దేహం తేలికైంది.. జీవితం బరువైంది

UK Poet Millie Sansoye Inspirational Story - Sakshi

మిల్లీ సాన్‌సోయీ రచయిత్రి. యూకేలో మీడియారంగంలో కెరీర్‌ని నిర్మించుకుంటోంది. ఇరవై ఏడేళ్ల మిల్లీ పెద్ద ప్రమాదం నుంచి బయటపడింది. మృత్యువు అంచుల వరకూ వెళ్లి వచ్చింది. ఒక రకంగా ముంచుకు వస్తున్న మృత్యువు బారిన పడకుండా ఉండడానికి పెద్ద పోరాటమే చేసింది. పదహారేళ్ల వయసులో 33 కిలోల బరువుతో జీవితాన్ని బరువుగా లాక్కు వచ్చింది మిల్లీ. ఇదంతా చూస్తుంటే ఏ ప్రాణాంతక వ్యాధి వచ్చి తగ్గిందో అనుకుంటాం. కానీ ‘‘అంతా నేను చేతులారా చేసుకున్నదే’’ అంటుంది మిల్లీ. ‘‘అదృష్టవశాత్తూ నేను మృత్యువు ఒడిలోకి జారిపోవాల్సిన సమయానికి రెండు వారాల ముందు డాక్టర్‌ రక్షణలోకి వెళ్లగలిగాను కాబట్టి వ్యాధి బారి నుంచి బయటపడ్డాను. ఆరోగ్యాన్ని పొందడం కోసం నేను చేసిన పోరాటాన్ని మీతో పంచుకుంటాను. ఎందరో అమ్మాయిలు నా అనుభవం నుంచి పాఠాలు నేర్చుకోవచ్చు’’ అంటోంది మిల్లీ సాన్‌సోయీ.

కేలరీల దహనమే ధ్యేయం
‘‘చిన్నప్పటి నుంచి బొద్దుగా ఆరోగ్యంగా ఉండేదాన్ని. పద్నాలుగేళ్ల వయసులో ఎదురైన ఒక వెక్కిరింత... నా మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపించింది. ఎలాగైనా సరే బరువు తగ్గాలి, నన్ను ఎగతాళి చేసిన అమ్మాయికంటే స్లిమ్‌గా మారాలనే పట్టుదల కలిగింది. ఆహారంలో మార్పులు చేసుకుని, జిమ్‌లో వర్కవుట్‌లు చేస్తూ ఆరోగ్యకరంగా బరువు తగ్గాను. డ్రెస్‌ సైజ్‌ కూడా మారింది. ఆ మార్పును గుర్తిస్తారని ఆశించాను. కానీ అలా జరగలేదు.

దాంతో ఇంకా మొండితనం వచ్చేసింది. తీవ్రంగా బరువు తగ్గే ప్రయత్నాలు చేస్తున్నాను. అంతలో ఒక యాక్సిడెంట్‌. మోకాలికి గాయమైంది. జిమ్‌లో వర్కవుట్‌ సాధ్యం కాదు. మరెలా? ఆహారం పరిమాణం బాగా తగ్గించేశాను. కేలరీలు కొలత చూసుకోవడం, దేహంలోకి వెళ్లిన కేలరీలను దహింప చేయడానికి విపరీతంగా నడవడం దినచర్యగా మారింది. రాత్రి పదకొండు గంటల నుంచి తెల్లవారు జామున రెండు వరకు నడుస్తూనే ఉండేదాన్ని. క్రమంగా పీలగా మారిపోయాను.

అయినా సరే... ఎగతాళి చేసిన అమ్మాయి కంటే సన్నగా అయ్యాను. కానీ ఆమె నన్ను ఏడిపించడం మానలేదు. ‘మిల్లీ ఇప్పుడు నీ కంటే సన్నగా ఉంది కదా? ఇంకా ఎందుకు ఏడిపిస్తావ్‌’ అని నా ఫ్రెండ్‌ నిలదీసింది. అప్పుడా అమ్మాయి ‘మిల్లీ అప్పట్లో లావుగా ఉండేది, ఇప్పుడు పేషెంట్‌లా ఉంది’ అని వెక్కిరించింది. నాకప్పుడు ఏమీ అర్థం కాలేదు. అసలు నేను ఎలా ఉండాలి? అనే సందేహం. నేను మరీ సన్నబడడంతో ఇంట్లో వాళ్లు నన్ను డాక్టర్‌ దగ్గరకు తీసుకువెళ్లారు.

ఇక... రెండు వారాలే!
పద్నాలుగేళ్ల వయసులో పడిన ఒక విషబీజం పదహారేళ్లు వచ్చేసరికి ఊడలుగా విస్తరించి ఆరోగ్యాన్ని కబళించింది. ‘దేహంలో అంతర్గత అవయవాల పనితీరు క్షీణించింది. మరో రెండు వారాలకంటే బతకడం కష్టం’ అని చెప్పారు డాక్టర్‌. నా ఆరోగ్యం కోసం అమ్మ పడుతున్న తపనను చూసి అమ్మకోసం అనొరెక్సియా, ఈటింగ్‌ డిజార్డర్‌ సమస్యల నుంచి బయటపడడానికి పెద్ద పోరాటమే చేశాను. ఒక వేసవి మొత్తం హాస్పిటల్‌లోనే ఉన్నాను. బరువు 33 కిలోల నుంచి 51 కిలోలకు పెరిగిన తర్వాత బయటకు వచ్చాను. ఆ తర్వాత చేసిన మొదటి పని స్కూలు మారడం. 

ఇదొక పాఠం
నా అనారోగ్యం గురించి తెలిసిన తర్వాత మా అమ్మమ్మ నన్ను చూడడానికి వచ్చింది. అప్పుడామె అన్న మాటను నేను మర్చిపోలేను. ‘అందరి దృష్టి నీ మీద ఉండాలని నువ్వు కోరుకుంటే నువ్వు ఏదైనా సాధించు. అంతే కానీ అనారోగ్యంతో కాదు. పని చేసుకునే వాళ్లను చూడు, వాళ్లకు దేహాకృతి గురించిన పట్టింపు ఉండదు. తమ పనితోనే గుర్తింపు తెచ్చుకుంటారు’ అని చెప్పింది. స్కూల్‌ చదువు పూర్తి చేసి కాలేజ్‌లో చేరాను. చదువు పూర్తయ్యేటప్పటికి జీవితం చాలా చిన్నదనే వాస్తవం తెలిసింది.

అనొరెక్సియా, ఈటింగ్‌ డిజార్టర్‌ల వెనుక అసలైన జీవితం ఉందని కూడా తెలిసింది. ఇప్పుడిలా సంతోషంగా ఉన్నాను. నా అనుభవం ఎందరికో పాఠంగా ఉపయోగపడుతుందని నమ్ముతున్నాను’’ అని చెప్పింది మిల్లీ సాన్‌సోయీ. మీడియా కూడా ‘సన్నబడడానికి సులువైన మార్గాలు’ అనే కథనాలకు బదులు ఆరోగ్యంగా జీవించడానికి అనువైన మార్గాలను సూచించాలని మిల్లీ కోరుతోంది. అంతేకాదు... తనకు ఎదురైన చేదు అనుభవం నుంచి బాడీ షేమింగ్‌కు పాల్పడే ఆలోచనను పిల్లల్లో మొగ్గలోనే తుంచేయాల్సిన అవసరం ఉందని కూడా సమాజం తెలుసుకోవాలి.
  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top