చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ చెబుతున్నారు. అంతేకాక ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నట్లు మార్కెట్‌ యార్డులు మూత పడబోవని, అవి యథాతథంగా ఉంటాయని, కాకపోతే రైతులు తమ ఉత్పత్తులను ఎక్కడైనా అమ్ముకునే స్వేచ్ఛ పొందుతారని, అలాగే ప్రభుత్వం కనీస మద్దతు ధర యథాప్రకారం కొనసాగిస్తుందని ఆయన స్పష్టం చేశారు. దీనివల్ల చిన్న రైతులకు మేలు జరుగుతుందని, టెక్నాలజీ వ్యవసాయ రంగంలోకి రావడం ద్వారా స్టార్టప్స్‌కు అవకాశాలు ఏర్పడతాయని, యువత సేద్యం వైపు ఆసక్తి కనబరుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్‌ కానీ, మిత్రపక్షంగా ఉండి వ్యవసాయ బిల్లులకు నిరసనగా మంత్రి పదవి వదులుకోవడమే కాకుండా, ఎన్డీఏ నుంచి వైదొలగిన అకాలీదళ్‌తోపాటు, టీఆర్‌ఎస్‌ వంటి విపక్షాలు ఈ బిల్లులను వ్యతిరేకిస్తున్నాయి. చిన్న రైతులు నష్టపోతారని, మార్కెట్‌ యార్డులు మూత పడతాయని, ప్రభుత్వం కనీస గిట్టుబాటు ధర బాధ్యత నుంచి తప్పించుకునే యత్నంచేస్తోందని, ప్రభుత్వపరంగా వ్యవసాయం ఉత్పత్తులను కొనుగోలు చేయకుండా పోయే పరిస్థితి రావచ్చని, రైతులు సుదూర ప్రాంతాలకు వెళ్లి తమ ఉత్పత్తులను అమ్ముకోలేరని, కార్పొరేట్‌ సంస్థల ప్రయోజనాలకోసమే ఈ బిల్లులు అని ఈ పక్షాలు వాదిస్తున్నాయి. వైఎస్సార్‌ కాంగ్రెస్, మరి కొన్ని పక్షాలు ఈ బిల్లుకు మద్దతు ఇవ్వడం విశేషం.
(చదవండి: అగ్రి చట్టాలను చెత్తబుట్టలో పారేస్తాం)

ఈ వాదోపవాదాలు విన్న తర్వాత విశ్లేషణ చేసుకుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యవసాయ రంగంలో ఒక కొత్త మార్పునకు ప్రయత్నిస్తున్నారన్న భావన కలుగుతుంది. సాధారణంగా ఎక్కడైనా ఒక మార్పు తేవాలంటే అది అంత తేలిక కాదు. అందులోను సంప్రదాయబద్ధంగా జీవనం సాగించే భారత్‌లో సంస్కరణలకు చాలా సమయం పడుతుంది. దేశంలో 86 శాతం మంది రైతులు చిన్నకారు రైతులే. మరి ప్రధాని మోదీ చెబుతున్నట్లు ఈ రైతులు మార్కెట్‌ యార్డులకు కాకుండా సుదూర ప్రాంతాలకు వెళ్లి తమకు గిట్టుబాటు ధర వచ్చేలా చేసుకోగలరా అన్న ప్రశ్నకు సహజంగానే సాధ్యం కాదు అని సమాధానం వస్తుంది. అయితే మరి దీనికి మార్గం ఏమిటి? కొత్త విధానం ప్రకారం పెద్దపెద్ద వ్యవసాయ సంస్థలు, కార్పొరేట్లు అనండి, స్టార్టప్‌లు అనండి .. అవి రైతులతో ధరతో సహా ఒప్పందానికి వచ్చి పంటలు వేయించి, ఆ తర్వాత ఆ ఉత్పత్తులకు ఆ సంస్థలే మార్కెటింగ్‌ బాధ్యత తీసుకుంటాయి. దీనిని కాంట్రాక్ట్‌ ఫార్మింగ్‌ అనవచ్చు. నిజానికి ఈ తరహా ప్రతిపాదనలు కాంగ్రెస్‌ హయాంలోనే వచ్చాయి. 

ఉమ్మడి ఏపీలోని కొన్ని ప్రాంతాలలో దీనిని ప్రయోగాత్మకంగా చేపట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. అంతేకాక కొన్ని సంస్థలు తమకు కావల్సిన పంటలను సాగు చేయించి, తమ పరిశ్రమలకు వాటిని వినియోగించుకునే అవకాశం వస్తుంది. ఉదాహరణకు కాగితం పరిశ్రమవారు యూకలిప్టస్‌ చెట్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తారు. అలాగే పామాయిల్‌ పరిశ్రమలు రైతులతో పామాయిల్‌ తోటల పెంపకానికి అవసరమైన సదుపాయాలు కల్పిస్తుంటాయి. దీనివల్ల చిన్న రైతులకు పెట్టుబడి ఇబ్బంది ఉండదు. దేశంలో ఎక్కువ కమతాలు అర ఎకరం, ఎకరం ఉన్నప్పుడు వారు పెట్టుబడి పెట్టలేక, ట్రాక్టర్‌ తదితర ఆధునిక టెక్నాలజీ వాడలేకపోతున్నారు.

అలాంటి సమయంలో కాంట్రాక్ట్‌ పార్మింగ్‌ వారికి మేలు చేసే అవకాశం ఉండవచ్చు. అయితే వారి పొలాల్లో వారే కూలీలు అవుతారన్నది ఒక విమర్శ. నిజానికి ఇప్పుడు అంత చిన్న మొత్తంలో భూములు ఉన్నవారు ఎటు తిరిగి కూలీకి వెళ్లక తప్పని స్థితి కూడా ఉందన్న సంగతి మర్చిపోకూడదు. ఏ ఏ పంటలు ఎలా వేయాలన్నదానిపై కంపెనీల నియంత్రణ ఉంటుందా అన్నది చర్చనీయాంశం కావచ్చు. కానీ తెలంగాణలో ప్రభుత్వం ఇప్పటికే నియంత్రిత సాగు విధానం అమలు తెచ్చి, వారు సూచించిన పంట లనే వేయిస్తున్నారు. అపుడు పెద్ద తేడా ఉండకపోవచ్చు. 

ప్రధాని చెబుతున్నట్లుగా మార్కెట్‌ యార్డులు మూతపడకుండా, కనీస మద్దతు ధర కొనసాగితే, ఈ బిల్లుల వల్ల రైతులకు నష్టం కలగకపోవచ్చు. అటు మార్కెట్‌ యార్డులు దెబ్బతిని, ఇటు రైతు తన ఉత్పత్తిని ఎక్కడా అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడితే మాత్రం తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ప్రభుత్వాలు తిరిగి రైతులను ఆదుకోవలసి ఉంటుంది. నిజంగానే రైతులకు ఈ బిల్లుల వల్ల  ఏమీ నష్టం లేనప్పుడు పంజాబ్‌ వంటి రాష్ట్రంలో ఎందుకు వ్యతిరేకత వచ్చిందన్న చర్చ వస్తుంది. దానికి ఒక కథనం ఏమిటంటే అక్కడ మొత్తం రైతుల వ్యవసాయం అంతా కమిషన్‌ దారులపై ఆధారపడి నడుస్తోందట. సుమారు 28 వేల మంది కమీషన్‌దారులు అటు రైతులపైన ప్రభావం చూపుతూ, ఇటు  రాజకీయాలను కూడా కొంతమేర శాసించే స్థితిలో ఉన్నారట. ఆ కమీషన్‌ దారులకు నష్టం జరిగి, రైతుకు నేరుగా పంట అమ్మకం డబ్బు వస్తుంది కనుక, వారు రైతులలో లేనిపోని అనుమానాలు రేపి ఆందోళన చేయిస్తున్నారన్నది బీజేపీ నేతల వాదనగా ఉంది.  

ఏపీ, తెలంగాణలకు సంబంధించి ఈ బిల్లు పెద్దగా నష్టం చేయకపోవచ్చు. ఈ రెండు రాష్ట్రాలలో ప్రగతిశీల రైతులు ఎక్కువ మంది ఉన్నారు. కరోనా సంక్షోభ సమయంలో దేశంలో ఏదైనా రంగం మరీ తీవ్రంగా ప్రభావితం కాకుండా ఉందంటే అది వ్యవసాయ రంగమే అని చెప్పాలి. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ రైతులు తమ పనులు చేసుకోవడానికి కూడా ప్రభుత్వం అనుమతించింది. 2014లో తమ ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టంతో పండ్లు, కూరగాయల సాగుదారులు లాభపడగా, ఇప్పుడు ధాన్యం రైతులకు తమ ఉత్పత్తులను విక్రయించుకునేందుకు తగినంత స్వేచ్ఛ లభించిందని ప్రధాని మోదీ అన్నారు. ఈ క్లిష్ట సమయంలో కూడా రైతుల వల్లే వ్యవసాయ రంగం బలోపేతమైందని, స్వయంసమృద్ధ భారత్‌కు అన్నదాతలు కీలకంగా ఉన్నారని ఆయన అభిప్రాయపడ్డారు.

అందులో కొంతవరకు వాస్తవం ఉన్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చాలా జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. కరోనా సంక్షోభ సమయంలో ఏపీ, తెలంగాణలలో పెద్ద ఎత్తున ధాన్యాన్ని ప్రభుత్వాలు కొనుగోలు చేశాయి. ఏపీలో అరటి, నిమ్మ వంటి ఉత్పత్తులకు ఎప్పుడు ధర గిట్టుబాటుగా లేదన్న సమాచారం వచ్చిన వెంటనే ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధి నుంచి డబ్బు ఖర్చు చేసి పంటలు కొనుగోలు చేసింది. రాజంపేట వద్ద ఒక రైతు తన అరటి ఉత్పత్తి అమ్ముకునే పరిస్థితి లేకపోవడం వల్ల నష్టం జరుగుతోందని సోషల్‌ మీడియాలో పెట్టగానే ప్రభుత్వ యంత్రాంగం స్పందించి వెంటనే ఆ పంటను కొనుగోలు చేసింది.

అలాగే ఆయా చోట్ల టమాటా పంట విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. అయినప్పటికీ కొన్ని చోట్ల సమస్యలు వచ్చి ఉండవచ్చు. కొన్ని ఉత్పత్తులనైతే ఢిల్లీ మార్కెట్‌కు తరలించడానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చొరవ తీసుకున్నాయి. ఇలాంటి సమయంలో రైతులు ఎక్కడకు వెళ్లకుండా ఆయా వాణిజ్య, వ్యాపార సంస్థలు ముందుకు వస్తే రైతులకు ఉపయోగం జరగవచ్చు. అయితే అందుకు తగ్గ ఏర్పాట్లు నిర్దిష్టంగా ఉండాలి.

నిజంగానే కార్పొరేట్‌ సంస్థలు, స్టార్టప్‌లు ముందుకు వచ్చి రైతులతో ఒప్పందాలు చేసుకుని, అగ్రి ప్రాసెసింగ్‌ యూనిట్లు, స్టోరేజీ సదుపాయాలు, పుడ్‌ ప్రోసెసింగ్‌ ప్లాంట్లు వంటివి ఏర్పాటు చేస్తే రైతులకు మెరుగైన ధర లభించే అవకాశం ఉంటుంది. అలాగే మధ్య దళారుల వ్యవస్థ తగ్గితే వినియోగదారులకు కూడా సహేతుకమైన ధరలకు ఆహార పదార్థాలు లభించే అవకాశం ఉంటుంది. భారతదేశం ప్రధానంగా వ్యవసాయ ఆధారిత దేశం కనుక, ఈ రంగంలో పెట్టుబడులు పెద్ద ఎత్తున రావల్సిన అవసరం ఉంది. వాటి ద్వారా కొత్త తరహా పరిశ్రమలు వచ్చినప్పుడే రైతులకుకాని, దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం కలిగే అవకాశం ఉంటుంది. అయితే టీఆర్‌ఎస్‌ వ్యవసాయ విద్యుత్‌ సంస్కరణలతో పాటు, అగ్రి బిల్లులను వ్యతిరేకించింది.
(చదవండి: స్కామ్‌లపై కేసులు వద్దంటే ఏంటర్థం?)

నిజానికి కేంద్రం తీసుకు వచ్చిన కొత్త చట్టాలు అమలు కావడానికి చాలా సమయం పట్టవచ్చు. ఈలోగా ఇప్పుడు ఉన్న పద్ధతులే అమలు అవుతాయి. నిజంగానే కేంద్రం తీసుకు వచ్చిన చట్టాల వల్ల రైతులకు ప్రయోజనం చేకూరకపోతే, ఏ రాష్ట్ర ప్రభుత్వమూ అమలు చేయదు. ఒక వేళ అవి రైతులకు ఉపయోగపడేవి అయితే, రాష్ట్ర ప్రభుత్వాలతో సంబంధం లేకుండానే వారు ఆయా కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటారు. ఏది ఏమైనా ఒక ఐడియా జీవితాన్ని మార్చివేస్తుందన్నట్లుగా దేశ వ్యవసాయ రంగంలో కొత్త మార్పులు వచ్చి రైతుల జీవితాలు బాగుపడితే సంతోషించవచ్చు.
వ్యాసకర్త: కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు  

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top