Tokyo Olympics: రీసైక్లింగ్‌కు దిక్సూచి.. టోక్యో ఒలింపిక్స్‌

Tokyo Olympics: Japan Inspires World Waste Management Recycle - Sakshi

Pudami Sakshiga 2023: జపాన్‌ రాజధాని టోక్యోలో 2020లో జరిగిన ఒలింపిక్స్‌ రీసైక్లింగ్‌కే దిక్సూచిగా నిలిచిపోతాయి. ఒలింపిక్స్‌ నిర్వహణలో రీసైక్లింగ్‌తో జపాన్‌ చేసిన ఏర్పాట్లు పుడమి భవిష్యత్తునే నిలబెట్టాయి. ఒలింపిక్స్‌లో రీసైక్లింగ్‌ పోటీలు, పతకాలు ఉండకపోవచ్చు గాని, ప్రపంచాన్నే విస్మయపరచే రీసైక్లింగ్‌ ప్రాజెక్టులతో జపాన్‌ మహా విజేతగా నిలిచి, యావత్‌ ప్రపంచానికే పర్యావరణ సుస్థిర మార్గాన్ని చూపింది.

టోక్యో ఒలింపిక్స్‌ను ప్రపంచం నలుమూలల నుంచి దాదాపు 300 కోట్ల మందికిపైగా జనాలు వీక్షించారు. వాళ్లు వీక్షించినది కేవలం క్రీడలను మాత్రమే కాదు, ఆ క్రీడల నిర్వహణలో ‘సూక్ష్మంలో మోక్షం’లా జపాన్‌ ప్రభుత్వం రీసైక్లింగ్‌తో చేసిన అద్భుతమైన ఏర్పాట్లను కూడా. జపాన్‌ సాంకేతిక పరిజ్ఞానం ఏ స్థాయిలో పుడమికి హితవుగా ఉందో 2020 నాటి ఒలింపిక్స్‌ క్రీడల కార్యక్రమాలే ప్రత్యక్ష సాక్షిగా నిలుస్తాయి.

ఒలింపిక్స్‌ క్రీడా కార్యక్రమాల కోసం జపాన్‌ పూర్తిగా పునరుత్పాదక వనరుల నుంచి ఉత్పత్తయిన విద్యుత్తునే ఉపయోగించుకుంది. ఎక్కువగా సౌర విద్యుత్తును, బయోమాస్‌ నుంచి ఉత్పత్తయిన విద్యుత్తును ఈ క్రీడల కోసం ఉపయోగించుకోవడం విశేషం.

కలపతో ఒలింపిక్స్‌ విలేజ్‌
అలాగే, ఒలింపిక్స్‌ విలేజ్‌ను స్థానిక అధికారులు విరాళంగా ఇచ్చిన కలపతో నిర్మించారు. ఇందులో వాడిన కలప తర్వాత రీసైక్లింగ్‌కు పనికొచ్చేదే! ఒలింపిక్స్‌ క్రీడాకారుల కోసం నిర్మించిన వసతి భవనాలను, కార్యక్రమాలు మొత్తం ముగిశాక స్థానిక జనాభాకు నివాసాలుగా పనికొచ్చేలా నిర్మించారు. రీసైకిల్డ్‌ ప్లాస్టిక్‌తో పోడియంలు మెడల్స్‌ ప్రదర్శన సమయంలో క్రీడాకారులు ఉపయోగించే పోడియంలను కూడా జపాన్‌ ప్లాస్టిక్‌ వ్యర్థాలతోనే తయారు చేసింది.

ప్రతి పోడియంలోని చిన్న చిన్న ఘనాకారపు మాడ్యూల్స్‌ కూడా రీసైకిల్‌ చేసిన ప్లాస్టిక్‌ వ్యర్థాల నుంచి తయారైనవే! ఒలింపిక్స్‌ పోడియంల తయారీకి జపాన్‌ 24.5 టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలను వినియోగించింది. ఈ వ్యర్థాలను ప్రజల ఇళ్ల నుంచి సేకరించింది. ఒలింపిక్స్‌–2020 క్రీడోత్సవాలకు ఆతిథ్యమిచ్చే అవకాశం దక్కగానే, జపాన్‌ దీనికోసం 2018 నుంచే ఏర్పాట్లను ప్రారంభించింది.

సౌరఫలకాలు కూడా రీసైక్లింగ్‌కు పనికొచ్చేవే!
ఒలింపిక్స్‌ నిర్వాహక కమిటీ కొత్త జాతీయ స్టేడియం నిర్మాణానికి ఉపయోగించిన ప్లైవుడ్‌ ప్యానెల్స్‌ తయారీకి 87 శాతం కలపను ఆగ్నేయాసియా వర్షారణ్యాల నుంచి సేకరించారు. స్టేడియం పైకప్పుకు అమర్చిన సౌరఫలకాలు కూడా రీసైక్లింగ్‌కు పనికొచ్చేవే! తక్కువ వనరులతో, తక్కువమంది మనుషులతో, తక్కువ గంటల్లో పుడమికి వీలైనంత తక్కువ హానిచేసే సాంకేతిక పరిజ్ఞానంతో ఒలింపిక్స్‌ వంటి భారీ కార్యక్రమాన్ని నిర్వహించడం సాధ్యమేనని జపాన్‌ నిరూపించింది.

రీసైక్లింగ్‌ టెక్నాలజీతో టోక్యో ఆవిష్కరించిన ప్రాజెక్టులన్నీ పుడమికి హితమైనవే! వాటిలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన కొన్నింటిని పరిశీలిద్దాం... అథ్లెట్ల కోసం కార్డ్‌బోర్డ్‌ మంచాలు ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు వచ్చిన అథ్లెట్ల విశ్రాంతి కోసం జపాన్‌ వినూత్నమైన ఏర్పాట్లు చేసింది. అథ్లెట్లు నిద్రించేందుకు ప్రత్యేకంగా హైరెసిస్టెంట్‌ కార్డ్‌బోర్డ్‌ మంచాలను ఏర్పాటు చేసింది.

మంచాల తయారీకి
ఎన్నిసార్లయిన రీసైక్లింగ్‌కు పనికొచ్చే పాలిథిన్‌ ఫైబర్లతో ఈ మంచాల తయారీ జరిగింది. శరీరానికి ఎగువ, మధ్య, దిగువ భాగాల్లో హాయినిచ్చే విధంగా మూడు వేర్వేరు విభాగాలతో ఈ మంచాలను రూపొందించారు. అంతేకాదు, ప్రతి అథ్లెట్‌ శరీరాకృతికి అనుగుణంగా వారు మాత్రమే ఉపయోగించుకునేలా ఈ కార్డ్‌బోర్డ్‌ మంచాలను, వాటిపై పరుపులను తయారు చేశారు.

ఒలింపిక్స్‌ క్రీడలు ముగిశాక కార్డ్‌బోర్డ్‌ను పేపర్‌ ఉత్పత్తులుగా, పరుపులను ప్లాస్టిక్‌ ఉత్పత్తులుగా రీసైకిల్‌ చేసే ఉద్దేశంతో జపాన్‌ ప్రభుత్వం వీటిని తయారు చేయించింది. పాత సెల్‌ఫోన్లతో పతకాలు! ఒలింపిక్స్‌ విజేతలకు పతకాలను ఆతిథ్య దేశమే ఇవ్వడం ఆనవాయితీ. ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చే దేశాలు విజేతలకు ఇవ్వాల్సిన పతకాలను ప్రత్యేకంగా తయారు చేయిస్తుంటాయి.

వాటికి కావలసిన కంచు, వెండి, బంగారు లోహాలను సమకూర్చుకుంటుంటాయి. జపాన్‌ మాత్రం పతకాల తయారీకి ప్రత్యేకంగా ప్రయాస పడలేదు. పతకాల తయారీ కోసం ప్రజల నుంచి వాడిపడేసిన పాత సెల్‌ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలను విరాళంగా సేకరించింది. వాటి నుంచి వేరుచేసిన లోహాలతోనే విజేతలకు పతకాలను తయారు చేయించింది. ప్రజల నుంచి విరాళంగా వచ్చిన వాటిలో ఏకంగా 60.21 లక్షల పాత నోకియా ఫోన్లు ఉండటం విశేషం.

అల్యూమినియం వ్యర్థాలతో ఒలింపిక్‌ టార్చ్‌
రీసైక్లింగ్, రీయూజ్‌ సాంకేతికతకు జపాన్‌ అందించిన ఒలింపిక్స్‌ పతకాలు వినూత్న ఉదాహరణగా నిలుస్తాయి. అల్యూమినియం వ్యర్థాలతో ఒలింపిక్‌ టార్చ్‌! ఒలింపిక్స్‌లో కీలకం ఒలింపిక్‌ టార్చ్‌. ఒలింపిక్స్‌ టార్చ్‌ తయారీకి జపాన్‌ అల్యూమినియం వ్యర్థాలను ఉపయోగించింది. జపాన్‌లో 2011లో భూకంపం, సునామీ సంభవించాక అప్పట్లో నిర్వాసితుల కోసం నిర్మించిన తాత్కాలిక గృహాల నుంచి సేకరించిన అల్యూమినియం వ్యర్థాలనే ఒలింపిక్‌ టార్చ్‌ తయారీకి వాడారు.

జపాన్‌ జాతీయ పుష్పం సాకురా చెర్రీ పూవును పోలినట్లు ఐదువిభాగాలుగా ముడుచుకున్న ఒలింపిక్‌ టార్చ్‌ను తయారు చేశారు. స్థానిక రవాణాకు రీసైకిల్‌ వాహనాలు జపాన్‌కు చెందిన వాహనాల తయారీ సంస్థ టయోటా డ్రైవర్‌లేని వాహనాలను త్వరలోనే రోడ్ల మీదకు తెచ్చేందుకు సులువైన మార్గాలను అన్వేషిస్తోంది.

రీసైకిల్డ్‌ ఎలక్ట్రిక్‌ వాహనాలే
అదే స్ఫూర్తితో ఒలింపిక్స్‌ క్రీడాకారులను వసతి ప్రదేశం నుంచి క్రీడా స్థలికి, క్రీడా మైదానం నుంచి వసతి ప్రదేశానికి, టోక్యో నగరంలో వారు స్థానికంగా తిరగడానికి వీలుగా జపాన్‌ పూర్తిగా రీసైకిల్డ్‌ ఎలక్ట్రిక్‌ వాహనాలనే ఉపయోగించింది. పెద్ద తలుపులు, సులువుగా ఎక్కి దిగడానికి వీలుగా వీటి నిర్మాణం ఉండటంతో క్రీడాకారులు వీటిలో సౌకర్యవంతంగా ప్రయాణించగలిగారు. ఒలింపిక్స్‌ తర్వాత టోక్యోలోను, చుట్టుపక్కల ప్రాంతాల్లోను 42 పెద్దస్థాయి క్రీడా కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమాల్లోనూ జపాన్‌ పూర్తిగా రీసైకిల్డ్‌ ఎలక్ట్రిక్‌ వాహనాలనే ఉపయోగించింది.
-నరసింహారావు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top