Blood Sugar Levels: చిట్టి చిట్కాలతో గట్టి మేలు!

These Herbs and spices to control blood sugar levels and fat - Sakshi

ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువమందిని వేధిస్తున్న సమస్య మధుమేహం మరొకటి అధిక బరువు. ఇటీవలి కాలంలో ఇవి చాలా సాధారణ సమస్యలుగా మారిపోయాయి. మారిన జీవన శైలి, ఆహార నియమాలు, జంక్‌ఫుడ్స్‌, ఇతర అనారోగ్యకరమైన జీవన పద్ధతులు ఈ ముప్పును మరింత పెంచుతున్నాయి. అయితే మన కిచెన్‌లోని అతి సాధారణ మసాలా దినుసులు, మూలికలతో  షుగర్‌ను, కొలెస్ట్రాల్‌ను అదుపులోకి తేవచ్చు. ఆ వివరాలేంటి ఒకసారి చూద్దాం.

మధుమేహం దీర్ఘకాలిక వ్యాధులలో ఒకటిగా మారిపోయింది. దీని వలన తీవ్రమైన సమస్యలు రావడంతో పాటు, ఒక్కోసారి శారీరక వైకల్యంతో బాడీపై ప్రభావాన్ని చూపిస్తుంది. ఫలితంగా మనిషి సగటు ఆయుర్దాయం కూడా తగ్గిపోతుంది. అయితే  షుగర్‌ వ్యాధి బారిన పడినంత మాత్రాన బెంబేలెత్తిపోవాల్సిన పనిలేదు. తమ రోజు వారీ ఆహారం, తేలికపాటి వ్యాయామాలపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడు తూనే,  శరీరంలో  షుగర్ లెవల్స్‌ను  క్రమబద్ధీకరించుకునేందుకు చిట్కాలు పాటిస్తుండాలి. ముఖ్యంగా వంట ఇంట్లో  మనకు అందుబాటులో ఉండే సుగంధ ద్రవ్యాలు, ఇతర ఆయుర్వేద విలువలు కలిగిన మూలికలతో షుగర్‌ వ్యాధికి చెక్‌  చెప్పవచ్చు. అలాంటి వాటిలో దాల్చిన చెక్క, పసుపు, మెంతులు, జీలకర్ర, సోంపు ప్రధానంగా ఉంటాయి.

 

డయాబెటిక్ పేషెంట్‌కి రక్తంలో చక్కెర స్థాయి సాధారణ స్థాయిలో ఉండటం చాలా ముఖ్యం. ఇందుకు నిత్యం మనం వాడే వస్తువులు దోహదం చేస్తాయి. ముఖ్యంగా పసుపును సూపర్‌ఫుడ్‌గా పరిగణిస్తారు. వ్యాధులనుంచి తప్పించే సహజసిద్ధమైన యాంటిబయోటిక్‌గా పనిచేసే పసుపును ప్రతీ ఒక్కరు తమ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి. మన బాడీలోకి ప్రవేశించే ఏ రకమైన వైరస్ లేదా బాక్టీరియాతోనైనా మనకు తెలియకుండానే ఇది ఫైట్‌ చేసుంది. ఇక మధుమేహం విషయంలో ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగు పరచడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది.

అలాగే కేవలం మాసాలా దినుసుగా మాత్రమే కాదు దాల్చిన చెక్కలో యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. దాల్చిన చెక్క టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని ఒక అధ్యయనంలో తేలింది. దీన్ని మన రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోవడంతోపాటు, షుగర్‌ బాధితులు దాల్చిన చెక్క టీని తీసుకోవచ్చు. అలాగే దాల్చిన చెక్క నీరు లేదా టీ స్థూలకాయాన్ని తగ్గిస్తుంది. ఇది గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

మధుమేహ వ్యాధిగ్రస్తులకు మెంతి గింజలు చాలా మేలు చేస్తాయి. ముఖ్యంగా టైప్-2 డయాబెటిస్ ఉన్నవారికి ఉపయోగం.ఒక టీస్పూన్ మెంతి గింజలను ఒక గ్లాసు నీటిలో నానబెట్టి రాత్రంతా అలాగే ఉంచాలి. మరుసటి రోజు వడకట్టి ఈ నీటిని తాగాలి. లేదా ఆ మెంతులతో పాటు తీసుకున్నా మంచిదే. మనం రోజు పోపు దినుసులా వాడే జీలకర్ర కూడా  సుగర్‌ లెవల్స్‌ను, కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో జీలకర్ర నీటిని తీసుకోవచ్చు. సోంపులో ఉండే అనిథాల్ శరీరంలోని అనేక ఇన్‌ఫ్లమేటరీ ఏజెంట్లను నివారిస్తుంది. సోపు గింజల్లో ఆరోగ్యకరమైన ఎంజైమ్‌లు మధుమేహ బాధితులకు మేలు చేస్తాయి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top