కర్ణుడు స్వతహాగా మంచివాడే...కానీ...!!!

Things that Karna should not do for the praise of Duryodhana - Sakshi

శతక నీతి – సుమతి

మహాభారతంలో కర్ణుడి వ్యక్తిత్వాన్ని పరిశీలిస్తే.... ఆయన పుట్టుకతో చెడ్డవాడు కాడు. కుంతీదేవికి, సూర్యభగవానుడికి జన్మించిన వాడు. నిజానికి పాండవులు యుద్ధంలో గెలుస్తారని ముందే తెలిసున్నవాడు. కురుసభలో రాయబారం ముగించుకుని శ్రీ కృష్ణ పరమాత్మ తిరిగి వెడుతూ కర్ణుడిని రథం ఎక్కించుకుని మాట్లాడుతూ వెళ్ళాడు. అప్పుడు కర్ణుడు –‘‘ధర్మరాజు నిజంగా ధర్మం ఎరిగినవాడు. దాన్ని పాటించేవాడు. ధర్మం అంతా పాండవులవైపే ఉంది. అందుకే సాక్షాత్‌ భగవంతుడవయిన నువ్వు ఆ పక్షాన ఉన్నావు. వారు గెలిచి తీరుతారు. ధర్మరాజు పట్టాభిషిక్తుడవుతాడు. దుర్యోధనాదులందరూ కూడా యుద్ధభూమిలో మడిసిపోతారు. ఎవరూ మిగలరు. కానీ దుర్యోధనుడిని నమ్మి ఇంతకాలం ఉండి అతడిని విడిచిపెట్టి రాలేను.  నాకు కూడా మరణమే శరణ్యం. నేను కూడా అక్కడ మరణించాల్సిందే’’ అన్నాడు.

అంటే – పాండవుల పక్షాన ధర్మం ఉందనీ, వారు గెలుస్తారని, వారి చేతిలో కౌరవులు మరణిస్తారని, తాను కూడా అక్కడే చనిపోతానని కర్ణుడికి ముందే తెలుసు. ఇన్ని తెలిసిన యోధానుయోధుడయిన కర్ణుడు జీవితాంతం తప్పులు చేస్తూ, ఎందుకు ప్రవర్తించాల్సి వచ్చింది !!! దుర్యోధనుడు పరమ క్రూరుడు. దుర్మార్గుడు. బద్దెనగారే  మరొక పద్యంలో ‘‘తలనుండు విషము ఫణికిని, వెలయంగా తోకనుండు వశ్చికమునకున్‌ తలతోక యనకనుండును ఖలునకు నిలువెల్ల విషము..’’ అంటారు... ఖలుడు అంటే దుర్మార్గుడు.

అటువంటి వాడికి మంచి ఆలోచనలు ఎలా వస్తాయి?  అదే ధర్మరాజు పక్కన ఉంటే ...మంచి పనులు చేస్తూ ఉంటాడు.. అప్పడు ఆయన పక్కన ఉన్నవారికి కూడా అటువంటి మంచి పనులు చేయడానికి లేదా కలిసి పాలు పంచుకొనే అవకాశం దొరుకుతుంది.  అలా చేస్తే ధర్మరాజు కూడా సంతోషిస్తూ ఉంటాడు. దుర్యోధనుడితో కలిసి ఉన్నందుకు అతని మెప్పుకోసం కర్ణుడు చేయకూడని పనులన్నీ చేస్తూ వెళ్ళాడు. చిట్టచివరకు ఏమయ్యాడు ...యుద్ధభూమిలో అర్జునుడి చేతిలో మరణాన్ని పొందాడు.

అలాగే మనిషి ఎంత మంచివాడయినా, ఎంత చదువు చదువుకొన్నవాడయినా, ఎన్ని ఉత్తమ గుణాలు కలిగిఉన్నా... ఒక దుర్మార్గుడితో స్నేహం చేస్తే మాత్రం ఉన్న పేరుప్రతిష్ఠలు కూడా నశించిపోతాయి. సన్మార్గంలో ఉన్న వ్యక్తి దుర్మార్గులతో చేరితే... నల్లులు పట్టిన మంచం ఎలా దెబ్బలు తింటుందో అలాగే ఉంటుందని సుమతీ శతకకారుడు బద్దెనచెబుతూ ‘‘కొంచెపు నరు సంగతిచే /నంచితముగ గీడు వచ్చు నది యెట్లన్నన్‌ /గించిత్తు నల్లి కుట్టిన/ మంచమునకు జేటు వచ్చు మహిలో సుమతీ’’ అంటున్నారు.  

శవం మీద ఉన్న పూలదండనే కాదు, కింద జారిపడినా దాన్ని ఎవరూ తీసుకుని వాడుకోరు సరికదా... అసలు వేలితో ముట్టుకోరు. కర్రతో పక్కకు నెట్టేస్తారు. అదే దేవుడి మెడలో పడిన పూలదండ... మరుసటి రోజువరకు ఉన్నా, వాడిపోయినా.. కళ్ళకద్దుకుని తీసుకుని తలమీద పెట్టుకుంటారు, కొప్పుల్లో తురుముకుంటారు. పూలదండ తనంత తానుగా చేసిన మంచీ లేదు, చెడూ లేదు. శవంతో చేరితే గౌరవాన్ని పోగొట్టుకుంది, భగవంతుడి మెడను అలంకరిస్తే పవిత్ర ప్రసాదమయింది. ఎవరితో కలిసున్నామన్న దాన్నిబట్టి గౌరవమయినా, ఛీత్కారమయినా ఉంటుంది. ఇనుప ఊచ ఎంత గట్టిగా ఉంటుంది!!!  అగ్నితో చేరితే మెత్తబడి ఇంటికి కిటీకీ ఊచవుతుంది, నీటితో చేరితే తుప్పుపట్టి నేలరాలిపోతుంది. అందుకే ఎప్పుడూ కూడా దుర్మార్గులతో స్నేహం చేయకూడదు. అలా చేస్తే మనం పాడయిపోవడమే కాదు, మనచుట్టూ ఉన్నవారిని కూడా భ్రష్టుపట్టించే ప్రమాదం ఉంటుందని తెలుసుకుని జీవితంలో  ప్రతి క్షణం  ఆచితూచి అడుగేస్తుండాలి.

బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top