అసామాన్య పోరాటం దండి సత్యాగ్రహం 

Dr Nagasuri Venugopal Guest Column On Dandi Satyagraha - Sakshi

విశ్లేషణ

సామాన్యులను విశేషంగా ప్రభావితం చేసే ఉప్పు కోసం సామాన్యులందరినీ కలుస్తూ దానికి నడకను సాధనంగా చేసుకున్న మహాఉద్యమ పథికుడు మహాత్మాగాంధీ. 1930 ఏప్రిల్‌ 6వ తేదీ ఉదయం 6 గంటల ముప్పై నిమిషాలకు 61 ఏళ్ల వృద్ధ నేత గాంధీ తన సహచరులతో కలిసి నాటి బ్రిటిష్‌ చట్టాన్ని ధిక్కరిస్తూ, గుజరాత్‌ తీరంలోని దండి వద్ద చేసిన ఉప్పు తయారీ బ్రిటిష్‌ పాలకులను వణికించింది. ఈ ఉద్యమమే తర్వాత భారత స్వాతంత్య్రానికి నాంది పలికింది. అటు జాతీయ నాయకులు, ఇటు బ్రిటిష్‌ పాలకులు పరాచికాలు ఆడినప్పటికీ ఈ రెండు వర్గాల అంచనాలను వమ్ము చేస్తూ దండి సత్యాగ్రహం ఘన విజయం సాధించడమే కాకుండా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతోమందికి ప్రేరణ ఇచ్చింది.

అది 1930 ఏప్రిల్‌ 6. ఉదయం 6 గంటల 30 నిమిషాలు. 61 సంవత్సరాల వృద్ధుడు తన సహచరులతో వచ్చి ఉప్పును తయారు చేశారు. ఆ నాయకుడు గాంధీజీ.  అలా ఉప్పు సత్యాగ్రహానికి రంగస్థలం అయిన ప్రాంతం గుజరాత్‌ తీరంలోని దండి.  వందేళ్ళ క్రితం జరిగిన ఈ సంఘటన అప్పటి బ్రిటీషు పాలకుల వెన్నులో వణుకు పుట్టించింది. ఈ ఉద్య మంతోనే భారతదేశానికి స్వాతంత్య్రం ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది. 

వ్యూహంలో చాతుర్యం:
గాంధీజీ వేషభాషలు చాలా మామూలుగా కనబడతాయి. ఇంగ్లండు చదువు గానీ, దక్షిణాఫ్రికా అనుభవం గానీ ఆయనకు ఉన్నట్టు మాటలు, దుస్తుల ద్వారా అంచనా వేయలేం. ఈ దండి సత్యాగ్రహం భావనలో రెండు అంశాలు మనం గమనించవచ్చు. ఒకటి ఉప్పు, రెండవది నడక. గాలి, నీరు తర్వాత ముఖ్యమైనది ఉప్పు అని గాంధీజీ దండి సత్యాగ్రహం గురించి వివరిస్తూ పేర్కొన్నారు. అప్పటి బ్రిటీష్‌ వారు భారతీయుల నుంచి వసూలు చేసే పన్నుల్లో ఉప్పు పన్ను 8.2 శాతం ఆక్రమించేది. నిజానికి సుదీర్ఘమైన సముద్రతీరంగల ఈ దేశంలో ఉప్పు వద్దన్నా లభిస్తుంది. మనకు సూర్యరశ్మి కూడా కొరత కాదు. అయితే బ్రిటీష్‌ వాళ్ళు తమకనుకూలంగా ఉప్పు తయారీని నిషేధిస్తూ చట్టాలు చేశారు. ఈ ఉప్పు పన్ను ధనికుల కన్నా పేదవారినే ఎక్కువ బాధించేది. దేశంలోని పేదలను కదిలించే ఉప్పును గాంధీ తన ఉద్యమానికి ఒక ప్రతీకగా స్వీకరించడం అమోఘమైన పాచిక.

గాంధీ చంపారన్‌ ఉద్యమ సమయంలో ఏనుగునెక్కి కూడా ప్రయాణం చేశారు. దండి సత్యాగ్రహానికి బండ్లు, కార్లు కాకుండా కేవలం నడిచే కార్యక్రమంగా ఆయన మలిచాడు. సబర్మతీ ఆశ్రమానికి దగ్గరలో వుండే ఏదో ఒక తీర ప్రాంతాన్ని కాకుండా 200 మైళ్ళ దూరంలో వుండే నౌసరి (దండికి అప్పటి పేరు) ని ఎంచుకోవడం కూడా గాంధీ ప్రతిభావంతమైన ప్రణాళిక. 1930 మార్చి 12వ తేదీన 78 మంది అనుచరులతో 24 రోజుల పాటు నడుస్తూ మధ్యమధ్యన ప్రతి రోజూ ఒక ఊరిలో ఆగుతూ సాగడం అప్పటికి చాలా కొత్త వింతగా కనబడింది. మిగతా జాతీయ నాయకులు ఇదేమి వ్యూహమని పరాచికాలు ఆడగా బ్రిటీష్‌ పాలకులు 6 పదులు దాటిన ముదుసలి ఏమి నడుస్తాడులే అని తమలో తాము నవ్వుకున్నారు.  ఈ రెండు వర్గాల అంచనాలను వమ్ము చేస్తూ దండి సత్యాగ్రహం విజయవంతం కావడమే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతోమందికి ప్రేరణ ఇచ్చింది. 

యువకులకు పెద్ద పీట:
గాంధీతోపాటు 200 మైళ్ళు నడచిన 78 మంది వివరాలు పరిశీలిస్తే అందులో 40–50 ఏళ్ల వయసున్నవాళ్ళు 6గురు మాత్రమే వుండగా... 60 దాటినవాడు ఒక్క గాంధీజీయే. ఈ బృందంలో ఎక్కువమంది  20–25 మధ్య వయసున్న యువకులే కావడం విశేషం. చాలా జాగ్రత్తగా గాంధీజీ ఈ 78 మందిని ఎంపిక చేసుకున్నారు.  వీరిలో ఒకే ఒక తెలుగు వ్యక్తి 25 సంవత్సరాల ఎర్నేని సుబ్రహ్మణ్యం. వీరే తరువాతి దశలో పొట్టి శ్రీరాములుకు మిత్రుడిగా, గురువుగా కొనసాగారు. భారత స్వాతంత్య్రోద్యమంలో క్రియాశీలక సంఘటనలు సహాయ నిరాకరణ, శాసనోల్లంఘనం వంటివి ఉవ్వెత్తున మొదలైనా చౌరీచౌరాలో జరిగిన అల్లర్ల కారణంగా గాంధీ తన వ్యూహాన్ని మార్చేశారు. తరువాత మనకు కనబడే ప్రధాన సంఘటన దండి సత్యాగ్రహమే.  సంఘటనలకు స్పందనగా ఎలా వ్యక్తులు తమను తాము మలచుకోవాలో సత్యాగ్రహ శిక్షణ కూడా ఏర్పాటు చేశారు. అటువంటి వినూత్న శిక్షణకు రాజమండ్రి దగ్గర వున్న సత్యాగ్రహ ఆశ్రమం కేంద్రం కావడం తెలుగువారందరికీ గర్వకారణం.

దండి సత్యాగ్రహం ప్రభావం:
1930 ఏప్రిల్‌ 6న గాంధీ తన సహచరులతో కలసి ఉప్పును తయారు చేసి, బ్రిటీష్‌ శాసనాన్ని ఉల్లంఘించారు. అలా గాంధీ తయారు చేసిన ఉప్పు గడ్డను తరువాత వేలం వేయడం ఒక చారిత్రక విశేషం. గాంధీజీ ఉప్పు తయారు చేసిన సమయంలో తెలుగింటి కోడలైన సరోజినీ నాయుడు చట్టాన్ని గాంధీ అతిక్రమించారని  బిగ్గరగా ప్రకటించడం ఇంకో విశేషం.  కమలాదేవి ఛటోపాధ్యాయ స్వాతంత్య్రం ఉప్పును కొంటారా అని బొంబాయిలో మెజిస్ట్రేట్‌ను అడగడం మరో ఆశ్చర్యకరమైన అంశం. ఈ రీతిలో దేశవ్యాప్తంగా ఉప్పు స్వాతంత్య్ర ఉద్యమానికి నిప్పు రవ్వగా పనిచేసింది. 1930 ఫిబ్రవరి 27న యంగ్‌ ఇండియా పత్రికలో నేను అరెస్టయితే అనే శీర్షికతో గాంధీ ఒక సంపాదకీయాన్ని రాస్తూ ఉప్పు పన్ను దుష్ప్రభావాన్ని వివరించాడు. మార్చి రెండవ తేదీ గాంధీజీ వైస్రాయ్‌ కి సుదీర్ఘమైన ఉత్తరం రాసి ఈ పన్ను ద్వారా పేదలను ఏ స్థాయిలో పీడిస్తున్నారో తెలియజేసారు. ఒక వేళ మీరు సానుకూలంగా స్పందించక పోతే 11వ రోజున సబర్మతీ ఆశ్రమం నుంచి బయలుదేరి ఉప్పు పన్ను చట్టాన్ని అతిక్రమిస్తానని హెచ్చరించారు.  ఏప్రిల్‌ 6వ తేదీన చూసీచూడనట్టున్న బ్రిటీష్‌ ప్రభుత్వం అప్రమత్తమై మే 5వ తేదీన గాంధీజీని అరెస్టు చేసింది.

ప్రపంచ వ్యాప్త  స్ఫూర్తి : 
శాంతియుతంగా నిరసన తెలిపే విధానం (సత్యాగ్రహం) ప్రపంచం మొత్తాన్ని ఆకర్షించింది. గాంధీ దండి సత్యాగ్రహం నడకను చిత్రిం చిన దృశ్యాలు యూరప్‌ను, అమెరికాను విపరీతంగా ఆకర్షించాయి. న్యూయార్క్‌ టైమ్స్‌ ప్రతి రోజూ వార్తలు ప్రచురించటమే కాకుండా ఏప్రిల్‌ 6, 7 తేదీల్లో తొలి పేజీ కథనాలను ప్రచురించింది. 1930 సంవత్సరం మ్యాన్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా గాంధీజీని టైం మ్యాగజైన్‌ ఎంపిక చేయడం విశేషం. ఉప్పు పన్నుకు సంబంధించిన సామాజిక ఆర్థికపరమైన పార్శా్వలను వివరించే రీతిలో రామమనోహర్‌ లోహియా ఉద్యమం జరిగిన మూడేళ్ళలో పీహెచ్‌.డి పట్టాను గడిం చడం ఇంకో విశేషం. దండి ఉద్యమం జరిగిన మూడు దశాబ్దాల తరువాత అమెరికాలో నల్లజాతి వారికి వెలుగు చుక్కానిగా మారింది. ఆ ఉద్యమ నాయకుడు మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ జూనియర్‌.  తొలుత తాను గాంధీజీని సీరియస్‌గా పట్టించుకోలేదని అయితే ఉప్పు సత్యాగ్రహం, ఆయన నిరాహార దీక్షలు, సత్యాగ్రహ భావన ఆకర్షించాయని తరువాత గాంధీ సిద్ధాంతాలను లోతుగా అన్వేషించడం మొదలైందని, చివరకు గాంధీపట్ల ఆయన ఉద్యమంపట్ల ఆరాధనగా మారిందని అదే తన ఉద్యమాన్ని నడిపించిందని మార్టిన్‌ విశ్లేషించారు. 

దండి సత్యాగ్రహానికి 75 ఏళ్ళ పండుగ :
1980లో దండియాత్ర స్వర్ణోత్సవం, 2005లో 75 ఏళ్ళ పండుగ జరి గాయి. ఈ రెండు సందర్భాలలో భారత ప్రభుత్వం ప్రత్యేక తపాలా బిళ్ళలను విడుదల చేసింది. మహాత్మాగాంధీ మునిమనుమడు తుషార్‌ గాంధీ 2005లో చేసిన రిఎనాక్టిమెంట్‌ కార్యక్రమం ప్రపంచ వ్యాప్తంగా వార్తలకెక్కింది. 9 దేశాల నుంచి 900 మందితో ప్రారంభమైన తుషార్‌ గాంధీ బృందం అప్పటి దండి సత్యాగ్రహం దారిలోనే కదిలితే రోజు రోజుకూ కొత్తవారు వచ్చి చేరడంతో ఆ సంఖ్య కొన్ని వేలుగా పెరిగింది. దీనిని న్యాయం, స్వాతంత్య్రం కోసం చేసిన అంతర్జాతీయ నడక అని నామకరణం చేశారు. సబర్మతీ ఆశ్రమం నుంచి దండి దాకా సాగే ఈ దారిని ఇపుడు దండి దారి (దండి పాత్‌) అని నామకరణం చేశారు. 2019 జనవరి 30వ తేదీన దండిలో నేషనల్‌ సాల్ట్‌ సత్యాగ్రహ మెమోరియల్‌  మ్యూజియంను భారత ప్రభుత్వం ప్రారంభించింది.సామాన్యులను విశేషంగా ప్రభావితం చేసే విషయం కోసం సామాన్యులందరినీ కలుస్తూ దానికి నడకను సాధనంగా చేసుకున్న మహాఉద్యమ పథికుడు మహాత్మాగాంధీ. ఇప్పటికీ ఈ విశేషాలు తలుచుకుంటే, తవ్వి పోసుకుంటే ఆశ్చర్యకరం... స్ఫూర్తిదాయకం!

వ్యాసకర్త:డాక్టర్‌ నాగసూరి వేణుగోపాల్‌
ఆకాశవాణి మాజీ ఉన్నతోద్యోగి
మొబైల్‌ : 94407 32392 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top