అస్త్రాలు లేకుండా గెలిచేదెలా? 

Dileep Reddy Article On Center Behaviour In Providing Vaccines To Private Hospitals - Sakshi

సమకాలీనం

రాష్ట్రాలు కోరిన డోసులు ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రయివేటు ఆస్పత్రులు, కార్పొరేట్లకు టీకామందు అందుబాటులోకి తేవడం ఆశ్చర్యకరం.18 ఏళ్లు పైబడ్డ ఎవరికైనా ప్రయివేటు ఆస్పత్రులు టీకామందు ఇవ్వొచ్చన్న వెసులుబాటుతో సమీకరణాలు మారుతున్నాయి. పౌరులకు ఉచితంగా టీకాలిస్తున్న రాష్ట్రాలు కొంటామన్నా, కోరినన్ని టీకాడోసులు అందివ్వలేనపుడు, ప్రయివేటు పంపిణీ ఎలా సమంజసం అని ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి లాంటి వాళ్లు ప్రశ్నిస్తున్నారు. కేంద్రం వద్ద సమాధానం లేదు. పాలకులు బేషజాలకు వెళ్లకుండా తప్పులు అంగీకరించడం, సరిదిద్దుకోవడమే సమస్యకు పరిష్కారం.

సత్తా ఉంది, సమయమే లేదు. ఆయుధం తెలుసు, అవసరమైనన్ని లేవు. ఈ యుద్దం గెలిస్తేనే నిలుస్తాం, యుద్ధవ్యూహమే లోపం. శత్రువు రూపం మార్చుకుంటూ చేస్తున్న దాడిలో రెండో కెరటం కూల నేలేదు, ముంచుకొస్తున్న మూడో కెరటం పొడ భయపెడుతోంది. కోవిడ్‌–19పై పోరాటంలో మనదేశ పరిస్థితి ఇది. ‘కోవిడ్‌ యుద్ధం గెలిచేది టీకా (వ్యాక్సినేషన్‌) అస్త్రంతోనే!’ వైద్యులు, శాస్త్రవేత్తల నుంచి పాలకుల వరకు అంతా ఒక గొంతుతో చెబుతున్నదిదే! ప్రధాని మోదీ కూడా బుద్ధపూర్ణిమ సందర్భంగా ఓ కీలకోపన్యాసం చేస్తూ, ఈ పోరులో టీకాయుధమే శరణ్యమని చెప్పారు. మరి, సమయం దొరి కినా ఆయుధాలెందుకు సమ కూర్చుకోలేదు? కారణం యుద్ధ వ్యూహం కొరవడటమే! యుద్ధమని తెలిశాక, వ్యూహం ఏర్పాటు చేసుకోకపోవడం పెద్ద తప్పు. ఇప్పుడు తప్పొప్పులు సమీక్షించుకునే సందర్భం కాదు, సమయమూ లేదు. ఎందుకంటే, ప్రమాదం మరింత తీవ్రతతో ముంచుకు వస్తోంది. ఉపద్రవాన్ని తట్టుకునే రక్షణ వ్యవస్థను ముందే ఏర్పాటు చేసుకోవాలి. రాగల ప్రమాద తీవ్రత తగ్గించే భూమిక సిద్ధం చేయాలి. మనకున్న చతురంగ బలాల్ని, బల గాల్ని ఉపయోగించి శత్రువును ఢీకొట్టాలి. యుద్ధ ఎత్తుగడల్లో తేఢా లొస్తే అసలుకే మోసం! కోవిడ్‌ను ఎదుర్కొనే క్రమంలో... టీకా ప్రక్రియ తగినంత వేగంగా, నిర్ణీత గడువులోగా జరగకపోతే ఓ ప్రమా దముంది. కరోనా వైరస్‌ తన రూపాన్ని మార్చుకుంటూ వైవిధ్యాలతో దెబ్బకొట్టే ఆస్కారాన్ని నిపుణలు హెచ్చరిస్తున్నారు. నేటికి సరిగ్గా నాలుగు నెలల కిందట, జనవరి 28న దావోస్, ‘ప్రపంచ ఆర్థిక వేదిక’ ఆన్‌లైన్‌ భేటీనుద్దేశించి మాట్లాడుతూ మన ప్రధాని చేసిన ప్రకటన లోని గాంభీర్యత నేడేమైంది? టీకా ప్రక్రియ మందగించి, టీకామందు దొరక్క, సత్వరం సమకూర్చుకునే స్వదేశీ–విదేశీ మార్గాలు మూసుకు పోయి, కేంద్ర–రాష్ట్రాల మధ్య పొరపొచ్చాలొచ్చి... ఈ గందరగోళం ఎందుకేర్పడింది? చిక్కుముడి వీడేదెలా? ఆ రోజున ఆయన ఏమ న్నారంటే, ‘ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్‌ ఉత్పత్తిదారు భారత్‌!... ఇపుడు కరోనా వైరస్‌ నుంచి ప్రపంచాన్ని కాపాడే బాధ్యతను నెత్తి కెత్తుకుంటోంది. దేశ ఆర్థిక చరిత్రలో ఒక కీలక మలుపు కానుంది. భారత్‌ గొప్పతనం మరోమారు కీర్తించబడుతుంది’ అని. కానీ, వాస్త వాలు నేడెందుకు భిన్నంగా మారాయి? టీకా మందు కోసం ఇంటా, బయటా అయ్యా! అప్పా! అని దేబిరించాల్సిన పరిస్థితి ఎలా దాపు రించింది? టీకా కోసం దేశమంతా నిరీక్షించాల్సిన దుస్థితి ఎందు కొచ్చింది? ‘18 ఏళ్లు దాటిన వారికి రేపటి నుంచి టీకా’ అని, ఎందుకు వెనక్కి తగ్గాల్సి వచ్చింది? ఈ ప్రశ్నలకు, సగటు భారతీయులు సమా ధానం అడుగుతున్నారు.

టీకా విధానమే కరువు
దేశంలో టీకామందు విధానమే సవ్యంగా లేదు. ఫలితంగా ఉత్పత్తి, పంపిణీ, రేపటిపై ఆశ అంతా అస్పష్టమే! రాజ్యాంగం 21 అధికరణం ప్రకారం జీవించే హక్కులో భాగంగా ఖర్చు భరించగలిగే, అందు బాటులో ఉండే, వైద్యారోగ్య సదుపాయాలు పౌరులకు సమానంగా కల్పించాలి. ఏదీ! ఎక్కడ? కోవిడ్‌ ప్రమాద తీవ్రత తెలిసీ, టీకా ప్రక్రియ విషయంలో కేంద్రం బాధ్యతల నుంచి వైదొలగినట్టే వ్యవ హరించింది. ఏడాది కిందటే కోవిడ్‌ మహమ్మారి మనల్ని అంటు కున్నా, ఈసారి బడ్జెట్‌లో టీకామందు కోసం కేంద్రం తన వంతుగా రూపాయి కేటాయించలేదు. ముప్పై అయిదు వేల కోట్ల రూపాయలు అప్పు/గ్రాంట్‌ కింద తానిచ్చేట్టు, వ్యయ బాధ్యతను రాష్ట్రాలకు బద లాయించింది. స్వతంత్ర భారతంలో ఏడు దశాబ్దాలు పాటించిన, విజయవంతమైన ‘సామూహిక టీకా’ పద్ధతికి తిలోదకాలిచ్చింది. మశూచి, పోలియో వంటి టీకాలను ఇన్నేళ్లు కేంద్రం ఇదే పద్ధతిన ఇచ్చింది. టీకామందు కేంద్రం సమకూర్చేది, ఎక్కడికక్కడ పంపిణీ– నిర్వహణ రాష్ట్రాల బాధ్యతగా అమలైంది. కానీ, ఈసారి టీకా మందును రాష్ట్రాలే సమకూర్చుకోవాలని తేల్చిచెప్పింది. జనాభా దామాషా ప్రకారం ఎవరికెంత అనే వాటాలు మాత్రం తానే నిర్ణయి స్తానంది. కానీ, దేశంలో... ఉత్పత్తికి సవ్యమైన విధానం లేక, అను మతించిన రెండు కంపెనీలు, సీరమ్‌ (కోవిషీల్డ్‌), భారత్‌ బయోటిక్స్‌ (కోవాగ్జిన్‌) తగు ఉత్పత్తి చేయలేక, వారికి కేంద్రం ఇతోధిక సహాయం చేయక, రాష్ట్రాలు కోరినంత టీకామందు వారు అందించలేక, ప్రపంచ మార్కెట్ల నుంచి గ్లోబల్‌ టెండర్లతో రాష్ట్రాలు నేరుగా టీకామందు సమ కూర్చుకునే వెసులుబాటు లేక... నానా ఇబ్బందులు ఎదురవుతు న్నాయి. రెండు డోసుల టీకా మందే పరిష్కారమని ప్రపంచమంతటా రుజువవుతుంటే, ఇక్కడ టీకామందే దొరకటం లేదు. 

కొండంత కొత్త లక్ష్యం
వచ్చే ఆగస్టు–డిసెంబర్‌ నడుమ 216 కోట్ల డోసుల టీకామందు సమ కూర్చుకునే లక్ష్యాన్ని కేంద్రం ప్రకటించింది. అంటే, నూరు కోట్ల మందికి పైగా రెండు డోసులూ అందుతాయన్న మాట! ఇప్పటికున్న అనుభవాన్ని బట్టి దేశీయ సీరమ్, భారత్‌ బయోటిక్స్‌ల ఉత్పత్తి సామర్థ్యం ఆ చాయల్లో కూడా లేదు. ప్రపంచ మార్కెట్‌ విదేశీ ఉత్పత్తి దారుల నుంచి సమకూర్చుకోవడానికి ఎన్నో ప్రతిబంధకాలున్నాయి. నిజానికి ఈ ఇబ్బందులు రాకూడదు. సరైన ముందస్తు వ్యూహం లేక పోవడం, అవసరాలకు తగ్గట్టు సకాలంలో స్పందించకపోవడం వల్లే ఈ దుస్థితి. దేశంలో టీకాప్రక్రియ జనవరి మధ్యలో ప్రారంభించి నాలుగు నెలలు దాటినా ఇప్పటికి సుమారు 15 కోట్ల మందికి ఒక డోసు, 5 కోట్ల మందికి రెండు డోసుల టీకామందు ఇచ్చాం. ఒక దశలో రోజుకు 40 లక్షల వరకు టీకాలిచ్చిన ప్రక్రియ మందగించి, ఇపుడు రోజూ అయిదారు లక్షలకు పడిపోయింది. కొత్త లక్ష్యాలు అందుకోవడం, అయిదు నెలల్లో (150 రోజులు) రోజూ సగ టున 1.4 కోట్ల మందికి టీకాలిస్తే తప్ప సాధ్యపడదు. మే నెల మొత్తం 6 కోట్లు కోవిషీల్డ్‌ , 2 కోట్లు కోవాగ్జిన్‌ టీకా డోసుల ఉత్పత్తే జరిగింది. నెలలో 5 కోట్ల మందికి టీకాలిచ్చినట్టు అధికారుల కథనం. మరో అయిదు స్వదేశీ కంపెనీల కొత్త టీకాలు, ఇంకా క్లినికల్‌ ట్రయల్స్‌ దశలోనే ఉన్నాయి. రష్యా టీకా స్పుత్నిక్‌–వీని దేశంలో వాడేందుకు కేంద్రం ఇప్పటికే అనుమతించినా దిగుమతి, పంపిణీ మందకొడిగా సాగు తోంది. ఇతర అంతర్జాతీయ ఉత్పత్తిదారుల నుంచి గ్లోబల్‌ టెండ ర్లతో టీకామందు సమకూర్చుకునేందుకు డజన్‌ రాష్ట్రాలు చేసిన యత్నా లన్నీ విఫలమయ్యాయి. ఫైజర్, మోడెర్నా వంటివి తాము రాష్ట్రాలతో ఒప్పందాలు చేసుకోలేమని, కేంద్రంతోనే వ్యవహరించగల మని ప్రక టించాయి. తాము సంప్రదించినా, ఇప్పటికే పలు దేశాలతో కుదుర్చు కున్న ఒప్పందాల దృష్ట్యా, తమ మిగులు ఉత్పత్తి ఏమైనా ఉంటే ఇవ్వగలమని సదరు కంపెనీలు పేర్కొన్నట్టు కేంద్రం వెల్లడించింది.

ప్రయివేటు విక్రయాలు పుండుమీద కారం
రాష్ట్రాలు కోరిన డోసులు ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రయివేటు ఆస్ప త్రులు, కార్పొరేట్లకు టీకామందు అందుబాటులోకి తేవడం ఆశ్చర్య కరం. మే 1 నుంచి 18–44 ఏళ్ల మధ్య వయస్కులకు ఇస్తామని ప్రక టించీ, తగు ఉత్పత్తి లేక పంపిణీని ప్రభుత్వాలు నిలిపివేశాయి. 45 ఏళ్లు పైబడ్డవారికి టీకాలివ్వడంపై ఇప్పుడు దృష్టి కేంద్రీకరించాయి. ఈ స్ఫూర్తిని తాజా నిర్ణయం దెబ్బతీస్తోంది. 18 ఏళ్లు పైబడ్డ ఎవరికైనా ప్రయివేటు ఆస్పత్రులు టీకామందు ఇవ్వొచ్చన్న వెసులుబాటుతో సమీకరణాలు మారుతున్నాయి. టీకామందు నల్లబజారుకు చేరే ఆస్కారాలు పెరిగాయి. ఇది సామాజికంగానూ అంగీకారం కాదని, అసమానతలకు దారితీస్తుందనే విమర్శ వస్తోంది. పౌరులకు ఉచి తంగా టీకాలిస్తున్న రాష్ట్రాలు కొంటామన్నా, కోరినన్ని టీకాడోసులు అందివ్వలేనపుడు, ప్రైవేటు పంపిణీ ఎలా సమంజసమని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌లాంటి వాళ్లు ప్రశ్నిస్తున్నారు. కేంద్రం వద్ద సమాధానం లేదు. పాలకులు బేషజాలకు వెళ్లకుండా తప్పులు అంగీకరించడం, సరిదిద్దుకోవడం, తగిన పంథాలో సాగడమే సమస్యకు పరిష్కారం. సరైన అస్త్రాన్ని, సకాలంలో, గురిచూసి సంధిస్తేనే ఏ యుద్ధమైనా గెలి చేది! ఇది తప్పక గెలిచితీరాల్సిన యుద్ధం!!


దిలీప్‌ రెడ్డి
ఈ–మెయిల్‌ : dileepreddy@sakshi.com

 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top