ఆ చట్టాలు నేటికీ వివక్షాపూరితమే!

Flavia Agnes Article On Hindu Marriage Acts - Sakshi

హిందూ వివాహాలను 1955 నాటి హిందూ వివాహ చట్టం, ఒప్పంద వివాహంగా మార్చిందన్నది సత్యమే అయినప్పటికీ ఆ ఒప్పందంలో భార్యకు ఏ పాత్రా లేకపోవడం గమనార్హం. అందుకే వివాహ చట్టాలు నేటికీ స్త్రీలపట్ల వివక్ష చూపుతూనే ఉన్నాయి. వివాహానంతరం ఎక్కడ నివాసముండాలి? ఇంటికి మరీ దూరంగా భార్య ఉద్యోగం చేయవచ్చా అనే అంశాలను భర్త మాత్రమే నిర్ణయిస్తుంటాడు. భర్తే కుటుంబ యజమాని (పతియే పరమేశ్వరుడు) కాబట్టి కోర్టులు కూడా భర్తకు అనుకూలంగానే వ్యవహరిస్తుంటాయి.

భర్తకు విధేయంగా ఉండటం భార్య పవిత్ర విధి, అతడు ఎంపిక చేసిన స్థలంలోనే ఆమె నివసించాలి అనేదే ఇవాళ్టకీ నడుస్తోంది. మహిళా ఉద్యమం లేవనెత్తిన డిమాండ్ల కారణంగా మహిళలను కూడా చట్టం అనే పరిధిలోకి చేర్చినట్లు మనం గ్రహిస్తాము. నిజానికి, భారత రాజ్యాంగం ఆర్టికల్‌ 14 కింద సమానత్వానికి, ఆర్టికల్‌ 15 కింద వివక్షా రాహిత్యానికి హామీ ఇచ్చింది కానీ కుటుంబం లోపల వివాహ వ్యవస్థలో స్త్రీపై పురుషుడి ఆధిక్యత కొనసాగుతూనే ఉంది. పెళ్లయ్యాక తనకు నచ్చిన ఇంటిలో ఉండటం అనే స్త్రీల హక్కును ఇటీవలి వరకు ఎవరూ గుర్తించలేదు.

మహిళకు ప్రాధాన్యం ఇచ్చే న్యాయ సిద్ధాంతం పక్షపాతంతో కూడుకున్నదనీ, అలాంటి న్యాయ మీమాంసకు తటస్థ దృక్పథం ఉండదని సూత్రీకరించవచ్చా? ఫెమినిస్టు కళ్లతో ప్రపంచాన్ని చూడటం లేదా మహిళల హక్కులు అనే భావనే పక్షపాతంతో ఉంటుందనీ ముద్ర వేయవచ్చా? శాసనానికి ఉండే సానుకూల లక్షణం కారణంగా, అది సమాజాన్ని సమర్థంగా మార్చివేసే ఉపకరణంగా పనిచేస్తుందని చెప్పడమంటే మరీ సాధారణీకరించినట్లు అవుతుందని పలువురు ఫెమినిస్టు సిద్ధాంతకారులు వాదిస్తున్నారు. వీరి దృష్టిలో శాసనం అనేది ఒక మొరటైన, పరిమిత స్వభావం కలిగిన పరికరం మాత్రమే. తనను రూపొందించిన సమాజంలోని ఆధిపత్య భావాలతో అది గిరి గీసుకుని ఉంటుందని వీరి అభిప్రాయం.

శాసనం అభివృద్ధి క్రమాన్ని మనం పరిశీలిస్తున్నప్పుడు, మహిళా ఉద్యమం లేవనెత్తిన డిమాండ్ల కారణంగా మహిళలను కూడా చట్టం అనే పరిధిలోకి చేర్చినట్లు మనం గ్రహిస్తాము. ప్రత్యేకించి మహిళలు పితృస్వామిక సమాజంలోని పౌరులుగా తమ హక్కులను ప్రకటించడం ప్రారంభమయ్యాక వారిని శాసన పరిధిలో చేర్చడం తప్పనిసరైంది. మహిళా ఉద్యమం డిమాండ్లు... సమానత్వం, ఓటు హక్కు, విద్యా హక్కు, అనేక వృత్తులను చేపట్టడం వంటివే కదా.. ఈ డిమాండ్లతోనే పాశ్చాత్య మహిళలు అనేక సమరాలు చేసి గెలుపొందారు. ఈ పోరాటాలతో ప్రభావితమై, భారత రాజ్యాంగం ఆర్టికల్‌ 14 కింద సమానత్వానికి, ఆర్టికల్‌ 15 కింద వివక్షా రాహిత్యానికి హామీ ఇచ్చింది. స్వేచ్ఛ, స్వాతంత్య్రంతో పాటు సమానత్వ భావన కూడా మన రాజ్యాంగంలో మహిళల పరిరక్షణకు మూలస్తంభాలుగా నిలబడ్డాయి. ఓటు హక్కు, విద్య, ఉపాధిలో సమాన అవకాశాలు, సమాన పనికి సమాన వేతనం వంటివి సమానత్వం అనే భావన కిందికి వచ్చి చేరాయి.

అయితే వివాహ చట్టాల కింద గృహవ్యవస్థను మనం పరిశీలించినప్పుడు, ఈ సమానత్వ భావన మహిళలకు హానికరంగా మారుతుంది. మన వివాహ వ్యవస్థలో స్త్రీపురుషులు సమానులు కారు కాబట్టి సమానత్వం అనే రూళ్లకర్ర వీరికి వర్తించదు. సమానత్వం సమానుల మధ్యే ఉంటుంది. సమానత్వ భావనను అసమానుల మధ్య వర్తించినట్లయితే అది మరింత అసమానత్వానికి దారితీస్తుంది. అయితే ఈ వ్యత్యాసం వివాహ చట్టాల్లో అంత స్పష్టంగా కనిపించదు. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత రూపొందిన 1955 నాటి హిందూ వివాహ చట్టాన్ని మనం పరిశీలించినప్పుడు మనకు ఇది అత్యంత స్పష్టంగా బోధపడుతుంది.

అసమానత్వంతో కూడిన వివాహం
వివాహ వ్యవస్థ లోపల మహిళల ప్రతిపత్తి పురుషులతో పోలిస్తే చాలా వ్యత్యాసంతో ఉంటుంది. పురుషుడు సంపాదనాపరుడు, అతడి సంపాదనను ఆర్థిక పదబంధాలతో కొలుస్తారు. మహిళ గృహిణి, అంతేకాకుండా వివాహ వ్యవస్థ లోపల ఆమె అధీనురాలి స్థితిలో ఉంటుంది. ఆమె కుటుంబం, సమాజానికి చెందిన సాంస్కృతిక నియమాలను నిలబెట్టే స్థానంలో ఉంటుంది. అయితే వివాహ చట్టాల్లోపల వధూవరుల మధ్య ఉంటున్న ఈ అసమానతా స్థితిని ఎవరూ గుర్తించరు. ఇక విడాకులకు ప్రయత్నిస్తున్నప్పుడు స్త్రీపురుషులిరువురూ తమ పిటిషన్లను ఒకే నిర్దిష్ట భూమికపై సమర్పించాల్సి ఉంటుంది. అవేమిటంటే – వ్యభిచారం, పారిపోవడం, క్రూరత్వం.

విడాకుల లిటిగేషన్‌లో న్యాయస్థానాల ముందుకు వచ్చే అంశాలను పరిశీలిద్దాం. సమయానికి భోజనం సిద్ధం చేయకపోవడం, భర్త పని నుంచి ఇంటికి తిరిగి రాగానే టీ ఇవ్వకపోవడం (భార్య సంపాదనాపరురాలిగా ఉంటున్నప్పటికీ ఈ సేవ చేయాల్సిందే), సెక్స్‌కి వ్యతిరేకించడం, గర్భాన్ని తీసేసుకోవడం, తన మరుదుల సమక్షంలో లేక బహిరంగంగా ఉంటున్నప్పుడు తలకు వస్త్రం కప్పుకోకపోవడం, వివాహానికి సంకేతమైన సిందూరం లేదా మంగళసూత్రాన్ని ధరించడాన్ని తిరస్కరించడం, ఉమ్మడి కుటుంబానికి దూరంగా విడిగా వేరే ఇంట్లో ఉండాలని డిమాండ్‌ చేయడం, వరకట్నం తీసుకున్నాడని సెక్షన్‌ 498ఏ కింద కేసుపెట్టడం వగైరా కారణాలు విడాకుల పిటిషన్లో కనబడుతుంటాయి. విడాకులు కోరుకుంటున్న భార్యలు తమ భర్తల క్రూరత్వానికి వీటినే ఉదాహరణలుగా చూపి కోర్టును అభ్యర్థిస్తుంటారు. 

అయితే మహిళలు విడాకులు కోరుతూ తమ పిటిషన్లలో చెప్పే కారణాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. అవి ప్రధానంగా వారి ప్రాథమిక ఉనికికి సంబంధించి ఉంటాయి. అత్తింటి నుంచి తనను బయటకు గెంటేయడం, పదే పదే కట్నాన్ని డిమాండ్‌ చేయడం, మరింత కట్నం ఇవ్వలేదని భార్య తల్లితండ్రులను అవమానించడం, స్త్రీ ధనంగా వచ్చిన భార్య నగలను, విలువైన వస్తువులను లాక్కుని వాటిని ఆమెకు తిరిగి ఇవ్వకపోవడం, రోజువారీ ఖర్చులకు కూడా డబ్బు ఇవ్వకపోవడం, ఉద్యోగం చేయనీయకుండా అడ్డుకోవడం, ఆమె జీతాన్ని లాగేసుకోవడం, ఆమె నైతిక వర్తనపై నిందలు మోపడం... లైంగికంగా, భావోద్వేగపరంగా, సెక్స్‌ పరంగా దూషించటం, పిల్లలను తన చెంతకు రానివ్వకపోవడం వంటి కారణాలతో మహిళలు విడాకుల పిటిషన్‌ సమర్పిస్తుంటారు.

పితృస్వామ్య సామాజిక నిర్మాణంలో మహిళలు అనేక సందర్భాల్లో తమ పుట్టింటిని వదిలి భర్త ఇంటికి రావడం కద్దు. తనకు నచ్చిన ఇంటిలో ఉండటం అనే స్త్రీల హక్కును ఇటీవలి వరకు ఎవరూ గుర్తించలేదు. ప్రసవం కోసం భార్యను పుట్టింటికి పంపినప్పుడు, భర్త ఆమె మళ్లీ తన ఇంటికి రాకుండా అడ్డుకుంటాడు. తర్వాత విడాకుల్ని కోరుకుంటాడు. భర్త వాస్తవంగానే తన భార్య పునరాగమనాన్ని నిరోధిస్తున్నప్పుడు నిర్మాణాత్మకంగా వారిని వేరు చేయడం ఎలా అని సూత్రీకరించడానికి కోర్టులకు చాలా సమయం పట్టింది. కాబట్టి విడాకుల భూమిక కూడా స్త్రీపురుషులను వేరు చేస్తోందని గమనించవచ్చు.

మహిళల శరీరాలూ... ఆస్తే మరి!
ఐపీసీ సెక్షన్‌ 497 కింద వ్యభిచారంపై చట్టాన్ని పరిశీలించినప్పుడు ఇదేం వైపరీత్యం అనిపించింది. దీన్ని 2018 సెప్టెంబర్‌లో జోసెఫ్‌ షైన్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టిపడేసిందనుకోండి. 158 సంవత్సరాల ఐపీసీ 497 సెక్షన్‌ ప్రకారం భర్త అనుమతి లేకుండా భార్యతో ఎవరైనా లైంగిక సంబంధం పెట్టుకుంటే అది భర్త పట్ల నేరం చేసినట్లు అవుతుంది. కానీ ఇదే సూత్రాన్ని మహిళ పట్ల ఈ చట్టం వర్తింపజేయలేదు. ఈ చట్టం కింద మహిళను శిక్షించలేరు. కానీ ఈ నిబంధన ఆర్టికల్‌ 14ను ఉల్లంఘిస్తోందని సవాలు చేసినప్పుడు సమానత్వ ప్రతిజ్ఞ నుంచి దాన్ని కాపాడటానికి కోర్టులు పితృస్వామిక సిద్ధాంతంపై ఆధారపడేవి.

దీన్ని మహిళకు అనుకూలమైన సంరక్షణ చర్యగా చూసేవారు. మహిళలకు దీనిద్వారా కలిగిన ప్రమాదాన్ని న్యాయప్రక్రియ అరుదుగా మాత్రమే గుర్తించింది. కానీ జెండర్‌ కోణం నుంచి దీన్ని చూసినప్పుడు మహిళలు నిష్క్రియాత్మకంగా, స్తబ్దుగా ఉంటారని, తమ శరీరాల పట్ల తమ లైంగిక వాంఛల పట్ల కూడా వారు నిర్ణయాలు తీసుకోలేరని ఈ చట్టం భావిస్తున్నట్లు బోధపడుతుంది. వివాహం తర్వాత మహిళ శరీరం భర్తకే చెందుతుందని ఇది భావిస్తోంది. విక్టోరియన్‌ యుగం లైంగిక నీతి చట్రంపై ఆధారపడి, మహిళతో లైంగిక సంబంధం పెట్టుకునే విషయంలో ఇద్దరు పురుషుల మధ్య సమస్యగా మాత్రమే దీన్ని చూస్తూవచ్చారు.

చట్టం ఈ విషయంలో పురుషుడిని మాత్రమే నేరస్థుడిని చేసినప్పటికీ సారాంశంలో ఇది మహిళా వ్యతిరేకమైంది. ఇది మహిళలను  చరాస్తిగా, గృహోపకరణంగా భావిస్తూ భార్యపై భర్తకు ఆస్తి హక్కుకు చట్ట సమ్మతి కలిగించేది. ఏ వ్యక్తి అయినా మరొక వ్యక్తి భార్యను అతడి సమ్మతి లేకుండా లైంగిక సంబంధం పెట్టుకుంటే అది ఆ భర్త హక్కును ఉల్లంఘిస్తున్నట్లుగానే చట్టం భావించేది. ఎందుకంటే తన భార్యతో లైంగిక సంబంధం పెట్టుకునే అంశం కూడా పూర్తిగా భర్తకు చెందిన హక్కుగానే భావించేవారు.

ఇలాంటి పురుష పాక్షిక చట్టాన్ని 158 సంవత్సరాల తర్వాత మాత్రమే న్యాయవ్యవస్థ కొట్టి పడేసింది. అంతవరకు పురుషుడు మాత్రమే హేతుబద్దంగా ఆలోచిస్తాడు అని సాధారణంగా సమాజంలో బలపడిన అభిప్రాయమే న్యాయ మీమాంసలో కూడా ఉండేది. రీజనబుల్‌ మ్యాన్‌ అనే భావనపై మద్రాస్‌ హైకోర్టు జడ్జి జస్టిస్‌ శ్రీదేవన్‌ ఇన్‌ సర్చ్‌ ఆఫ్‌ ది ఆర్డినరీ ఉమన్‌ అనే వ్యాసంలో ప్రశ్నించారు.

తటస్థత కూడా పక్షపాతమేనా?
ముగించేముందు ఈ వ్యాసం ప్రారంభంలో వేసిన ప్రశ్నను మళ్లీ సంధిస్తున్నాను. ఫెమినిజం దృక్కోణం కానీ దాని వెలుగులో మహిళల హక్కులను ప్రస్తావించడం కానీ పక్షపాత దృష్టి అని ముద్రవేయవచ్చా? దీనికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రచూడ్‌ సరైన సమాధానం ఇచ్చారు. 2018 అక్టోబర్‌లో ఓపీ జిందాల్‌ లా స్కూల్‌లో ఫెమినిజం ఇన్‌ ప్రాక్టీస్, ఫెమినిస్ట్‌ లాయరింగ్‌ అండ్‌ ఫెమినిస్ట్‌ జడ్జింగ్‌ అనే అంశంపై నిర్వహించిన చర్చాక్రమంలో ఆయన స్ఫూర్తిదాయకమైన ప్రకటన చేశారు.‘ఒక న్యాయమూర్తిగా మీరు రాజ్యాంగంలోని అత్యవసర విలువలను ఎత్తిపడుతూ ఆ రాజ్యాంగ సారాంశమైన సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం వంటి విలువలను బలపరుస్తారు.

ఈ కోణంలో మీరు ఫెమినిస్టు సూత్రాలను వర్తింపజేస్తున్నప్పుడు రాజ్యాంగంలోని సమానత్వ భావనకు మరింత బలం చేకూరుస్తారంతే’. ఈ సందర్భంలోనే రాజ్యాంగమే తనకు తానుగా ఫెమినిస్టుగా ఉందా అన్న ప్రశ్నకు ఆయన చక్కటి సమాధానం ఇచ్చారు. ‘ఫెమినిజం అంటే సామాజిక అంతరాల వ్యవస్థను విచ్ఛిన్నపర్చటమే కదా. సరిగ్గా భారత రాజ్యాంగ లక్ష్యం కూడా అదే. సమాజంలో పరివర్తన జరగాలంటే ఉనికిలో ఉన్న సామాజిక నిర్మాణాలను విచ్ఛిన్నపర్చాల్సిందే’. మన దేశంలోని న్యాయస్థానాల్లో మహిళా న్యాయమూర్తుల సంఖ్య పెరుగుతోంది కాబట్టి తమను పక్షపాతం చూపుతున్న జడ్జీలుగా ముద్రిస్తారనే భయం వీడి, మహిళా కేంద్రక న్యాయమీమాంసకు వీరు ప్రాధాన్యం ఇవ్వాలి. మహిళల హక్కును కాపాడటానికి మహిళ న్యాయమూర్తుల సంఖ్యను పెంచడం అవసరం.

అదే సమయంలో పితృస్వామిక స్వభావంతో కూడిన తటస్థతను ప్రదర్శించనందుకు వారు క్షమాపణ చెప్పాల్సి వస్తే మహిళా జడ్జీల నియామకం ఒక విఫల ప్రాజెక్టు అయిపోతుంది. కానీ మహిళా జడ్జీల నియామకం ప్రక్రియ జస్టిస్‌ చంద్రచూడ్‌ స్పష్టం చేసినట్లుగా రాజ్యాంగ విలువలను మరింత సమున్నతంగా ఎత్తిపడుతూనే, ఫెమినిస్టు న్యాయమీమాంస పరిణామానికి గణనీయంగా తోడ్పడుతుంది. – ఫ్లేవియా ఏగ్నెస్, మహిళా హక్కుల న్యాయవాది 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top